ప్రొ.నాగేశ్వర్: కేసీఆర్ “ఫెడరల్” ప్రయత్నాలు బీజేపీ కోసమేనా..?

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో పర్యటనలు చేస్తున్నారు. కచ్చితంగా ఫెడరల్ ఫ్రంట్ పెడతానన్న సంకల్పాన్ని ఆయన చూపిస్తున్నాయి. అయితే.. ఆయనను .. ఇతర పార్టీలకు చెందిన నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. బీజేపీకి లాభం చేయడానికే ఆయన .. ఫెడరల్ ఫ్రంట్ ప్రస్తావన తెస్తున్నారని ఆరోపిస్తున్నారు. బీజేపీకి లాభం చేస్తారో లేదో కానీ.. కాంగ్రెస్ కు అయితే నష్టం చేస్తారు. కాంగ్రెస్ కు నష్టం కలిగితే.. ఆటోమేటిక్‌గా.. బీజేపీకి లాభం కలుగుతుంది.

ఫెడరల్ టూర్లలో కాంగ్రెస్సేతర, బీజేపీయేతర నేతల్ని ఎందుకు కలవడం లేదు..?

కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పర్యటనలపై… బీజేపీకి సాయం చేస్తున్నారనే విమర్శలు ప్రధానంగా రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. వాటిలో మొదటిది… కేసీఆర్ కొన్ని పార్టీల నేతల్ని మాత్రమే కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన కలవని వారిలో … ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ కూడా ఉన్నారు. దేశంలో మొట్టమొదటి.. కాంగ్రెస్సేతర, బీజేపీయేతర పార్టీ నేత ఎవరైనా ఉన్నారంటే… అది కేజ్రీవాల్ మాత్రమే. ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా.. కాంగ్రెస్ నేతల్ని కానీ.. బీజేపీ నేతల్ని కానీ కలవలేదు. కేజ్రీవాల్ నిఖార్సైన … కాంగ్రెస్సేతర, బీజేపీయేతర నేత. ఆయనను కేసీఆర్ ఎందుకు కలవడం లేదు..?. కేసీఆర్ విశాఖ పట్నం మీదుగా… ఒడిషా వెళ్లాడు. వెళ్లినప్పుడు… ఏపీలో ఉన్న పార్టీలను ఎందుకు ఫెడరల్ ఫ్రంట్ కోసం చేర్చుకునే ప్రయత్నం చేయలేదు. ఏపీలో రెండు జాతీయ పార్టీలు నామమాత్రంగానే ఉన్నాయి. మరి అక్కడ ఉన్న పార్టీల్లో ఒకదాన్ని ఫెడరల్ ఫ్రంట్‌లోకి ఎందుకు ఆహ్వానించడం లేదు.

కాంగ్రెస్‌కు దగ్గరగా ఉన్న వాళ్లనే కేసీఆర్ ఎందుకు కలుస్తున్నారు..?

చంద్రబాబునాయుడుని ఫెడరల్ ఫ్రంట్‌లో కలుపుకునే అవకాశం లేదు. టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఆయన తెలంగాణలో పోటీ చేశారు.. అలాగే కాంగ్రెస్ కూటమిలో ఉండాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో..మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది కదా..? ఆ పార్టీని ఎందుకు ఫెడరల్ ప్రంట్‌లోకి ఆహ్వానించడం లేదు. బీజేపీకి అప్రకటిత మిత్రపక్షంగా ఉంది కాబట్టి.. ఆ పార్టీని తన ఫెడరల్ ఫ్రంట్‌లోకి ఆహ్వానించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్‌కు వ్యతిేరకంగా.. బీజేపీకి వ్యతిరేకంగా… మరో పూర్తి స్థాయి నిర్ణయం తీసుకున్న మరో పార్టీ.. సీపీఎం. కాంగ్రెస్ నాయకత్వంలో పని చేసే ప్రసక్తే లేదని… అయినప్పటికీ.. తమ పార్టీ బీజేపీని ఓడించడమే లక్ష్యమని… సీపీఎం ప్రకటించింది. అలాంటి పార్టీని… కేసీఆర్ ఎందుకు కలుపుకోవడం లేదు. అన్ని రాష్ట్రాలు తిరిగినప్పుడు.. కేరళ వెళ్లి పినరయి విజయన్ ను కూడా కలసి రావొచ్చు కదా..! ఆయన కూడా కాంగ్రెస్ పార్టీపై పోరాడుతున్నారు కదా..!. ఎందుకంటే.. వీరంతా.. బీజేపీకి కూడా బద్ధవ్యతిరేకులు. బీజేపీని వ్యతిరేకించేవారిని కూడా… కలవడం లేదన్నమాట. అంటే.. కాంగ్రెస్ తో కలవడానికి అవకాశం ఉన్న నేతల్నే కలుస్తున్నారు.

బీజేపీపై అసంతృప్తితో ఉన్న పార్టీలను ఫెడరల్ ఫ్రంట్‌లో చేర్చుకోవచ్చుగా..?

మమతా బెనర్జీ, ఎస్పీ అఖిలేష్ యాదవ్, బీఎస్పీ మాయావతి కాంగ్రెస్‌తో కలిసే అవకాశం ఉన్న వారు. అంతకు ముందు జేడీఎస్ ను కలిశారు. వారు కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అంతకు ముంతు డీఎంకే నేతల్ని కలిశారు. డీఎంకే నేత స్టాలిన్ ఇప్పటికే రాహుల్ ప్రధానమంత్రి అభ్యర్థి అని ప్రకటించారు. అంటే.. కాంగ్రెస్ పార్టీ మిత్రుల్ని… కాంగ్రెస్ పార్టీ మిత్రులు కాబోతున్న వారిని.. మాత్రమే కేసీఆర్ కలుస్తున్నారు. ఇక బీజేపీ కూటమిలో.. బీజేపీపై కోపంతో ఉన్న పార్టీలు ఉన్నాయి. యూపీలో అప్నాదళ్, బీహార్‌లో లోక్ జన శక్తి, జేడీయూ నితీష్ కుమార్, మహారాష్ట్రలో శివసేన, జమ్మూకశ్మీర్‌లో పీడీపీ ఉంది.. ఈ పార్టీలన్నింటినీ కేసీఆర్ ఎందుకు కలవడం లేదు. వీరిని కూడా… బీజేపీ వ్యతిరేక.. కాంగ్రెస్ వ్యతిరేక కూటమిలో ఎందుకు వెళ్లడం లేదు. అంటే.. బీజేపీకి మిత్రులుగా ఉన్న.. మిత్రులుగా ఉండటానికి అవకాశం ఉన్న వారిని కలవడం లేదు. కాంగ్రెస్ మిత్రుల్ని మాత్రమే కలుస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీకి వ్యతిరేకంగా… ఉన్న వారిని అసలు కలవడం లేదు. అందుకే… కేసీఆర్ తన ఫ్రంట్ ప్రయత్నాలు బీజేపీ కోసమే చేస్తున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.