పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వెలువడ్డ వెంటనే ఆవేదన వ్యక్తం చేసిన వారిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకరు. తెలంగాణ ఆదాయం దారుణంగా పడిపోతుందని, ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంపై ఈ నిర్ణయం పిడుగుపాటుగా ఆయన ఆందోళన చెందారు. సరే, ఆ తరువాత రాజకీయ కారణాల దృష్ట్యా ప్రధానమంత్రి మోడీ తీసుకున్న నిర్ణయానికి మద్దతు ఇవ్వాల్సి వచ్చింది!! ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నోట్ల రద్దు నిర్ణయాన్ని వెంటనే స్వాగతించినవారిలో ఒకరు. అయితే, ఆ తరువాత ప్రజల కష్టాలు కళ్లకు పడుతుండే సరికి ఆచితూచి స్పందించారు. దీంతో తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇద్దరూ మోడీ నిర్ణయానికి మద్దతుగా నగదు రహిత లావాదేవీలకు ప్రోత్సాహం అంటూ రకరకాల చర్యలు చేపట్టారు.
అయితే, కేసీఆర్ మాత్రం వాస్తవాలను కుండబద్దలు కొట్టినట్టు వెల్లిడించారు! ఈ త్రైమాసికంలో తెలంగాణ రాష్ట్రం దాదాపు రూ. 10 వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోయిందన్నారు. ఇదంతా నోట్ల రద్దు కారణంగా వచ్చిన నష్టమనీ, లావాదేవీలన్నీ ఆగిపోవడంతో పన్నుల, రిజిస్ట్రేషన్ల, రవాణా, ఆబ్కారీ ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం గణనీయంగా పడిపోయిందని ఆయన తాజాగా చెప్పారు. అంతేకాదు, ఇక్కడో ట్విస్ట్ కూడా ఇచ్చారు! పరిస్థితులు ఎప్పటికి మెరుగవుతాయో అంచనా వేయడం కష్టమనీ, ఇలాంటి తరుణంలో జీఎస్టీ బిల్లును అమలు చేయడం సాధ్యం కాదని కేంద్రానికి స్పష్టం చేశారు. వచ్చే ఏప్రిల్ నుంచి జీఎస్టీ బిల్లు అమలు చేయడం తమకు సాధ్యం కాదని చెప్పేశారు. జీఎస్టీని అమలు చేయడం ద్వారా ఉండే కష్టనష్టాలేంటో ఈ తరుణంలో అంచనా వేయలేమన్నారు.
అయితే, ఈ జీఎస్టీ బిల్లు గురించిగానీ, ప్రస్తుతం గణనీయంగా పడిపోయిన రాష్ట్ర ఆదాయం గురించిగానీ ఇంకా చంద్రబాబు సూటిగా స్పందించింది లేదనే చెప్పాలి! జీఎస్టీ అమలును ఒక్క కేసీఆర్ మాత్రమే కాదు… ఇప్పుడున్న పరిస్థితుల్లో కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, కేరళ, పశ్చిమ బెంగాల్ కూడా ఇదే రకంగా చేతులు ఎత్తేసేందుకు సిద్ధమౌతున్నాయి. ఈ తరుణంలో ప్రధానమంత్రి ఎలా స్పందిస్తారో అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే, భాజపా సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ బిల్లును తీసుకొచ్చింది కదా! స్వాతంత్ర్యం తరువాత భారతదేశ ఆర్థిక సంస్కరణల్లో ఇదో సువర్ణాధ్యాయం అని అభివర్ణించింది.
ఓపక్క మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని సమర్థిస్తూ, నగదు రహితాన్ని ప్రోత్సహిస్తూనే వాస్తవాలను కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఇంకోపక్క జీఎస్టీ బిల్లుపై మెలిక పెడుతున్నారు. మరి, దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ఇంకా స్పందించలేదు. ఇంకా, నగదు రహిత విధానాల ప్రచారంలోనే ఉన్నారుగానీ, వాస్తవంలో ఈ త్రైమాసికం మిగిల్చిన నష్టాలేంటో చెప్పాల్సి ఉంది. ప్రభుత్వ ఆదాయ వివరాల గురించి మాట్లాడం లేదు. రాబోయే రోజుల్లో సంక్షేమ పథకాలకు నిధులు ఎలా సర్దుబాటు చేస్తున్నారో కూడా ఇంకా బయటకి చెప్పలేదు.