కేసీఆర్ అసెంబ్లీని ఎందుకు రద్దు చేశారో ఎవరికైనా అర్థమయిందా..?

KCR dissolving Telangana assembly for no reason,
KCR dissolving Telangana assembly for no reason,

మధ్యంతర ఎన్నికలు కానీ.. ముందస్తు ఎన్నికలు కానీ ఎప్పుడు వస్తాయి..? ప్రభుత్వాలు పడిపోయినప్పుడు వస్తాయి. ఆ పడిపోవడం… అవిశ్వాస తీర్మానాల వల్ల కావొచ్చు.. ముఖ్యమంత్రులు రాజీనామాలు చేయడం ద్వారా కావొచ్చు.. అసెంబ్లీని రద్దు చేయడం ద్వారా కావొచ్చు. మెజార్టీ లెక్కల్లో తేడాలు వస్తే… ప్రభుత్వాలు సహజంగా పడిపోతూంటాయి. ఉన్న అధికారాన్ని వదులుకుని…మరీ అసెంబ్లీని రద్దు చేసుకుని ముందస్తుకు వెళ్లే ప్రభుత్వాలు చాలా పరిమితంగా ఉంటాయి. అలాంటి ప్రభుత్వాల్లో ఒకటి కాగా.. తెలంగాణ తొలి ప్రభుత్వం నిలిచింది. ఇంకా తొమ్మిది నెలల గడువు ఉండగానే కేసీఆర్..ఆపద్ధర్మ సీఎంగా మారారు. అసెంబ్లీని రద్దు చేశారు..? దీనికి ఆయన చెప్పిన కారణం ఏమిటి..?

కొన్నాళ్ల క్రితం.. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు…. ఆ తర్వతా గుజరాత్‌లో నరేంద్రమోడీ కూడా.. ఇలా అసెంబ్లీలను రద్దు చేసి ముందస్తుకు వెళ్లారు. చంద్రబాబుపై నక్సల్ ఎటాక్ జరగడంతో.. సానుభూతి పవనాలు వస్తాయన్న ఉద్దేశంతో ముందస్తుకు వెళ్లారు. అది ఓ రకంగా బలమైన కారణమే…కానీ కలసి రాలేదు. నరేంద్రమోడీ.. గోధ్రా అల్లర్ల కారణంగా.. తన ప్రభుత్వంపై వచ్చిన విమర్శల కారణంగా అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ప్రజాతీర్పు కోరారు. ఇలాంటి సందర్భాల్లో ప్రజలు తీర్పివ్వడానికి సిద్ధంగా ఉంటారు. మరి తెలంగాణలో అసెంబ్లీని రద్దు చేయాల్సిన అవసరం ఏమిటి..?. కేసీఆర్ దీనికి అభివృద్ధి కారణంగా చెప్పారు. తెలంగాణ ప్రగతి చక్రం ఆగకూడదనే ఉద్దేశంతోనే అసెంబ్లీని రద్దు చేశామని చెప్పుకొచ్చారు. కానీ ఈ కారణం.. ప్రజలను మరిత అయోమయానికి గురి చేస్తోంది. ప్రగతి రథ చక్రం అద్భుతంగా పరుగులు పెడుతూంటే… హఠాత్తుగా అసెంబ్లీని రద్దు చేయడం వల్ల .. అది ఆగిపోతుంది కదా అనే సందహం సగటు మనిషికి వస్తుంది.

పోనీ తన ప్రభుత్వానికి ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయా అంటే లేవు. ప్రభుత్వం వల్లే ప్రతిపక్షాలు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. మరి ప్రతిపక్షాలను బూచిగా చూపించే ప్రయత్నం చేయడం ఎందుకు..? కాంగ్రెస్ నేతలు పిచ్చి పిచ్చి, పనికి మాలిన దుర్మార్గమైన ఆరోపణలు చేస్తూ.. ప్రగతిని అడ్డుకుంటున్నారని కేసీఆర్ విమర్శించారు. ఇష్టమొచ్చిన రీతిలో అవాకులు చెవాకులు పేలుతున్నారని ఆరోపించారు. నియంతృత్వ విధానంలో, క్రమశిక్షణతో వెళితేనే నాలుగేళ్లలో తెలంగాణ అభివృద్ధి సాధ్యమైందన్నారు. అంతగా అభివృద్ధి సాధిస్తే.. వాళ్లను కారణంగా చూపి ముందస్తుకు వెళ్లడం ఎందుకుకన్నదే అందరికీ వస్తున్న సందేహం. మొత్తానికి అసలు ముందస్తు ఎందుకు అన్న ప్రశ్న .. ప్రజల మనసుల్లో పెరిగి పెద్దతైతే.. కేసీఆర్‌కు మాత్రం చిక్కులు తెచ్చి పెట్టడం ఖాయమని.. రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి దీన్ని కేసీఆర్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com