కేరళలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయాలు ఇప్పుడు తెలంగాణలోనూ హాట్ టాపిక్ అవుతున్నాయి. చివరికి అక్కడ కూడా బీజేపీ కమలం వికసిస్తోంది కానీ తెలంగాణలో మాత్రం ఒక అడుగు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కి అన్న చందాన వెళ్తోంది. ఎందుకిలా అంటే.. చాలా కారణాలు కనిపిస్తున్నాయి. కేరళలో బీజేపీ యువనాయకత్వం ఎక్కువ లీడ్ తీసుకుంటోంది. కానీ తెలంగాణలో పాతుకుపోయిన లీడర్లే .. తమదే పట్టు ఉండాలని ఇతరుల్ని ఎదగనీయడం లేదు. అక్కడే అసలు పొరపాటు జరిగింది.
కేరళలో పుంజుకున్న బీజేపీ
కేరళలో భారతీయ జనతా పార్టీకి పాజిటివ్ కన్నా నెగెటివ్ ఎక్కువగా ఉంటుందని ఎక్కువ మంది అనుకుంటారు. సహజంగా నిన్నామొన్నటి వరకూ జరిగింది అదే. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఆ పార్టీ బలంగా కేరళ రాజకీయ యువనికపై తనదైన ముద్ర వేస్తోంది. భయంకరమైన మాస్ లీడర్లు ఎవరూ లేరు. సురేష్ గోపి లాంటి సినిమా స్టార్లను నమ్ముకున్నారు. ఆయన వ్యక్తిగత ఇమేజ్ తో లోక్ సభ ఎంపీగా త్రిస్సూర్ నుంచి గెలిచారు. ఇక పార్టీ నేతల్ని ఇతర రాష్ట్రాల నుంచి రాజ్యసభకు పంపి వారికి కేంద్ర మంత్రి పదవుు ఇచ్చి ప్రోత్సహించేవారు. కానీ అసలు మార్పు వచ్చింది.. యువతను..కొత్త వారిని ప్రోత్సహించిన తర్వాతనే.
కేరళలో బీజేపీ వైపు ఆకర్షితులవుతున్న యువత
దేశ రాజకీయాల్లో కులాల రాజకీయాలను ఎవరూ తక్కువ చేయలేరు. అత్యధిక అక్షరాస్యత ఉన్న కేరళలోనూ అదే పరిస్థితి. ఈ కుల రాజకీయాలలో రెండు కూటముల మధ్య మరో ప్రత్యామ్నాయం కోసం యువత ఎదురు చూస్తోంది. ఆ ప్రత్యామ్నాయం బీజేపీ రూపంలో కనిపిస్తోంది. యువత రాజకీయాల్లో పని చేయడానికి పెద్దగా డబ్బుతో పని ఉండదు. కేరళలో ఇంకా డబ్బు స్వామ్యం పూర్తి స్థాయిలో పురి విప్పలేదు. అందుకే పెద్ద ఎత్తున కాలేజీ స్థాయిలోనే యువత రాజకీయాల వైపు మొగ్గుతున్నారు. వారికి బీజేపీ అవకాశాలు కల్పిస్తోంది. అదే బీజేపీ ఎదగడానికి కారణం అవుతోంది. కొన్ని కులాలు, హిందూత్వ వాదం.. ఇలా అన్నీ కలసి సవ్తున్నాయి. తమ ప్లస్ పాయింట్లను పక్కాగా ఉపయోగించుకుంటున్నారు.
తెలంగాణలో ఎవర్నీ ఎదగనీయని నాయకత్వం
తెలంగాణ బీజేపీలో ఉండే అవ లక్షణం గురిచి అందరూ చెప్పే మాట.. ఆ పార్టీలో ఎవరైనా చేరితే వాళ్లను ఎదగనివ్వరు. వారికి చిరాకుపుట్టి పార్టీ నుంచి వెళ్లిపోయేలా చేస్తారు. నాగం జనార్ధన రెడ్డి నుంచి తాజాగా ఈటల రాజేందర్ వరకూ అదే జరుగుతోంది. పాత నాయకత్వమే వేలాడుతూ ఉంటుంది. ఆ పార్టీలో కింది స్థాయి నుంచి ఎదిగిన నేత ఎవరూ ఉండరు. ఎందుకంటే రానివ్వరు. ఎదుగనివ్వరు. అందుకే బీజేపీ ఎదగడం లేదని ఎక్కువ మంది అభిప్రాయం. బీజేపీ నేతలు వ్యక్తిగత ప్రయోజనాలను పక్కన పెట్టి .. తాము తగ్గిపోయినా పర్వాలేదు.. పార్టీ బలపడాలనుకున్న రోజున.. .కేరళలో సాధించిన విజయాలే.. తెలంగాణలోనూ వచ్చే అవకాశం ఉందన్నది ఎక్కువ మంది భావన.
