కపిల్ దేవ్ కాలాన్ని పక్కన పెడితే సౌరవ్ గంగూలీ టీం నుంచి చూసుకుంటే మాత్రం అసలైన టీం వర్క్ అంటే ఏంటో ప్రస్తుతం విరాట్ కోహ్లి సారధ్యంలో ముందుకు సాగుతున్న ఇండియన్ టెస్ట్ టీం చూపిస్తోంది. ఈ మధ్య కాలంలో విజయవంతమైన కెప్టెన్స్‌గా నిలిచిన గంగూలి, ధోనీ నాయకత్వ లక్షణాలను కోహ్లితో పోల్చి చూసుకుంటే కొన్ని విషయాల్లో మాత్రం కోహ్లినే బెస్ట్ అనిపిస్తున్నాడు. సౌరవ్ గంగూలి, ఎం.ఎస్. ధోనీల వ్యక్తిగత ప్రతిభతో పోలిస్తే కోహ్లి అత్యున్నత స్థాయిలో కనిపిస్తాడు. అలాగే కెప్టెన్సీ విషయంలో కూడా తన ప్రత్యేకతను చూపిస్తున్నాడు కోహ్లి. యువ ఆటగాళ్ళను ప్రోత్సహించడంలో సౌరవ్ గంగూలీ తర్వాతే ఎవరైనా అని అనిపించుకున్నాడు దాదా. ఆ నైపుణ్యంతోనే టీం ఇండియాకు అద్వితీయమైన విజయాలను అందించాడు. అంతకంటే కూడా పోరాట స్ఫూర్తిని, పోరాడే తత్వాన్ని టీం ఇండియాకు అలవాటు చేశాడు ఈ బెంగాల్ టైగర్. అయితే టీం సెలక్షన్ విషయంలో మాత్రం వ్యక్తిగత ఎమోషన్స్‌కి, పర్సనల్ రిలేషన్స్కి చాలా ప్రాధాన్యతనిచ్చేవాడు గంగూలి. అందుకే వి.వి.ఎస్. లక్ష్మణ్‌కి వరల్డ్ కప్‌లో ఆడే అవకాశం లేకుండా పోయింది. ఆ ఎఫెక్ట్ ఆస్ట్రేలియాతో జరగిన ఫైనల్ మ్యాచ్‌లో కనిపించింది. లక్ష్మణ్ ఉంటే వరల్డ్ కప్ వచ్చి ఉండేది అని కచ్చితంగా చెప్పలేంగానీ లక్ష్మణ్ కనుక టీం ఇండియాలో ఉండి ఉంటే ఆస్ట్రేలియన్స్ని వ్యహాత్మకంగా డిఫెన్స్‌లో పడే అవకాశం టీం ఇండియాకు ఉండి ఉండేది. మానసికంగా ఆస్ట్రేలియన్స్పైన లక్ష్మణ్ది ఎప్పుడూ పైచేయే కదా.
ఇక ధోనీ కెప్టేన్సీలో సాధించిన విజయాలతో పాటు ధోనీ స్వార్థం, టీం సెలక్షన్ విషయంలో ధోనీ ప్లే చేసిన పాలిటిక్స్ అన్నీ బాగా హైలైట్ అయ్యాయి. కెప్టెన్‌గా, ప్లేయర్‌గా ధోనీని తక్కువ చేయలేం కానీ టీం సెలక్షన్స్ విషయంలో మాత్రం పర్సనల్ రిలేషన్స్కి, బిజినెస్ వ్యవహారాలకు బాగా ఇంపార్టెన్స్ ఇచ్చాడు ధోనీ. ధోనీ కెప్టెన్‌గా ఉన్నంత కాలం అతని కంపెనీతో అసోసియేట్ అయి ఉన్నాడు సురేష్ రైనా. ఒన్స్ ధోనీకి టెస్ట్ కెప్టెన్సీ పోయిన వెంటనే ఆ కంపెనీ నుంచి బయటకు వచ్చేశాడు రైనా. అలాగే బెస్ట్ టెస్ట్ ఆటగాళ్ళయిన ద్రవిడ్, లక్ష్మణ్‌లకు కనీసం గౌరవంగా వీడ్కోలు పలికే అవకాశం కూడా ఇవ్వలేదు ధోనీ. ఇక సెహ్వాగ్, గంభీర్, యువరాజ్, ఇషాంత్ శర్మలకు ప్రూవ్ చేసుకోవడానికి సరైన అవకాశాలివ్వడంలో ధోనీ మహా పిసినారితనాన్ని చూపించాడన్నది కళ్ళకు కడుతున్న వాస్తవం. తనకు బాగా ఇష్టులైన వాళ్ళను మాత్రం సంవత్సరంపాటు అన్ని మ్యాచ్‌లలోనూ ఫెయిల్ అయినప్పటికీ అవకాశాలిచ్చాడన్నది కూాడ నిజం.
