మంత్రి పదవి నుంచి కొండా సురేఖను బర్తరఫ్ చేయడానికి ప్రభుత్వం లాంఛనాలు పూర్తి చేస్తోంది. దీనికి సంబంధించిన ముందస్తు సంకేతాలు అన్నీ కనిపిస్తున్నాయి. దేవాదాయ శాఖ అధికారులెవరూ కొండా సురేఖకు రిపోర్టు చేయవద్దని.. ఆమె అధీనం వల్ల ఉన్న ఫైల్స్ అన్నీ స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. అదే సమయంలో మంత్రులకు ప్రోటోకాల్ ప్రకారం ఇచ్చే భద్రతను కూడా తొలగించారు. వరంగల్ తో పాటు హైదరాబాద్ లో కూడా కొండా సురేఖ ఇళ్ల వద్ద భద్రతను తొలగించారు.
మంత్రివర్గం నుంచి ఆమెను తప్పిస్తున్నట్లుగా సమాచారాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ కార్యాలయానికి పంపించారని తెలుస్తోంది. కొండా సురేఖ వ్యవహారం హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లి.. ఆమెను మంత్రి వర్గం నుంచి తప్పించేందుకు అనుమతి తీసుకున్నారు ఇప్పటికే ఆమె విషయంలో ఎన్నో ఆరోపణలు, ఫిర్యాదులు హైకమాండ్ వద్ద ఉన్నాయి. పార్టీ నేతలతో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు కూడా ఫిర్యాదు చేశారని చెబుతున్నారు.
ఆమె ఎన్ని వివాదాల్లో ఇరుక్కున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంత కాలం చూసి చూడనట్లుగానే ఉన్నారు. కానీ ఇప్పుడు ఆమె నేరుగా రేవంత్ రెడ్డినే టార్గెట్ చేస్తున్నారు. పారిశ్రామికవేత్తని తుపాకీపెట్టి బెదిరించడమే కాదు.. రేవంత్ రెడ్డిపైనే ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. వారిని ఉపేక్షించడం వల్ల ఇప్పటికే పూర్తి స్థాయిలో నష్టం జరిగిందని.. ఇక సహిస్తే.. మొత్తం నాశనం చేస్తారని అనుకుంటున్నారు . ఆమె రాజీనామా చేసే అవకాశం లేదు కాబట్టి.. గవర్నర్ ద్వారా బర్తరఫ్ చేయించాలని డిసైడయ్యారు.