తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంటకరెడ్డి అలక పూనారన్నది ఇండస్ట్రీ వర్గాల కథనం. మంగళవారం హైదరాబాద్ లో సినీ కార్మికుల సన్మాన సభ జరిగింది. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డిని కార్మిక నాయకులు సన్మానించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కార్మికులపై వరాల జల్లు కురిపించారు. అయితే ఈ వేదికపై సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి కనిపించలేదు. చిత్రసీమకు సంబంధించిన కార్యక్రమం ఇది. సినిమాటోగ్రఫీ మంత్రికి ఆహ్వానం అందడం ప్రోటోకాల్. అయితే మంత్రి ఆ సమయంలో ముంబైలో ఉన్నారు. తాను లేని సమయం చూసి, సినీ కార్మికుల సన్మాన సభ నిర్వహించడం ఏమిటన్నది ఆయన ఆవేదన. తన శాఖపై ఓ షాడో మంత్రి పెత్తనం చూపిస్తున్నారని, తనకూ, కార్మికులకూ మధ్య దూరం పెంచుతున్నాడని, తన ప్రమేయం లేకుండా ఇలాంటి సభలు నిర్వహించడం ఏమిటని కోమటి రెడ్డి తన సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అసలు ఇలాంటి సమావేశం ఒకటి నిర్వహిస్తున్నారన్న విషయం కూడా కోమటిరెడ్డికి తెలీదని సమాచారం.
గతంలో కార్మికుల సమ్మె జరిగినప్పుడు కోమటిరెడ్డి కార్మికుల పక్షాన ఉన్నారు. కార్మికుల హక్కుల్ని పరిరక్షిస్తానని అప్పట్లో మాట ఇచ్చారు. కార్మికుల సపోర్ట్ కూడా కోమటి రెడ్డికి గట్టిగానే ఉంది. ఇవన్నీ భరించలేని కొంతమంది తననీ, ముఖ్యమంత్రినీ దూరం చేస్తున్నారని, తన శాఖపై తన ఆధిపత్యాన్ని తగ్గించేలా కుట్ర పన్నుతున్నారన్నది మంత్రి ఆరోపణ. ఇదే విషయం తన సన్నిహితుల దగ్గర ప్రస్తావించినట్టు తెలుస్తోంది. దాంతో కోమటిరెడ్డికీ ముఖ్యమంత్రికీ మధ్య దూరాన్ని సృష్టిస్తున్న ఆ షాడో మంత్రి ఎవరన్నది చర్చనీయాంశంగా మారింది.