ఇలాంటి జాఢ్యాలన్నింటినీ విరాట్ కోహ్లి పక్కన పెట్టేస్తున్నాడని అనిపిస్తోంది. ఆస్ట్రేలియా టూర్ నుంచి న్యూజిలాండ్‌తో మొదటి టెస్ట్ సెలక్షన్ వరకూ చూసుకుంటే అల్టిమేట్ టాలెంట్ ఉన్నవాళ్ళు మాత్రమే ఫైనల్ లెవెన్‌లో ఉంటున్నారు. అలాగే ప్రూవ్ చేసుకోవాలని తపిస్తున్న ఆటగాళ్ళకు కోహ్లి ఇస్తున్న అవకాశాలు కూడా అపూర్వం. బ్యాటింగ్‌లో కూడా తన టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలని అనుకున్న అశ్విన్‌ని బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు పంపించడం టీం ఇండియాకు భలే కలిసొచ్చింది. ఇప్పుడు న్యూజిలాండ్‌పై సాధించిన ఘన విజయానికి కూడా అదే కారణమైంది. ఆ కాన్ఫిడెన్స్‌తోనే బౌలింగ్‌లో కూడా అద్వితీయంగా రాణిస్తున్నాడు అశ్విన్. ఒక్క క్రికెట్ అనే కాదు ఏ రంగంలో ఉన్నవారైనా సరే… ప్రతిభను నిరూపించుకోవాలని తపిస్తున్న వాళ్ళకు సరైన అవకాశాలు ఇవ్వడానికి మించిన నాయకత్వం ఏదీ ఉండదు. స్వతహాగా టీంలో అందరికంటే కూడా అద్భుతమైన ప్రతిభావంతుడవడం కూడా ఈ విషయంలో కోహ్లికి భలే కలిసొస్తోంది. అందుకే ఎవరిని ఎంకరేజ్ చేస్తే ఎవరు పోటీగా వస్తారో అన్న భయాలు లేకుండా టాలెంట్ ఉన్న అందరినీ ఎంకరేజ్ చేస్తున్నాడు కోహ్లి. అలాగే విజయం సాధించాక కూడా నాయకత్వం విషయంలో తనకు తోడ్పడిన వాళ్ళ గురించి కూడా ఓపెన్‌గా మాట్లాడేస్తున్నాడు. అలాగే ప్లేయర్స్‌కి పెద్దన్నలా కాకుండా వాళ్ళతో సరదాగా కలిసిపోతున్న కోహ్లి వ్యక్తిత్వాన్ని కూడా అందరూ అభినందిస్తున్నారు. ఓవరాల్‌గా చూస్తే మాత్రం ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా లాంటి జట్లలో కనిపించే టీం వర్క్ ప్రస్తుతం టీం ఇండియాలో కనిపిస్తోంది. అందుకే కోహ్లి నాయకత్వ నైపుణ్యాలకు…… హ్యాట్సాఫ్.