ఆ 14 సీట్లు ఎందుకు పెండింగ్..? బీజేపీ కోసమేనా..?

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత.. ఒక్కసారిగా 105 మంది అభ్యర్థుల జాబితా ప్రకటించి సంచలనం సృష్టించారు. ముందు నుంచి ఆయన…ముందస్తుపై చాలా స్పష్టమైన కార్యాచరణ రెడీ చేసుకున్నారని దీని ద్వారా అర్థమైపోతుంది. కానీ ఆ పధ్నాలుగు స్థానాలను మాత్రం ఎందుకు పెండింగ్ పెట్టారు..? వాటిలో ఆశావాహులు ఎక్కువగా ఉన్నారా..? అభ్యర్థుల పేర్లను ప్రకటించకపోవడానికి కారణం ఏమిటి..?. అనే అంశం టీఆర్ఎస్‌తో పాటు రాజకీయవర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ మినహా ఇతర పార్టీల్లో వస్తున్న ప్రధాన సందేహం.. ఆ పధ్నాలుగు సీట్లు.. బీజేపీకి ఇవ్వబోతున్నారా..? అన్నదే. బీజేపీతో ఇప్పటికే సన్నిహితంగా మెలుగుతున్న కేసీఆర్.. ఢిల్లీలోనే పొత్తులు, సీట్ల వ్యవహారాన్ని చక్కబెట్టుకున్నారా అన్న అనుమానం రాక మానదు.

14 స్థానాల విషయంలో… ప్రధానంగా బీజేపీకి ఇవ్వబోతున్నారన్న అనుమానం రాజకీయవర్గాలకు కలగడానికి ప్రధానమైన కారణం.. ఆ పద్నాలుగు స్థానాల్లో ఐదు బీజేపీ సిట్టింగ్ స్థానాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఐదు చోట్ల బీజేపీ ఎమ్మెల్యేలు తాజా మాజీలయ్యారు. ఉప్పల్, ఖైరతాబాద్, గోషామహల్, ముషీరాబాద్, అంబర్ పేట కూడా ఉన్నాయి. వీటిలో ఎక్కడా అభ్యర్థుల్ని ప్రకటించలేదు. నిజానికి ఈ స్థానాల్లో టీఅర్ఎస్ టిక్కెట్ల కోసం.. తీవ్ర స్థాయిలో పోటీ పడే నేతలు లేరు. ఇప్పటికే టిక్కెట్ ఖరారు అనుకున్న నేతలు ఉన్నారు. ముషీరాబాద్‌లో ముఠా గోపాల్ అనే మాజీ టీడీపీ లీడర్‌ ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకున్నారు. కేసీఆర్ హామీ ఇచ్చారని చెప్పుకున్నారు. ఇక ఖైరతాబాద్‌లో మన్నె గోవర్ధన్ రెడ్డి చాలా రోజులుగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఇటీవల పార్టీలో చేరిన దానం నాగేందర్ కూడా రెడీగా ఉన్నారు. ఇలా చూసుకుంటే.. తీవ్ర పోటీ ఉన్న ఇతర నియోజకవర్గాల్లో కూడా… అభ్యర్థుల్ని ప్రకటించిన కేసీఆర్ .. ఈ పధ్నాలుగు చోట్ల మాత్రం పెండింగ్ పెట్టారు. ఇవి కాక బీజేపీ కొంచెం బలంగా ఉందని భావిస్తున్న నియోజకవర్గాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.

ప్రెస్‌మీట్‌లో బీజేపీని కేసీఆర్ పెద్దగా విమర్శించలేదు. దేశంలో మోడీ వ్యతిరేక పవనాలు ఉన్నాయని.. జర్నలిస్టులు ప్రశ్నిస్తే.. దానికి సమాధానం చెప్పేందుకు నిరాకరించారు. ఉన్నాయో లేవో తాను ఎలా చెబుతానని.. కేసీఆర్ ఎదురు ప్రశ్నించారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీని మాత్రం చెడామడా తిట్టేశారు. ఆ పార్టీకి భవిష్యత్ లేదని.. ఉదాహరణలతో సహా చెప్పారు. బీజేపీ విషయంలో కేసీఆర్ చూపించిన సాఫ్ట్ కార్నర్.. ఇతర సీట్ల విషయాన్ని చూస్తే.. కచ్చితంగా సమ్‌ధింగ్..సమ్‌థింగ్ అని అనుమానించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంపై వచ్చే కొద్ది రోజుల్లో.. ఈ విషయంపై ప్రజల్లో కాస్తంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com