“ నేను తప్పు చేయలేదు. అరెస్టు చేసుకుంటారా..చేసుకోండి. నా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి” అని కేటీఆర్ ప్రతి ప్రెస్మీట్లోనూ సవాల్ చేస్తున్నారు. నిన్నటి వరకూ ఆయనపై ఫార్ములా ఈ కేసుకు సంబంధించిన అంశంలో అరెస్టు ఉండవచ్చని అనుకున్నారు. కానీ అలాంటి ప్రయత్నం జరగలేదు. ఇప్పుడు లగ్జరీ కార్ల స్మగ్లింగ్ అంశం తెరపైకి వచ్చింది. బండి సంజయ్ బయట పెట్టారు. డీలర్ ఇంట్లో ఈడీ సోదాలు చేసింది. ఆయన కార్లు ఎవరికి అమ్మారో బయటకు వస్తుంది. తదుపరి వారి ఇళ్లలో సోదాలు చేయవచ్చు. ఆ జాబితాలో కేటీఆర్ ఉండటమే అసలు విషయం. అయినా తాను తప్పేమీ చేయలేదని విచారణకు వస్తానని కేటీఆర్ సవాల్ చేశారు.
క్రూయిజర్ కారు కేటీఆర్ భార్య డైరక్టర్గా ఉన్న కంపెనీ పేరుపై !
కేటీఆర్ ఓ ల్యాండ్ క్రూయిజర్ కారు వాడుతున్నారు. ఆ కారు కేసీఆర్ లక్కీ నెంబర్ పేరుతోనే ఉంది. కానీ ఆ కారు కేటీఆర్ లేదా కేసీఆర్ పేరు మీద రిజిస్టర్ కాలేదు. ఎట్ హోం హాస్పిటాలిటీ సర్వీసెస్ అనే కంపెనీ పేరుపై రిజిస్టర్ అయిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రకటించారు. ఆ కంపెనీలో గతంలో కేటీఆర్ డైరక్టర్ గా ఉన్నారు. ఇప్పుడు ఆయన సతీమణి శైలిమ డైరక్టర్ గా ఉన్నారు. ఆ కారును బషరత్ అలీ ఖాన్ అనే డీలర్ వద్ద సెకండ్ హ్యాండ్ అని చెప్పి కొన్నారు. కానీ ఆ కారు స్మగ్లింగ్ చేసి.. పన్నులు ఎగ్గొట్టి దేశంలోకి తీసుకువచ్చి అక్రమంగా రిజిస్టర్ చేసిందని గుర్తించారు. ఇలాంటి కార్లపై వంద శాతం పన్ను ఉంటుంది.. రెండుకోట్లు దాని వాల్యూ ఉంటే రెండు కోట్ల పన్ను కట్టాలి. ఇది మొత్తం ఎగ్గొట్టి అమ్మారు.
మొత్తం ఎనిమది కార్లు బషరత్ ఖాన్ ఇలా అమ్మినట్లు గుర్తించిన ఈడీ
బషరత్ ఖాన్ను ఈడీ గత నాలుగైదు నెలల కిందటే అరెస్టు చేసింది. ఇంటరాగేషన్ లో ఎవరెవరికి ఎన్ని కార్లు తీసుకు వచ్చి ఇచ్చారో గుర్తించారు. అలా కేటీఆర్ వాడుతున్న కారు గురించి వెలుగులోకి వచ్చింది. అయితే ఒక్క కారేనా ఇంకా ఉన్నాయా అన్నది తేలాల్సి ఉంది. ఈ కారు విషయంలోనూ కేటీఆర్ భిన్నంగా స్పందిస్తున్నారు. రేవంత్, సంజయ్ ను ఆర్ఎస్ బ్రదర్స్ గా సంబోధిస్తూ తనను అరెస్టు చేయించడానికి ప్రయత్నిస్తున్నారని తాను రెడీ అనే అంటున్నారు. కానీ తనపై వస్తున్న ఆరోపణలపై కన్విన్సింగ్ గా సమాధానం చెప్పలేకపోతున్నారు. తప్పు చేయలేదని మాత్రం అంటున్నారు.
అరెస్టు చేయడం లేదు కాబట్టి తప్పు చేయలేదని స్వయం సర్టిఫికెట్
తనపై చేస్తున్న ఆరోపణల విషయంలో కేటీఆర్ భిన్న వ్యూహంలో ఉన్నారు. తనను అరెస్టు చేయడం లేదు కాబట్టి తాను తప్పు చేయలేదని స్వయం సర్టిఫికెట్ ఇచ్చుకుంటున్నారు. నిజానికి ఆయనపై చర్యలు తీసుకోకపోతే ప్రజలు కూడా ఇలాగే అనుకునే అవకాశం ఉంది. ఇప్పటికైతే అరెస్టు చేస్తే ప్రజల్లో సానుభూతి వస్తుందని.. నేలకు దిగిన పార్టీని మళ్లీ బతికించడం ఎందుకని అనుకుంటున్నారన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో ఉంది. జూబ్లిహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కోలుకోలేదని తెలిస్తే.. కేటీఆర్ ముచ్చటను తీర్చేందుకు రేవంత్ వెనుకాముందూ ఆడే అవకాశం ఉండకపోవచ్చనుకుంటున్నారు.