సర్వే సత్యనారాయణ అల్లుడు.. కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా వెళ్లాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్న క్రిషాంక్ ను ఎవరూ లీడర్ గా చూడటం లేదు. కాంగ్రెస్ లో ఉన్నపుడు కష్టపడినా చివరి క్షణంలో తన మామ సర్వేకు టిక్కెట్ ఇచ్చారని చెప్పి ఆయన బీఆర్ఎస్ లో చేరిపోయారు. అక్కడా టిక్కెట్ రాలేదు. ఇప్పుడు ఇంచార్జ్ పదవి కూడా రావడం డౌట్ గా ఉంది. జంట నగరాల బీఆర్ఎస్ ను ముఖ్యంగా సికింద్రాబాద్ ఏరియాను డీల్ చేస్తున్న తలసాని .. కంటోన్మెంట్ కు కొత్త ఇంచార్జ్ వస్తారని ప్రకటించారు. ఆ సమావేశానికి క్రిషాంక్ను పిలవలేదు.
రెండు సార్లు చాన్స్ వచ్చినా పట్టించుకోని హైకమాండ్
దివంగత ఎమ్మెల్యే సాయన్న మరణం తర్వాత వచ్చిన ఉపఎన్నిక సమయంలోనే ఆయన టికెట్ ఆశించారు. అయితే, ఆ సమయంలో సాయన్న కుమార్తె లాస్య నందితకు అవకాశం దక్కింది. దురదృష్టవశాత్తూ లాస్య నందిత కూడా రోడ్డు ప్రమాదంలో మరణించడంతో, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆమె సోదరి నివేదిత పోటీ చేసినా విజయం సాధించలేకపోయారు. ప్రస్తుతం ఆ కుటుంబం రాజకీయంగా అంత క్రియాశీలంగా లేకపోవడంతో, క్రిషాంక్ తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కానీ కంటోన్మెంట్ రాజకీయాల్లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జోక్యం క్రిషాంక్ ఆశలపై నీళ్లు చల్లుతున్నట్లు కనిపిస్తోంది.
క్రిషాంక్ ను పరిగణనలోకి తీసుకోని తలసాని
ప్రస్తుతం ఆ నియోజకవర్గ బాధ్యతలను తలసాని పర్యవేక్షిస్తుండటం, అక్కడ కొత్త ఇన్ఛార్జ్ను నియమిస్తామని సంకేతాలు ఇవ్వడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కష్టకాలంలో పార్టీ కోసం నిలబడి, అనేక కేసులను ఎదుర్కొంటూ క్షేత్రస్థాయిలో పోరాడుతున్న తనకు ప్రాధాన్యత ఇవ్వకుండా, కొత్త వ్యక్తిని తెరపైకి తీసుకురావాలని చూడటం క్రిషాంక్ను తీవ్ర మనస్థాపానికి గురిచేస్తోంది. తన పోరాటానికి తగిన గుర్తింపు లభించడం లేదని ఆయన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలోనూ పరోక్షంగా తన బాధను వ్యక్తం చేస్తున్నారు. కంటోన్మెంట్ లో జరిగే ఏ కార్యక్రమానికీ తలసాని.. క్రిషాంక్ ను పిలవడం లేదు.
ప్రజల్లో ఉండకుండా.. సోషల్ మీడియాలో ఉంటే ఇంతే !
తన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతోందని క్రిషాంక్ భావిస్తున్నప్పటికీ, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పట్ల ఆయనకు గట్టి నమ్మకం ఉంది. తన కష్టాన్ని, విధేయతను కేటీఆర్ తప్పకుండా గుర్తిస్తారని, తనకు న్యాయం జరుగుతుందని ఆయన ఆశిస్తున్నారు. రాజకీయాల్లో విధేయత ఒక్కో సారి చేతకాని తనం అవుతుంది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుని.. కేటీఆర్ తో సన్నిహితంగా ఉంటే పనులు కాకపోవచ్చు. ప్రజల్లో ఉండాలి. క్రిషాంక్ అలాంటి ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపించడం లేదు. అందుకే తలసాని పట్టించుకోవడం లేదు.
