తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఓ పెద్ద సంక్షోభం ముందు నిలిచింది. మంత్రి కొండా సురేఖ వ్యవహారం ముదిరి పాకాన పడింది. సుమంత్ అనే ఆమె ఓఎస్డీ చేసిన నిర్వాకాల కారణంగా ఆయనను ప్రభుత్వం పదవి నుంచి తప్పించింది. అదే సమయంలో ఓ సిమెంట్ ఫ్యాక్టరీ యజమానిని తుపాకీ పెట్టి పాయింట్ బ్లాంక్ లో బెదిరించారంటూ ఫిర్యాదు రావడంతో అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. కానీ ఆ సుమంత్ ను స్వయంగా రక్షించి తనతో పాటు తీసుకెళ్లారు కొండా సురేఖ. ఆమె కుమార్తె సీఎంతో పాటు పలువురు తన తల్లిపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించేశారు. ఇంత దాకా వచ్చిన తర్వాత తర్వాత ఇక ఈ వివాదం ఇంతటితో ఆగే అవకాశం కనిపించడంలేదు.
బలవంత వసూళ్లకు పాల్పడిన కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ ?
కొండా సురేఖ వ్యవహారం కొన్నాళ్లుగా వివాదాస్పదమవుతోంది. ఆమె వద్ద ప్రైవేటు ఓఎస్డీగా పని చేస్తున్న సుమంత్ కొండా సురేఖ నిర్వహిస్తున్న దేవాదాయ, అటవీ శాఖలతో సంబంధం ఉన్న వ్యాపార, పారిశ్రామిక వర్గాల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ వసూళ్లకు బెదిరింపులను స్వయంగా సుమంత్ చేస్తున్నారు. డెక్కన్ సిమెంట్స్ అనే సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని తుపాకీతో బెదిరించినట్లుగా చెబుతున్నారు.
చివరికి మేడారం పనుల కాంట్రాక్టర్ ను కూడా బెదిరించినట్లుగా ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ప్రభుత్వ పెద్దల్లో ఒక్క సారిగా ఆగ్రహం వచ్చింది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కల్పించుకుని సురేఖ ఓఎస్డీ సుమంత్ ను తీసేయమని ఆదేశించారు. ఆయనను అదుపులోకి తీసుకోవాలని ఆదేశాలు రావడంతో పోలీసులు ప్రయత్నించారు.
మంత్రికి తెలియకుండా ఓఎస్డీ వసూళ్లకు పాల్పడతారా?
సుమంత్ ను అదుపులోకి తీసుకునేందుకు వచ్చిన పోలీసులకు మంత్రి కొండా సురేఖ షాక్ ఇచ్చారు. ఆయనకు తన ఇంట్లోనే షెల్టర్ ఇచ్చారు. పోలీసులు ఆ ఆచూకీ తెలుసుకుని అక్కడికి వచ్చినప్పుడు సురేఖ కుమార్తె పోలీసులతో వాగ్వాదానికి దిగారు. విపక్ష పార్టీ నేతల్లా.. తన తల్లి, తండ్రిపై సీఎంతో పాటు ముఖ్యనేతలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. బీసీలం అయిన తమను వేధిస్తున్నారని చెప్పుకొచ్చారు. అదే సమయంలో ఓఎస్డీని తీసుకుని కొండా సురేఖ వేరే కారులో వెళ్లిపోయారు. దీంతో పోలీసులు అదుపులోకి తీసుకోలేకపోయారు. అంటే ఓఎస్డీ తో అన్ని పనులు చేయించింది కొండా దంపతులేనని అనుమానాలు బలపడుతున్నాయి.
ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేసి మంత్రి వర్గంలో ఉండగలరా? ఉంచుతారా?
స్వయంగా ముఖ్యమంత్రి తమపై కుట్ర చేస్తున్నారని ఓ మంత్రి ఆరోపించడం చిన్న విషయం కాదు. ఓ మంత్రిపై సీఎం విశ్వాసం కోల్పోయినా.. ఆ మంత్రి సీఎంపై నమ్మకం కోల్పోయినా మంత్రి వర్గంలో ఉండలేరు . ఇప్పుడు అదే జరిగే అవకాశం ఉంది. కొండా సురేఖను మంత్రి వర్గం నుంచి తప్పించడం లేదా ఆమెనే రాజీనామా చేయడం జరగడం ఖాయంగా కనిపిస్తోంది. తమను అరెస్టు చేస్తారని కొండా సురేఖ, కొండా మురళీ కూడా ఆందోళన చెందుతున్నారు. ఇదే విషయాన్ని ఆయన కుమార్తె చెబుతున్నారు. అలాంటి పరిస్థితే వస్తే బయటకు తెలియనిది ఏదో పెద్ద ఘటనే జరిగిందని అనుకోవాలి.
ఎవరితోనూ సఖ్యతగా ఉండకపోవడం కొండా దంపతుల ప్రత్యేకత
కొండా దంపతుల వ్యవహారశైలి మొదటి నుంచి వివాదాస్పదమే. ఎవరితోనూ సఖ్యతగా ఉండరు. ఎవరైనా ప్రోత్సహిస్తే రెచ్చిపోతారు. కాంగ్రెస్ లో మంత్రి పదవి వచ్చిన తర్వాత ఆమె వరంగల్ జిల్లాలో ఏ ఒక్క నేతతోనూ సామరస్యంగా లేరు. చివరికి వరంగల్ జిల్లాకాంగ్రెస్ నేతలంతా .. మేము కావాలో.. ఆమె కావాలో తేల్చుకోవాలని అల్టిమేటం కూడా ఇచ్చారు. రేవంత్ రెడ్డి ఇప్పటి వరకూ అన్నీ భరించారు.. చివరికి ఆయన కూడా ఇక తెంపేయాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. వచ్చే రెండు, మూడు రోజుల్లో కొండా సురేఖ అంశంలో చాలా కీలక పరిణామాలు జరగనున్నాయి.