ఓ పెళ్లిలో కనిపించిన కొడాలి నాని ఆరోగ్యంగా కనిపించారు. ఇక ఆయనపై కేసులు మూవ్ అవడానికి సమయం వచ్చిందని అనుకున్నారు. ఆ ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని తెలియగానే కొడాలి క్యాంపు నుంచి ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. కొడాలి అంత యాక్టివ్ గా లేరని.. ఓ మిత్రుడి ఇంట్లో పెళ్లికి తప్పనిసరిగా హాజరు కావాల్సి వచ్చిందని ఆయన ఇప్పుడు ఎవర్నీ కలవడం లేదని సమాచారం పంపారు.
ఆపరేషన్ చేయించుకుని వచ్చిన తర్వాత కొడాలి నాని ఎక్కువ మందిని కలవడం లేదు. ఆయన అమెరికా వెళ్లేందుకు ప్రణాళికలు వేస్తున్నట్లుగా వెలుగులోకి వచ్చింది. దాంతో పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసింది. వెంటనే.. పౌరుషం కోసమో.. రెచ్చగొట్టాలనో కానీ కొడాలి నాని ఓ పెళ్లి వేడుకలో ప్రత్యక్షమయ్యారు. దాంతో ఆయన బాగానే ఉన్నారని కలిసేందుకు పలువురు ప్రయత్నించారు. కానీ ఆయన ఎవరికీ చాన్స్ ఇవ్వలేదు. ఎవర్నీ కలవడం లేదని.. కలిస్తే ఇన్ ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉన్నందున.. ఎవరూ రావొద్దని అంటున్నారు. రెండు నెలల తర్వాత ప్రజలకు అందుబాటులో ఉంటారని చెప్పుకొచ్చారు.
ఈ రెండు నెలలు అనే సమయం ఎందుకు అంటే.. పోలీసులకు సంకేతాలు ఇవ్వడానికి అంటున్నారు. ప్రస్తుతం గుండె ఆపరేషన్ నుంచి కోలుకోవడానికి రెండు నెలల సమయం పడుతుందని అప్పటి వరకూ సమయం ఇవ్వాలన్న సంకేతాలు పంపారు. పోలీసులు కొడాలి నాని విషయంలో ప్రత్యేక వ్యూహంతో ఉన్నారు. గుండెనొప్పి, ఆపరేషన్ అని తప్పించుకోకపోతే ఇప్పటికే వంశీతో పాటు అదే జైల్లో ఉండే వారన్న అభిప్రాయం ఉంది.