సరిసంఖ్య రిజిస్ట్రేషన్ నంబర్ల వాహనాలను మాత్రమే ఒకరోజు, బేసిసంఖ్య నంబర్లు వున్న వాహనాలను మాత్రమే మరుసటి రోజు రోడ్ల పై అనుమతించే విధానం అమలు చేస్తున్న ఢిల్లీ ప్రభుత్వ విధానాన్ని బెంగళూరులో కూడా అమలు చేసే విషయం కర్నాటక ప్రభుత్వం పరిశీలిస్తోంది.
ఈ విషయంలోనే కాదు, బిజెపిని అవమానకరమైన పరాజయంలోకి నెట్టేసి కేంద్రాన్ని నిరంతరం విమర్శించే, ధిక్కరించే వైఖరితో వున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ని దేశవ్యాప్తంగా ముఖ్యంగా అధికారంలో వున్న నాయకులందరూ ఆసక్తి, కుతూహలాలతో గమనిస్తూనే వుంటారు.
సాంఘిక సంక్షేమం, వ్యక్తిగత లబ్ధిపధకాలు, కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య సానుకూలతలు, వ్యతిరేకతలనే ఫీల్డుగా చేసుకుని రాజకీయాపార్టీలు ఎన్నికల ఆట ఆడుతున్నాయి. ప్రజలను ఓట్లుగా చూసే వ్యవస్ధే రాజకీయపార్టీలకు క్రీడా స్ధలంగా వుంది. అయితే విద్యా ప్రమాణాలవల్లా, గ్లోబలీకరణ ప్రభావాలవల్లా, సాంకేతిక విజ్ఞానాల అందుబాటువల్లా ప్రజల ఆశల్లో, ఆకాంక్షల్లో వస్తున్న మార్పుల్ని అవగతం చేసుకోవడంలో అన్నీ రాజకీయపార్టీలూ విఫలమయ్యాయి. లేదా కేజ్రీవాల్ అందరికంటే ముందున్నారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలే ఇందుకు సాక్ష్యం.
కొద్దిపాటి మహానగరాలకే తప్ప మనదేశానికి కేజ్రీవాల్ మోడల్ సరిపోదని భావించే నాయకులు కూడా వున్నారు. ”కేజ్రీవాల్ వ్వవస్ధను మార్చేయబోవాలనుకోవడం లేదు. ఇపుడున్న స్ధితిలో మెరుగుదలను మాత్రమే ఆయన కోరుతున్నారు. మధ్యతరగతి ప్రజల ఆశలు ఆకాంక్షల్ని ఆయన సరిగా గుర్తించారు. వాటిని నెరవేర్చగలనన్న నమ్మకం కల్పించారు” అని సిపిఎం పాలిట్ బ్యూరో మెంబర్ రాఘవులు ఒక టివి ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.
”ప్రజోపయోగ కార్యక్రమాలను అమలు చేయడంలో నేను రాజకీయ లాభనష్టాలను చూడబోను. ట్రాఫిక్, కాలుష్యాల నియంత్రణ కోసం సరి-బేసి విధానం అమలు చేస్తున్నాము. ఇందువల్ల వచ్చే ఏడు జరిగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేము ఓడిపోవచ్చు! అయినా ఈ విధానం ప్రజలకు అవసరమైనది కాబట్టి కొనసాగిస్తాము. అవసరాల్ని బట్టి మార్పులు చేర్పులు చేస్తాము. వాహనదారుల్లో స్వియ నియంత్రణ భావనను ప్రవేశపెట్టడమే ఇందులో ప్రధాన లక్ష్యం! ఎల్లకాలమూ దీన్ని కొనసాగించాలన కాదు”. అని కేజ్రీవాల్ చెబుతున్నారు.
ఓడిపోతామని తెలిసికూడా నమ్మిన పద్ధతిని అమలు చేయడానికి దమ్ము వుండాలి! రాజకీయాల్లో ఆట నియమాల్నీ, నిబంధనల్నీ మార్చేస్తున్న ఆటగాడు కేజ్రీవాల్ ని ఎందరెందరు అనుసరిస్తారో మూడేళ్ళలో ఒక లెక్క తేలుతుంది!