ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేసే బాధ్యతను వైసీపీ సన్నిహిత తెలంగాణ కాంగ్రెస్ నేతలు తలకెత్తుకుంటున్నారు. మాజీ వైసీపీ జడ్చర్ల ఇంచార్జ్ గా పని చేసి ప్రస్తుతం కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా ఉన్న అనిరుథ్ రెడ్డి.. పవన్ వ్యాఖ్యలు చేసిన ఐదు రోజుల తర్వాత ఘాటుగా స్పందించారు. ఆ ఒక్క విషయం మాట్లాడితే సరిపోయేది కానీ.. పవన్ ఒంటరి పోటీ గురించి ఇతర రాజకీయవ్యాఖ్యలు చేశారు. దీంతోఆయన ఇంటెన్షన్ ఏమిటో అర్థమైపోయింది. ఇప్పుడు అదే బాటలోకి నేరుగా సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చారు.
జగన్ రెడ్డికి ఈయన అత్యంత సన్నిహితుడని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేసి వారం రోజులు దాటిపోయాక.. ఇప్పుడు మీడియా ముందుకు పవన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. పవన్ వ్యాఖ్యలు బాధించాయని.. పవన్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు తెలంగాణ ప్రజల దిష్టి కాదు.. ఆంధ్రా పాలకుల వల్ల తెలంగాణ ప్రజలు ఫ్లోరైడ్ విషం తాగారన్నారు. పవన్ క్షమాపణ చెప్పకపోతే.. ఒక్క సినిమా కూడా ఆడదని హెచ్చరించారు.
మంత్రిగా చెబుతున్నా.. ఒక్క థియేటర్లో కూడా సినిమా విడుదల కాదు.. చిరంజీవి సూపర్ స్టార్.. ఆయన మంచోడు.. రాజకీయ అనుభవం లేకే పవన్ ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పుకొచ్చారు. రాజకీయ వ్యాఖ్యలకు.. ప్రభుత్వ అధికారానికి ముడిపెట్టి సినిమాలు విడుదల చేయనివ్వబోం అనడం ప్రభుత్వానికే చెడ్డపేరు తెస్తుంది. మరో మంత్రి వాటికి శ్రీహరి కూడా స్పందించారు. పవన్ కల్యాణ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి.. లేదంటే భవిష్యత్లో తెలంగాణలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. రెండు ప్రాంతాల మధ్య విద్వేషం పెంచే మాటలు సరికాదు.. పవన్ తలతిక్క మాటలు మానుకోవాలి.. తెలంగాణలో వనరులు వాడుకుని.. ఈ స్థాయికి ఎదిగావు.. మైలేజ్ పొందాలంటే.. పనితనం చూపించు.. ఇలా కాదు అని చెప్పుకొచ్చారు.
పవన్ కల్యాణ్ ఆ మాటలు అని చాలా రోజులైన తర్వాత వీరంతా వరుసగా ఇలా స్పందిస్తున్నారంటే.. కచ్చితంగా తెర వెనుక రాజకీయం ఉందని అర్థం చేసుకోవచ్చు. ఆ రాజకీయం ఏమిటో మరి!