చాప‌కింద నీరులా కోదండ‌రామ్ స్ఫూర్తి యాత్ర‌..!

కొన్ని నెల‌ల కింద‌ట తెరాస నాయ‌కులు కోదండ‌రామ్ ను టార్గెట్ చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఒక స‌గ‌టు రాజ‌కీయ నాయ‌కుడిని విమ‌ర్శించిన రేంజిలో ఆయ‌నపై మాట‌ల దాడి చేశారు. ఆయ‌న కాంగ్రెస్ కు ఏంజెటు లెక్క ప‌నిచేస్తున్న‌డ‌నీ, ఆ పార్టీ ప్ర‌తినిధిగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌డ‌నీ తెరాస నేత‌లు విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్ర‌భుత్వం ప‌నితీరుపై కోదండ‌రామ్ గ‌ళ‌మెత్తిన ప్ర‌తీసారీ ఇలానే వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు దిగ‌డం మొద‌లుపెట్టేశారు. దీంతో కోదండ‌రామ్ కూడా కాస్త త‌గ్గిన‌ట్టుగానే క‌నిపించింది. కానీ, ఆయ‌న చేయాల్సిన ప‌ని చ‌ప్పుడు లేకుండా చేసుకుంటూ పోతున్నార‌ని చెప్పుకోవాలి! ప్రెస్ మీట్లు పెట్టి ప్ర‌భుత్వ తీరుపై ఊరికే ఉప‌న్యాసాలు దంచేకంటే… ప్ర‌జ‌ల్లోల‌కి వెళ్ల‌డ‌మే స‌రైన మార్గ అనుకున్నారు. అమ‌ర వీరుల స్ఫూర్తి యాత్ర పేరుతో ఆయ‌న రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ప‌ర్య‌టించారు. నిజానికి, ఈ యాత్ర‌కు జ‌న స‌మీక‌ర‌ణ చేసే నాయ‌కుల్లేరు, ప్ర‌జ‌ల‌ను త‌ర‌లించేందుకు కావాల్సిన సొమ్ము ఖ‌ర్చూ లేదు. అయినాస‌రే, ఈ యాత్ర‌కు ప్ర‌జ‌ల నుంచి అనూహ్య స్పంద‌న వ‌స్తోంద‌ని జేయేసీ వ‌ర్గాలు ఆనందంతో ఉన్నాయ‌ని తెలుస్తోంది.

తాజాగా సిద్ధిపేట జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ జిల్లాలో ప‌ర్య‌ట‌న ఆశించిన స్థాయి కంటే విజ‌యం సాధించింద‌నీ, తెరాస స‌ర్కారు ప‌ట్ల ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త స్ప‌ష్టంగా క‌నిపించింద‌నీ, ఎవ‌రూ ప‌నిగ‌ట్టుకుని ప్ర‌జ‌ల‌ను త‌ర‌లించ‌క‌పోయినా యాత్ర ద‌గ్గ‌ర‌కు పెద్ద ఎత్తున జ‌నం వ‌స్తున్నార‌నీ, మ‌హిళ‌లూ వృద్ధులూ యువ‌తా త‌మ‌ ప్ర‌సంగాల‌ను ఆసక్తిగా వింటున్నార‌నీ, వారి బాధ‌ల్ని కూడా త‌మ‌తో పంచుకున్నారంటూ జేయేసీ వ‌ర్గాలు చెబుతున్నాయి. మంత్రి హ‌రీష్ రావు ఇలాఖాతోపాటు, కేటీఆర్ ప్ర‌తినిధ్యం వ‌హిస్తున్న ప్రాంతంలో కూడా యాత్ర‌కు మంచి స్పంద‌నే ల‌భించ‌డంతో జేయేసీ ఉత్సాహంగా ఉంది.

ఇలా కోదండ‌రామ్ త‌న‌ప‌ని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే, ఇత‌ర సంద‌ర్భాల్లో కోదండ‌రామ్ పై విరుచుకుప‌డ్డ తెరాస నేత‌లు.. ఇప్పుడు పెద్ద‌గా స్పందించ‌డం లేదు! ఈ యాత్ర గురించి మాట్లాడ‌టం లేదు. కోదండ‌రామ్ ను విమ‌ర్శించ‌డం ద్వారా నెగెటివ్ ప‌బ్లిసిటీ కూడా ఆయ‌న‌కి ఇచ్చిన ప‌బ్లిసిటీ అవుతుంద‌ని అనుకుంటున్న‌ట్టున్నారు. ఈ స్ఫూర్తి యాత్ర గురించి మాట్లాడితే ప్రాధాన్య‌త పెంచిన‌ట్టు అవుతుంద‌నే ఉద్దేశంతోనే అధికార పార్టీ లైట్ తీసుకున్న‌ట్టు కామ్ గా ఉండిపోతూ ఉండొచ్చు. నిజానికి, కోదండ‌రామ్ చుట్టూ ఉన్న‌వారినీ, ఆయ‌న బ‌లాన్నీ బ‌లగాన్నీ త‌గ్గించే ప్ర‌య‌త్నం ఈ మ‌ధ్య తెరాస చేసింది. అయినాస‌రే, ఆయ‌న మ‌రింత బ‌ల‌ప‌డుతున్న‌ట్టుగానే క‌నిపిస్తున్నారు. ప్ర‌తిప‌క్షాల‌కు ఆల్ట‌ర్నేటివ్ గా మ‌రో వాయిస్ పెరుగుతోందన‌డంలో సందేహం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com