Kishkindhapuri Movie Review
తెలుగు360 రేటింగ్:2.25/5
హారర్ జోనర్‌కు సెపరేట్ ఫ్యాన్ బేస్ వుంది. భయపెట్టడం చేత కావాలే కానీ… కాసుల వర్షం కురిపిస్తుంది. ఇది వరకు.. హారర్ జోనర్ అంటే తక్కువ బడ్జెట్ లో తీసేసే ఓ ప్రాజెక్ట్. పెద్ద హీరోలు పెద్దగా ఇంట్రస్ట్ చూపించేవాళ్లు కాదు. ఇప్పుడు ఆ ఆలోచనా సరళి మారింది. హారర్ జోనర్ కు బడ్జెట్ లు పెరుగుతున్నాయి. పెద్ద హీరోలు నటించడానికి ముందుకు వస్తున్నారు. హారర్ సినిమా రెండొందలు, మూడొందల కోట్లు వసూలు చేయడం చూస్తున్నాం. ఆడియన్స్ కూడా బాగా పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో హారర్ సినిమాలకు ఇంకాస్త డిమాండ్ పెరిగింది. యాక్షన్ సినిమాలు ఎక్కువగా చేసే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా ఈసారి హారర్ జోనర్ ఎంచుకోవడానికి కారణం అదే. కిష్కింధపురి అనే టైటిల్.. బెల్లంకొండ – అనుపమ పరమేశ్వరన్ ల జంట.. ఈ సినిమాపై ఫోకస్ మరింత పెరిగేలా చేశాయి. ”సినిమా మొదలైన పది నిమిషాల తరవాత… ఆడియన్స్ మొబైల్స్ చూసుకొంటే నేనిక సినిమాలు చేయను” అంటూ.. బోల్డ్ స్టేట్ మెంట్ ఇచ్చాడు బెల్లంకొండ. ఇదంతా.. ఈ సినిమాపై తనకున్న నమ్మకాన్ని బటయపెట్టాయి. అది కూడా పబ్లిసిటీ కి బాగా హెల్ప్ అయ్యింది. మరి.. ఇన్ని నమ్మకాలు, అంచనాల మధ్య వచ్చిన `కిష్కింధపురి` ఎలా వుంది? అందులో ఉన్న దెయ్యం భయపెట్టిందా… లేదా?
‘కిష్కింధపురి’ అనే ఊరిలో కొన్ని హాంటెడ్ హౌస్ లు ఉంటాయి. సువర్ణ మాయ అనే ఓ ఇంట్లో.. ఓ దెయ్యం తిరుగుతుంటుంది. ఆ ఇంట్లో అడుగుపెట్టిన వాళ్లందరినీ ఆ దెయ్యం చంపేస్తుంటుంది.. రాఘవ్ (బెల్లంకొండ శ్రీనివాస్) హాంటెడ్ హౌస్‌లకు జనాల్ని తీసుకెళ్లి, వాళ్లకు దెయ్యం ఉందని నమ్మించి – సొమ్ము చేసుకొంటుంటాడు. అయితే రోజున సువర్ణ మాయలోకి ఓసారి అనుకోకుండా వెళ్లాల్సివస్తుంది. అక్కడ రేడియోలోంచి కొన్ని మాటలు వినిపిస్తాయి. `మీ అందరికీ చావు ఖాయం` అనే హెచ్చరికలు వస్తుంటాయి. అన్నట్టుగానే రాఘవ్ తీసుకెళ్లిన టూరిస్టులు ఒకొక్కరిగా మరణిస్తుంటారు. ఈ చావులకు కారణం సువర్ణ మాయలో ఉన్న దెయ్యమేనా? ఇంతకీ ఆ రేడియోకీ, దెయ్యానికీ ఉన్న సంబంధం ఏమిటి? తనని నమ్ముకొన్నవాళ్లని రాఘవ్ ఎలా కాపాడాడు? అనేది మిగిలిన కథ.
సెటప్ పరంగా కొత్తగా ఉన్న హారర్ సినిమా ఇది. ఓ రేడియో స్టేషన్.. అందులోంచి వినిపించే గొంతు.. ఆ గొంతు వెనుక ఉన్న రహస్యం… ఇవన్నీ ఆసక్తి కలిగించే అంశాలే. రేడియో స్టేషన్లో జరిగే హత్యా కాండ దగ్గర్నుంచి కథ మొదలు అవుతుంది. ఆ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా తీర్చిదిద్దాడు దర్శకుడు. ఆ తరవాత హీరో ఇంట్రడక్షన్, హీరోయిన్‌తో ఓ డ్యూయెట్ వేసుకోవడంతో అసలు కథలోకి వెళ్లడానికి కొంత సమయం తీసుకోవాల్సివచ్చింది. కిష్కిందపురి రామాయణంలో జరిగిన కోతుల ఫైట్.. బాగా డిజైన్ చేశారు. కాకపోతే.. ఈ కథకూ, ఆ కోతుల ఫైట్కీ సంబంధం ఏమిటన్నది అర్థం కాదు. ‘కిష్కింధపురి’ అనే టైటిల్ పెట్టారు కాబట్టి, కోతుల్ని ఒక్కసారి కూడా చూపించకపోతే జస్టిఫికేషన్ జరగదు కాబట్టి.. అలాంటి ప్రయత్నం చేశారేమో..?
