ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా పైకి ఎదుగుతున్న హీరో కిరణ్ అబ్బవరం. ‘క’ తనకు గట్టి బూస్టప్ ఇచ్చింది. ఇప్పుడు తన చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. ‘కె-ర్యాంప్’ ఈ దీపావళికి విడుదల అవుతోంది. దీనిపై మంచి అంచనాలే ఉన్నాయి. పైగా కిరణ్‌కి దీపావళి బాగా కలిసొచ్చింది. గతేడాది సరిగ్గా ఇదే సమయానికి ‘క’ రిలీజ్ అయి మంచి విజయాన్ని అందుకొంది. అ పండక్కీ… ఆ విజయపరంపర కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అయితే కిరణ్‌పై ఎంత పాజిటివిటీ ఉందో, అంతే నెగిటివిటీ కూడా ఉంది. ముఖ్యంగా ‘సింపతీకార్డు’ వాడి జనాల్ని థియేటర్లకు రప్పిస్తాడంటూ సోషల్ మీడియాలో కొంతమంది నెగిటీవ్ కామెంట్లు చేయడం మొదలెట్టారు. తమిళనాట తెలుగు సినిమాలకు థియేటర్లు ఇవ్వడం లేదని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశాడు కిరణ్. దాంతో ‘మళ్లీ సింపతీ కార్డా..’ అంటూ కిరణ్‌ని టార్గెట్ చేయడం మొదలెట్టారు. ఇది.. కిరణ్ వరకూ వెళ్లింది. దానిపై ఘాటుగానే స్పందిస్తున్నాడు.
సింపతీ కార్డు వాడాల్సిన అవసరం తనకు ఏమాత్రం లేదని, సింపతీతో తెగే ఒక్క టికెట్ కూడా తనకు వద్దని తెగేసి చెబుతున్నాడు కిరణ్. ”ఇన్నాళ్లు కష్టపడి వచ్చాను. నేను ఎవరి జోలికీ వెళ్లలేదు. నా సినిమాలు, నా ఆఫీసు, నా కుటుంబం.. ఇవే నా ప్రపంచం. ‘నా సినిమా చూడండి.. నా గురించి బాగా రాయండి’ అని ఎవర్నీ అడగలేదు. సినిమా పోతే… జనంపై రుద్దాలని కూడా అనుకోలేదు. నా ఫ్లాప్స్ ని నేను ఒప్పుకొన్నా. నాకు కష్టం వస్తే నేను మాట్లాడా. తమిళనాడులో మన తెలుగు హీరోలకు సరైన థియేటర్లు దొరకడం లేదు… అక్కడ ఓ ఫ్లాట్ ఫామ్ కావాలి అని అడిగాను. అందులో తప్పేంటి? అది నా కోసం కూడా అడగలేదు. నాలాంటి యూత్ హీరోలందరి తరపున అడిగాను. అలా అడగడమే తప్పా? ఇకపై ఇలాంటి విషయాలపై కూడా స్పందించడం అనవసరం అనిపిస్తుంది. నేను ఎవరి గురించైతే మాట్లాడానో వాళ్లు కూడా నన్ను సపోర్ట్ చేయలేదు. అలాంటప్పుడు మాట్లాడడం అనవసరం” అని చెప్పుకొచ్చాడు కిరణ్ అబ్బవరం.