తెలంగాణ భవన్ లో కేసీఆర్ బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ పెట్టారు. నీళ్ల అన్యాయాన్ని ఎజెండాగా తీసుకుని పోరాడాలని ఆయన పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఆయన ప్రజల్లో తిరుగుతారని కేటీఆర్ ఇష్టాగోష్టిగా మాట్లాడినప్పుడు మీడియా ప్రతినిధులకు చెప్పారు. అయితే కేసీఆర్ నేరుగా ప్రజల్లోకి వచ్చే అవకాశాల్లేవని పార్టీ అంతర్గత వర్గాలు చెబుతున్నారు. పూర్తిగా పార్టీని కేటీఆర్ చేతుల్లో పెట్టేసినట్లేనని ఆయన కేవలం ఇక స్ట్రాటజిస్టుగా ఉంటారని అంటున్నారు.
రేవంత్ సమ ఉజ్జీ కాదనుకుంటున్న కేసీఆర్
కేసీఆర్ క్రియాశీల రాజకీయాల్లో లేరని రేవంత్ రెడ్డి చెబుతూ ఉంటారు. ఆయనకు ఆరోగ్యం బాగోలేదని చెబుతున్నారు. కేసీఆర్ ఆరోగ్యంపై అసలైన సమాచారం కుటుంబసభ్యులకే తెలుస్తుంది. ఆయన ఆరోగ్యం గురించి చర్చ పెట్టడం కూడా రాజకీయంగా మంచిది కాదు కానీ కేసీఆర్ రేవంత్ రెడ్డిని తన ప్రత్యర్థిగా చూడటానికి ఇప్పటికీ సిద్ధంగా లేరని చెబుతున్నారు. ఆయన తన సమఉజ్జీ కాదని అనుకుంటున్నారు. ఆయనతో పోరాటాన్ని నామోషీగా భావిస్తున్నారు. అందుకే తెరపైకి వచ్చే అవకాశాలు లేవని ఆయన రాజకీయ వ్యక్తిత్వాన్ని విశ్లేషించిన వారు అంచనావేస్తున్నారు.
రేవంత్ కు కేటీఆర్ చాలన్న సంకేతాలు
రేవంత్ రెడ్డికి కేసీఆర్ అవసరం లేదని…కేటీఆర్ చాలన్న సంకేతాలను ఇప్పటికే బీఆర్ఎస్ ఇచ్చింది. స్వయంగా కేటీఆర్ కూడా ఈ విషయాన్ని ప్రకటించారు. కానీ కేసీఆర్ కు ప్రజల్లో ఉన్నా ప్రత్యేక ఇమేజ్ కారణంగా ఆయన కొంత అయినా యాక్టివ్ గా ఉండాల్సి ఉంటుంది. అందుకే ఆయనతో బహిరంగసభలను మాత్రం బీఆర్ఎస్ ప్లాన్ చేసే అవకాశం ఉంది. ఆ దిశగానే తాజా సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. నెలకో లేకపోతే .. ప్రతి సమస్యకు విడిగా ఓ బహిరంగసభను ఏర్పాటు చేసి కేసీఆర్ ప్రసంగించేలా ఏర్పాట్లు చేయనున్నారు. కేసీఆర్ అంతకు మించి ప్రజల్లోకి వచ్చే అవకాశం లేదని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
బహిరంగసభల్లో ప్రసంగాలకే ఇక కేసీఆర్ పరిమితం – ఫుల్ టైమ్ స్ట్రాటజిస్ట్
కేటీఆర్ ఇప్పటి వరకూ నాయకత్వాన్ని నిరూపించుకోలేకపోయారు. ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేయడానికి ఉపయోగించుకుంటున్నారు. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక బీఆర్ఎస్ సవాళ్లను ఎదుర్కొంటోంది. పార్టీ భవిష్యత్ బలంగా ఉండాలంటే కేటీఆర్ నాయకత్వపరంగా బలపడాలి. అలాంటి ప్రయత్నాలను. చేయడమే ఇప్పుడు కేసీఆర్ చేయగలిగింది. అలా చేయడానికి స్ట్రాటజిస్ట్ గా ఉంటారు కానీ..నేరుగా ప్రజల్లోకి వచ్చే సందర్భాలు దాదాపు ఉండవని బీఆర్ఎస్ వర్గాలు ఓ క్లారిటీకి వచ్చేస్తున్నాయి.