మంత్రి కొండా సురేఖ మరోసారి నిప్పు రాజేశారు. ఈ సారి సొంత మంత్రులను ఇరకాటంలో పెట్టే మాటలు మాట్లాడారు. కొందరు మంత్రులు ఫైల్ క్లియరెన్స్ కోసం డబ్బులు తీసుకుంటారని వ్యాఖ్యానించారు. నా దగ్గరకు కూడా ఓ కంపెనీ వాళ్లు ఫైల్ క్లియరెన్స్ కోసం వచ్చారు. మీ ఒక్క రూపాయి కూడా నాకు వద్దు అని వాళ్లతో చెప్పాను. బదులుగా ఆ డబ్బుతో సమాజ సేవ చేయమని వాళ్లకు సూచించాననన్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె సందర్భం లేకపోయిన ఈ వ్యాఖ్యలు చేయడం వైరల్ గా మారింది.
తాను డబ్బులు తీసుకోవడం లేదని చెప్పడం వరకూ ఓకే కానీ ఇతర మంత్రులు తీసుకుంటున్నారని చెప్పడం ఏమిటన్నది ఇతరులకు అర్థం కాని విషయం . కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులపై లంచం ఆరోపణలు చేసినట్లుగానే ఈ మాటలు ఉన్నాయి. ఈ అంశంపై వివాదం రేగడంతో తాను చెప్పింది గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోని మంత్రుల గురించి మాత్రమేనని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులను ఉద్దేశించి కాదని కవర్ చేసుకున్నారు.
కొండా సురేఖ ఎన్ని విధాలుగా వివరణ ఇచ్చినా ఆమె ఎం మాట్లాడారో స్పష్టంగానే ఉంది. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ ప్రభుత్వంలోని అంతర్గత సమస్యలను బహిర్గతం చేసినట్లు అయిందని రాజకీయవర్గాలు అంటున్నాయి. మంత్రుల మధ్య సమన్వయ లోపం, పరస్పర సహకారం లేకపోవడం వల్లనే ఈ సమస్యలు వస్తున్నాయని అంచనా వేస్తున్నారు. గతంలో సమంత విడాకుల విషయంలో చేసిన వ్యాఖ్యల వివాదం ఇంకా సద్దుమణగలేదు. ఈ లోపు మంత్రులపై ఆరోపణలు చేశారు.