కొద్ది రోజుల క్రితం బొగ్గుల శ్రీనివాస్ అనే వ్యక్తిని ఖమ్మంలో కొంత మంది హత్య చేసి కారుతో సహా పాలేరు కాలువలోకి నెట్టేశారు. ప్రమాదవశాత్తూ జరిగిందని నమ్మించే ప్రయత్నం చేశారు. ఆ కేసులో పోలీసులు దర్యాప్తు చేసి హత్యగా తేల్చారు. బొగ్గుల శ్రీనివాస్ తో ఆర్థిక లావాదేవీలు ఉన్న వేణుమాధవరెడ్డి అనే వ్యక్తి సుపారీ గ్యాంగ్ తో ఈ హత్య చేయించినట్లుగా గుర్తించారు.
ఈ బొగ్గుల శ్రీనివాస్ అనే వ్యక్తి ప్రముఖులపై ఇష్టం వచ్చినట్లుగా కామెంట్లు, పుస్తకాలు రాసి పబ్లిసిటీ పొందుతూ ఉంటారు. గతంలో పవన్ కల్యాణ్ పై ఓ పుస్తకం రాశారు. పవన్ కొత్తగా జనసేన ప్రారంభించిన సమయంలో పుస్తకం రాసి ..ఓ వంద పుస్తకాలు అచ్చు వేయించి.. మీడియాలో పబ్లిసిటీ చేయించారు. అప్పట్లో కావాల్సినంత ప్రచారం పొందారు. జన సైనికుల నుంచి తనకు ప్రాణహాని ఉందని కూడా చెప్పుకున్నారు. అయితే ఎవరూ పట్టించుకోలేదు. తర్వాత కూడా ఆయన పుస్తకాలు రాశారో లేదో కానీ ఆ వచ్చిన పేరుతో ఆయన పరిచయాలు పెంచుకున్నారు.
రకరకాల వ్యాపారాలు చేస్తున్నారు. ఈ క్రమంలో వేణుమాధవరెడ్డితో కలిసి చేసిన వ్యాపారాల్లో జీఎస్టీ.. ఇతర నగదు విషయాల్లో తేడా రావడంతో బొగ్గుల శ్రీనివాస్ బెదిరింపుల్ని తట్టుకోలేక అతన్ని అంతమొందించాలని నిర్ణయించుకున్నారు. డబ్బులు ఇస్తానని కారులో విజయవాడకు పిలిపించుకుంటూ.. దారి మధ్యలో చంపేసి.. నదిలోకి తోసేశారు. ఈ విషయం బయటపడిన తర్వాత కొంత మంది రాజకీయ కుట్రలు ప్రారంభించారు. పవన్ కల్యాణ్ ని తిడుతూ పుస్తకం రాశాడు కాబట్టి ఆ కోణంలో అనుమానించాల్సిందనని అతి చేశారు. కానీ చివరికి పోలీసులు అసలు విషయం బయట పెట్టారు.
ప్రముఖుల్ని తిడుతూ పుస్తకాలు రాయడం.. తామేదో గొప్పగా సాధించామని ప్రచారం చేసుకోవడం.. తర్వాత వారికేదో అయితే.. ఆ ప్రముఖుల్ని నిందించడం సోషల్ మీడియాలో ఓ పెద్ద వ్యాపారంగా మారుతోంది. కొంత మంది మొన్న కత్తి మహేష్.. నిన్న బొగ్గుల శ్రీనివాస్..రేపు మేమే అన్నట్లుగా పోస్టులు పెట్టి అతి చేయడం చూసి ఇదేం పైత్యం అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