సువర్ణ మాయలో హీరో అండ్ కో అడుగు పెట్టిన దగ్గర నుంచి అసలు కథ మొదలవుతుంది. ఆ ఇంట్లో అడుగు పెట్టిన వాళ్లు ఒకొక్కరిగా చనిపోవడం, ఆ చావులకు కారణం వెదుక్కొంటూ హీరో ఇన్వెస్టిగేషన్ చేయడం. అందులోంచి నిజాలు రాబట్టడం.. ఇవన్నీ కాస్త ఆసక్తి కలిగిస్తాయి. ఇంట్రవెల్ బ్యాంగ్ కూడా ఓకే అనిపిస్తుంది. ప్రధమార్థంలో పెద్దగా కంప్లైంట్స్ ఏం ఉండవు. అలాగని `వావ్` అనిపించే మూమెంట్స్ కూడా కనిపించవు. జస్ట్ టైమ్ పాస్ అవుతుంది. ఇలాంటి కథలకు సెకండాఫ్ చాలా కీలకం. దెయ్యం ఫ్లాష్ బ్యాక్ లో పట్టు ఉండాలి. ఆ పాత్రతో సింపతీ ఏర్పడాలి. లేదంటే పూర్తిగా భయపడాలి. అయితే ఇవి రెండూ ఈ దెయ్యం ఫ్లాష్ బ్యాక్ లో కనిపించలేదు. కొన్నిసార్లు దెయ్యానికి అవమానం, అన్యాయం జరిగిందని చూపిస్తాడు. ఇంకొన్నిసార్లు దెయ్యానిదే తప్పు అంటాడు. దాంతో అసలు దెయ్యం కథని ఎందుకు ఫాలో అవ్వాలి? అనే అనుమానం ప్రేక్షకుడి కి కలుగుతుంది. ష్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా సుదీర్ఘంగా సాగుతుంది. అసలు ఇది దెయ్యం కథా? హీరో కథా? అనేది అర్థం కాదు.
ఆసుపత్రిలో అనుపమ పరమేశ్వరన్ విజృంభణ. ఆ తరవాత సాయి శ్రీనివాస్ `డబుల్` యాక్షన్ ఘట్టాలు ఆసక్తిని రేకెత్తిస్తాయి. క్లైమాక్స్ లో దెయ్యాన్ని కంట్రోల్ చేయడానికి జరిగిన ప్రయత్నం అంత ఆసక్తిగా అనిపించదు. చాలా చోట్ల దర్శకుడు తనకు కావాల్సినట్టుగా తనకు కన్వెనియెన్స్ కలిగేలా స్క్రిప్టు రాసుకొని వెళ్లిపోయాడు. చివర్లో అమ్మ క్యారెక్టకర్ (ప్రేమ)ని రివీల్ చేసే విధానం బాగుంది. అయితే దాన్ని ప్రీ క్లైమాక్స్ లోకి తీసుకొచ్చి, అమ్మ వైపు నుంచి కొన్ని సన్నివేశాలు అల్లితే ఇంకొంచెం ఆసక్తిగా ఉండేది.
బెల్లంకొండకు ఇది కొత్త జోనర్. తనవంతు కష్టపడ్డాడు. చివర్లో డబుల్ యాక్షన్ చేసేటప్పుడు తన నటన బాగుంది. అనుపమది తొలి సన్నివేశాల్లో రొటీన్ పాత్రలా అనిపిస్తుంది. కానీ ఆసుపత్రి సన్నివేశంలో అనుపమ ఈ కథకు ఎందుకు కావల్సివచ్చిందో అర్థం అవుతుంది. సైకో.. క్యారెక్టర్ ఆసక్తి గొలిపిస్తుంది. తన నటన బాగుంది. కాకపోతే… సెకండాఫ్ లో ఈ క్యారెక్టర్ లెంగ్త్ మరీ ఎక్కువయ్యింది. హైపర్ ఆది పంచ్‌లు మామూలుగా అనిపిస్తాయి. అతని క్యారెక్టర్ ఇంకాస్త బాగా డిజైన్ చేసి ఉంటే బాగుండేది.
టెక్నికల్ గా ఈ సినిమా స్ట్రాంగ్ గా ఉంది. ముఖ్యంగా విజువల్స్ ఆకట్టుకొంటాయి. వీఎఫ్ఎక్స్ షాట్స్ కోసం చిత్రబృందం పడిన కష్టం అర్థమవుతుంది. సువర్ణమాయ సెట్ కూడా బాగా కుదిరింది. నేపథ్య సంగీతంతో కాస్త భయపెట్టే ప్రయత్నం చేశాడు. మూడు పాటలు ఉన్నా.. పెద్దగా రిజిస్టర్ కావు. అమ్మ పాట సాహిత్య పరంగా బాగుంది. హారర్ సినిమాలో ఓ కొత్త నేపథ్యాన్ని ఎంచుకొన్నాడు దర్శకుడు. అక్కడి వరకూ కొత్త కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అయితే ఆ కొత్తదనాన్ని చివరి వరకూ కొనసాగించలేకపోయాడు. చాలా చోట్ల తాను కన్ఫ్యూజ్ అయి, ప్రేక్షకుల్ని కూడా కన్ఫ్యూజ్కి గురి చేశాడు. హారర్ జోనర్ కి మిస్టరీ జోడించే ప్రయత్నం చేశాడు. ఈ కలయిక కొత్తది. కాకపోతే.. హారర్‌లో భయం, మిస్టరీలో ఉండే టెన్షన్… ఇవి రెండూ అరకొరగానే పండాయి. అక్కడక్కడ కొన్ని హారర్ ఎఫెక్ట్సులు, ఒకట్రెండు ట్విస్టులు ఈ సినిమాకు వెన్నుదన్నులా నిలుస్తాయి. వాటి కోసం మిగిలిన సినిమా అంతా భరించాలి.
తెలుగు360 రేటింగ్:2.25/5