సింగరేణి బొగ్గు గనుల వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఇటు బీఆర్ఎస్, అటు కాంగ్రెస్ పార్టీలను ఇరకాటంలో పడేసేలా కనిపిస్తోంది. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి తనకున్న అధికారాలను ఉపయోగిస్తూ సింగరేణిలో జరుగుతున్న పరిణామాలపై విచారణ జరిపిస్తున్నారు. ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్ టెండర్ల రద్దుతో పాటు గతంలోని తాడిచర్ల మైనింగ్ అక్రమాల విచారణ జరిపేందుకు కేంద్రం నుండి ఇద్దరు ఉన్నతాధికారులు కోల్ డిప్యూటీ డైరెక్టర్ చేత్న శుక్లా, కోల్ డైరెక్టర్ ఎం. వెంకటేశ్వర్ ) బృందాన్ని రంగంలోకి దింపారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సింగరేణిని ఒక రాజకీయ ప్రయోగశాల గా మార్చారని, తాడిచర్ల బ్లాక్‌ను సొంత ప్రయోజనాల కోసం ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారని కిషన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తోందని, సైట్ విజిట్ సర్టిఫికేట్ వంటి వింత నిబంధనలతో నచ్చిన వారికి కాంట్రాక్టులు కట్టబెట్టే ప్రయత్నం చేసిందని ఆయన ఆరోపిస్తున్నారు. సింగరేణిలో కేంద్రానికి 49 శాతం వాటా ఉండటంతో, సంస్థ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు , పారదర్శకత కోసం తాను నేరుగా జోక్యం చేసుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
ఈ విచారణ ద్వారా అటు కేసీఆర్ కుటుంబంపై వస్తున్న ఆరోపణలను, ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై వస్తున్న టెండర్ల అక్రమాల ఆరోపణలను ఒకేసారి ఎండగట్టే అవకాశం కిషన్ రెడ్డికి లభించింది. టెండర్ల ప్రక్రియలో ఇతర బొగ్గు కంపెనీలు అనుసరిస్తున్న విధానాలకు భిన్నంగా సింగరేణి ఎందుకు వ్యవహరిస్తుందో తేల్చాలని ఆయన అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణకు కూడా కేంద్రం సిద్ధంగా ఉందని ఆయన సవాల్ విసిరారు.ఈ విచారణతో సింగరేణి విషయంలో బీజేపీకి అడ్వాంటేజ్ లభించడం ఖాయంగా కనిపిస్తోంది.