ఆగస్టు 31న ‘కింగ్ డమ్’ సినిమా విడుదల అవుతోంది. విజయ్ దేవరకొండ – గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. ఈ సినిమాపై నిర్మాత నాగవంశీ చాలా నమ్మకాలు పెట్టుకొన్నాడు. టీజర్ కూడా ఆసక్తికరంగా ఉంది. పాన్ ఇండియా స్థాయిలోనే ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. అయితే హిందీ నుంచి గట్టి సమస్య ఎదురవుతోంది. టైటిల్ రూపంలో.
పాన్ ఇండియా సినిమా అనేది అన్ని భాషల్లోనూ ఒకే పేరుతో విడుదల అవ్వడం ఆనవాయితీ. అలాంటి టైటిల్స్ మాత్రమే దర్శకులు ఎంచుకొంటారు. ‘కింగ్టమ్’ అనేది పాన్ ఇండియా టైటిలే. అందరికీ ఈజీగా అర్థం అవుతుంది. కాకపోతే… హిందీలో ఈ టైటిల్ ఆల్రెడీ ఓ నిర్మాత రిజిస్టర్ చేయించుకొన్నారు. ఇప్పుడు హిందీ కోసం మరో టైటిల్ పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడింది. వేరే టైటిల్ తో ఈ సినిమాని విడుదల చేయడం నిర్మాత నాగవంశీకి ఇష్టం లేదు. అందుకే ఈ టైటిల్ ఎలాగైనా సరే సంపాదించాలన్న ప్రయత్నంలో ఉన్నారు. ఒకవేళ టైటిల్ దొరక్కపోతే.. కింగ్ డమ్ అనే అర్థం వచ్చే మరో టైటిల్ వెదికి పెట్టాలన్న ఆలోచనలో ఉన్నారు. ”సినిమాకి టైటిల్ నిర్ణయించినప్పుడు అన్ని భాషల్లో అందుబాటులో ఉందా లేదా? అనేది చూసుకోలేదు. అలా క్రాస్ చెక్ చేసుకొని ఉంటే బాగుండేది. ఇప్పటికీ హిందీలోనూ ఈ పేరుతోనే విడుదల చేసేలా ప్రయత్నాలు చేస్తున్నాం. చూడాలి.. ఏం జరుగుతుందో” అని చెప్పుకొచ్చారు నాగవంశీ.
అన్నట్టు.. ‘కింగ్ డమ్’ ఓటీటీ రైట్స్ కూడా మంచి రేటుకే అమ్ముడైపోయాయి. రూ.50 కోట్లకు ఈ సినిమా ఓటీటీని నెట్ ఫ్లిక్స్ సంస్థ చేజిక్కించుకొంది.