మంత్రివ‌ర్గ కూర్పులో కేసీఆర్ మార్పులు చేస్తారా..?

గ‌త ఏడాది డిసెంబ‌ర్ లో తెరాస అంటే.. తిరుగులేని రాజ‌కీయ శ‌క్తి అన్న‌ట్టుగా ప్ర‌భంజ‌నం సృష్టించింది. కానీ, ఇప్పుడు లోక్ స‌భ‌ స్థానాల్లో అనూహ్యంగా త‌గ్గిన ఓటింగ్ స‌ర‌ళి… ఆ పార్టీకి కొత్త స‌మ‌స్య‌గా క‌నిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నిక‌ల త‌రువాత వ‌రుస‌గా స్థానిక సంస్థ‌లు, లోక్ స‌భ ఎన్నిక‌లు ఉండ‌టంతోనే మంత్రి వ‌ర్గాన్ని పూర్తిస్థాయిలో కేసీఆర్ ఏర్పాటు చేయ‌లేదు. కొద్దిమందితో కేబినెట్ న‌డిపించారు. గెలిచిన తెరాస ఎమ్మెల్యేంతా వ‌రుస‌గా వస్తున్న ఎన్నిక‌ల్లో పార్టీని న‌డిపించే ప‌నిలోనే నిమ‌గ్న‌మ‌య్యారు. మంత్రి ప‌ద‌వి కావాలంటే… ఎన్నిక‌ల్లో మంచి ప‌నితీరు క‌న‌బ‌ర‌చాల‌నే ల‌క్ష్యాన్ని నేత‌ల ముందు కేసీఆర్ ఉంచార‌నే చెప్పాలి. అయితే, ఇప్పుడు అదే ప‌నితీరును కొల‌మానంగా బేరీజు వేసుకుని… మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌పై సీఎం కేసీఆర్ కీల‌క నిర్ణ‌యాలు తీసుకునే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం.

ఇప్ప‌టికే కొంత‌మంది మంత్రులుగా ఉన్నవారి నియోజ‌క వ‌ర్గాల్లో తెరాసకు ఓటింగ్ శాతం త‌గ్గిన ప‌రిస్థితిపై కేసీఆర్ విశ్లేష‌ణ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ స‌న‌త్ న‌గ‌ర్ నుంచి అసెంబ్లీకి ఎన్నిక‌య్యారు. ఆయ‌న కుమారుడు సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసినా, సొంత నియోజ‌క వ‌ర్గంతోపాటు జీహెచ్ఎంపీ ప‌రిధిలో భాజ‌పాకి ఓటింగ్ కి పెరిగిన ప‌రిస్థితి ఉంది. బాల్కొండ నుంచి ఎన్నికై, మంత్రిప‌ద‌వి ద‌క్కించుకున్న వేముల ప్ర‌శాంత్ రెడ్డి… నిజామాబాద్ ఎంపీ నియోజ‌క వ‌ర్గం ప‌రిధిలోకి వ‌స్తారు. అక్క‌డ కేసీఆర్ కుమార్తె క‌విత ఓడిపోయారు. మంత్రి సొంత నియోజ‌క వ‌ర్గం బాల్కొండ‌లో కూడా తెరాస కంటే భాజ‌పాకి మంచి ఓటింగ్ వ‌చ్చింది. మ‌రో మంత్రి, మేడ్చ‌ల్ అసెంబ్లీ నియోజ‌క వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మ‌ల్లారెడ్డి… త‌న అల్లుడు మర్రి రాజ‌శేఖ‌ర్ రెడ్డిని మ‌ల్కాజ్ గిరి ఎంపీ అభ్య‌ర్థిగా నిల‌బెట్టారు. అయితే, అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మేడ్చ‌ల్ లో 80 వేల‌కుపైగా అధిక్యం ద‌క్కించుకున్న మ‌ల్లారెడ్డి… సొంత అల్లుడుని ఎంపీగా గెలిపించ‌డంలో, సొంత నియోజ‌క వ‌ర్గంలోనే మ‌రోసారి మెజారిటీ రాబ‌ట్టుకోలేక‌పోయారు.

ఇప్ప‌టికే మంత్రులుగా ఉన్న‌వారు సొంత అసెంబ్లీ సెగ్మెంట్ల‌లో కూడా తెరాస‌కు భారీగా ఓటింగ్ రాబ‌ట్ట‌లేని ప‌రిస్థితి లోక్ స‌భ ఎన్నిక‌ల్లో ఎదురైంది. ఇలా, ప్ర‌ముఖ నేత‌లందరి ప‌నితీరునూ కేసీఆర్ అంచ‌నా వేస్తున్న‌ట్టు తెలుస్తోంది. లోక్ స‌భ ఎన్నిక‌ల్లో బాగా ప‌నిచేసి, ఎంపీ అభ్య‌ర్థుల గెలుపున‌కు కార‌కులైన‌వారికి కేబినెట్ లో బెర్త్ గ్యారంటీగా ఉంటుంద‌నే ప్ర‌చారం ఒక ప‌క్క జ‌రుగుతూ ఉంటే… ఇప్ప‌టికే మంత్రి ప‌ద‌వులు తీసుకుని… సొంత నియోజ‌క వ‌ర్గాల్లోనే తెరాస‌కు ఆధిక్య‌త సాధించిపెట్ట‌లేనివారి ప‌ద‌వుల్లో మార్పులు ఉండే అవ‌కాశాలు ఉంటాయ‌నే చర్చ కూడా వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com