కృష్ణా జలాల వివాదంపై ఢిల్లీలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన వాదనను స్పష్టంగా వివరించారు. కేంద్ర మంత్రి ఉమాభారతి సమక్షంలో తెలంగాణ రాష్ట్ర వాదనలు, వాటికి ఉన్న ఆధారాలను ఆయన వివరించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఏపీ ప్రభుత్వం అభ్యంతరం చెప్తున్న రెండు ప్రాజెక్టులూ పాతవేనని కేసీఆర్ స్పష్టం చేశారు.
పాలమూరు, డిండి ప్రాజెక్టులు పాతవేనని కేసీఆర్ స్పష్టంగా వివరించారు. వీటికి సంబంధించి గతంలో జారీ అయిన ఉత్తర్వులు, ఇతర ఆధారాలను వెల్లడించారు. టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోల్లో ఈ ప్రాజెక్టులను ప్రస్తావించారని కేసీఆర్ ఉటంకించారు. ఇంతకంటే పెద్ద ఆధారం ఉండదని తేల్చి చెప్పారు.
కృష్ణాతోపాటు గోదావరి జలాల వినియోగంలోనూ తెలివిగా వ్యవహరిస్తే రెండు రాష్ట్రాల రైతులకు మేలు కలుగుతుందని కూడా పవర్ పాయింట్ ప్రజంటేషన్ లో వివరించారు. శ్రీశైలం వద్ద నీటి లభ్యతను బట్టి, ఎవరికీ ఇబ్బంది లేకుండా ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణ చేసుకోవడం కష్టం కాదన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తన వాదనను వినిపించారు.
ఒక్క సమావేశంలోనే అద్భుతాలు జరుగుతాయనుకోవడం అత్యాశే కావచ్చు. అయితే, వివాదాన్ని పరిష్కరించే దిశగా ఒక అడుగు ముందుకు పడిందని భావించవచ్చు. కనీసం మూడు అంశాలపై ఏకాభిప్రాయం కుదరడం మంచి పరిణామమే. పొరుగు రాష్ట్రాల ప్రభుత్వాలు శత్రుదేశాల్లా కొట్టాడుకోవడం కంటే, ఒక సుహ్రుద్భావ వాతావరణాన్ని నెలకొల్పడానికి ప్రయత్నంగా దీన్ని భావించ వచ్చు. నెగెటివ్ కోణంలో చూస్తే ఈ సమావేశం వృథా అనిపించవచ్చు. సానుకూల దృష్టితోచూస్తే, ఘర్షణాత్మక వైఖరిని తొలగించడానికి జరిగిన ప్రయత్నం ఫలించిందని అర్థమవుతుంది.