ఇవి కేసీఆర్ కుటుంబం వెర్సెస్ ప్ర‌జ‌ల ఎన్నిక‌లు..!

కేసీఆర్ కి పోయే కాలం వ‌చ్చింది కాబట్టి శాస‌న స‌భ ర‌ద్దు చేసుకున్నారంటూ తీవ్రంగా స్పందించారు టీపీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి. గ‌డ‌చిన నాలుగున్న‌రేళ్లుగా కేసీఆర్ తోపాటు ఆయ‌న కుటుంబ స‌భ్యులు ఎలా ప్ర‌వ‌ర్తించారో ప్ర‌జ‌లు ఆలోచించాల్సిన స‌మ‌యం ఇది అన్నారు. సెంట్ర‌ల్ ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ తో మాట్లాడామ‌ని కేసీఆర్ ప్రెస్ మీట్లో చెప్పార‌నీ, కేంద్ర ప్ర‌భుత్వంతో మాట్లామ‌ని అన్నార‌నీ, మాట్లాడిన త‌రువాతే అసెంబ్లీని ర‌ద్దు చేశామ‌ని కేసీఆర్ చెప్ప‌డాన్ని గ‌మ‌నించాల‌న్నారు. అంటే, ఎన్నిక‌ల సంఘంతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారా, అసెంబ్లీ ర‌ద్దుకి ముందు మాట్లాడేది ఏముంటుంద‌నే అనుమానం వ్య‌క్తం చేశారు.

ఒక బందిపోటు దొంగ‌ల ముఠాలాగ దోచుకుని, తెలంగాణ ఇచ్చిన గాంధీ కుటుంబంపై కేసీఆర్ అడ్డ‌గోలుగా వ్యాఖ్య‌లు చేయ‌డం త‌గ‌ద‌న్నారు. గాంధీ కుటుంబాన్ని విమ‌ర్శించే స్థాయి కేసీఆర్ కి లేద‌న్నారు. రాబోయే ఎన్నిక‌లు కాంగ్రెస్ వెర్సెస్ తెరాస ఎన్నిక‌లు భావించొద్ద‌ని ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేస్తున్నా అన్నారు. ఇది కేవ‌లం కేసీఆర్ కుటుంబం వెర్సెస్ తెలంగాణ ప్ర‌జ‌ల మ‌ధ్య జ‌రుగుతున్న ఎన్నిక‌లుగా చూడాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. న‌లుగురున్న కుటుంబం నాలుగు కోట్ల తెలంగాణ ప్ర‌జ‌ల‌ను అనేక విధాలుగా అణ‌చివేసే ప్ర‌య‌త్నం చేసింద‌ని ఉత్త‌మ్ ఆరోపించారు. తెలంగాణ‌లో ప్ర‌జ‌లకు ఉండాల్సిన హ‌క్కులు కూడా లేకుండా చేశార‌నే అంశాన్ని ప్ర‌జ‌లు ఆలోచించాల‌న్నారు.

అసెంబ్లీ ర‌ద్దు త‌రువాత ముఖ్య‌మంత్రి మాట్లాడిన‌వ‌న్నీ అబ‌ద్ధాలే అన్నారు ఉత్త‌మ్‌. తెలంగాణ‌లో దేశంలో దేన్లో నంబ‌ర్ వ‌న్ అయిందో వాస్త‌వాలు చెప్పాల‌న్నారు. మ‌ద్యం విక్ర‌యాల్లో నంబ‌ర్ వ‌న్ గా ఉన్నామ‌న్నారు. రైతులు ఆత్మ‌హ‌త్య‌ల్లో నంబ‌ర్ వ‌న్ గా, అత్య‌ధికంగా అప్పులు తీసుకోవ‌డంలో నంబ‌ర్ వ‌న్‌… అంతేగానీ, ఇత‌ర రంగాల్లో ఏదో అద్భుత ప్ర‌గ‌తి సాధించామ‌నే మాట పూర్తిగా అవాస్త‌వం అన్నారు. కేసీఆర్ రానురానూ ఆద‌ర‌ణ కోల్పోతున్నారు కాబ‌ట్టే ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్తున్నార‌ని ఉత్త‌మ్ వ్యాఖ్యానించారు.

ఈ ఎన్నిక‌లు కేసీఆర్ కుటుంబం వెర్సెస్ తెలంగాణ ప్ర‌జ‌లు మ‌ధ్య జ‌రిగేవ‌న్న నినాదం బాగానే ఉంది. కాక‌పోతే, ఇప్పుడు ఉత్త‌మ్ చేస్తున్న ఆరోప‌ణ‌ల‌న్నీ ప్ర‌జ‌ల్లోకి ఎంత బ‌లంగా కాంగ్రెస్ నేత‌లు తీసుకెళ్ల‌గ‌ల‌రు అనేదే ప్ర‌శ్న‌? కేసీఆర్ చెబుతున్న ప్ర‌గ‌తి అంతా అబ‌ద్ధాల‌ని లెక్క‌ల్తో స‌హా చెప్ప‌గ‌లిగితే కాంగ్రెస్ కీ మ‌రింత ప్ల‌స్ అవుతుంది. ఈ ప్రెస్ మీట్లో చెప్పిన అంశాల‌ను ప్ర‌చారంలో కూడా వినిపించాల్సి ఉంటుంది. యాభై రోజుల్లో వంద స‌భ‌లు పెడుతున్న కేసీఆర్ కు ధీటుగా కాంగ్రెస్ ప్ర‌చార వ్యూహం ఎలా ఉంటుందో చూడాలి మ‌రి!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com