కేసీఆర్ ప్రభుత్వం ఓడిపోక ముందు కోకాపేట నియోపొలీస్లో భూములను వేలం వేసినప్పుడు ఎకరాకు వంద కోట్లుకు కొనుగోలు చేశారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు. ఇప్పుడు వారంతా అక్కడ ఆకాశాన్ని తాకేలా లెక్కలేనన్ని అంతస్తులతో అపార్టుమెంట్లు కడుతున్నారు. ఇప్పుడు మరికొన్ని స్థలాలను రేవంత్ ప్రభుత్వం వేలం వస్తోంది. సోమవారం వేసిన వేలంలో ఒక ఎకరం భూమికి రికార్డు ధరగా రూ.137.25 కోట్లు పలికింది. మొత్తం 9.90 ఎకరాల ప్లాట్‌ను రూ.1,355.33 కోట్లకు కొనుగోలు చేశారు.
కోకాపేట్ వేలంలో మొదటి రౌండ్లో రెండు ప్లాట్లు అమ్ముడయ్యాయి. ప్లాట్ నంబర్ 17లో మొత్తం 4.59 ఎకరాలు ఎకరానికి రూ.136.50 కోట్లకు ఓ బిడ్డర్ కొనుగోలు చేశారు. ప్లాట్ నంబర్ 18లో మొత్తం 5.31 ఎకరాలు ఉంటుంది. ఎకరానికి రూ.137.25 కోట్లకు ఓ బడా బిల్డర్ దక్కించుకున్నారు. ఇక్కడ ఎకరం కనీస ధరగా రూ.99 కోట్లు నిర్ధారించిన HMDA.. అక్కడ్నుంచి వేలం ప్రారంభించింది. 137 కోట్లకు చేరుకుంది.
2023లో కోకాపేట్లో ఒక ఎకరం భూమి రూ.100.75 కోట్లకు అమ్ముడైంది. ఈసారి ఆ రేటును మించి వచ్చింది. HMDA మొత్తం వేలాల నుంచి రూ.5,000 కోట్లకు పైగా ఆదాయం ఆశిస్తోంది. కోకాపేట్ నియోపొలీస్ ప్లాట్లకు రూ.99 కోట్లు, గోల్డెన్ మైల్‌కు రూ.70 కోట్లు, మూసాపేట్ ప్లాట్లకు రూ.75 కోట్లు కనీస ధరలు నిర్ధారించారు. మిగిలిన ప్లాట్ల వేలాలు నవంబర్ 28, డిసెంబర్ 3, 5 తేదీల్లో జరగనున్నాయి. గత నెలలో రాయదుర్గంలో వేలం వేసినప్పుడు ఎకరానికి రూ. 177 కోట్లు వచ్చింది. అదే హయ్యస్ట్. తర్వాత రూ.137 కోట్లు.