ఎమ్మెల్సీ కవిత గురించి ఇక చర్చించాల్సింది.. మాట్లాడాల్సింది ఏమీ లేదని ఆమె సోదరుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చి చెప్పారు. కాళేశ్వరం నీటితోనే మూసి ప్రక్షాళన చేస్తున్నారని చెప్పేందుకు ప్రెస్మీట్ పెట్టిన ఆయనకు కవిత అంశంపై మీడియా నుంచి ప్రశ్నలు ఎదురయ్యాయి. వాటికి సమాధానం ఇచ్చేందుకు కేటీఆర్ ఆసక్తి చూపించలేదు. కవిత వ్యాఖ్యలపై పార్టీలో చర్చ జరిగిందని .. అధ్యక్షుడు కేసీఆర్ ఓ నిర్ణయం తీసుకున్నారని దాని ప్రకారం చర్యలు తీసుకున్నామన్నారు. అంతకు మించి మాట్లాడటానికి ఏమీ లేదన్నారు.
కవిత చేసిన ఆరోపణలపై స్పందించేందుకు కేటీఆర్ ఆసక్తి చూపించలేదు. కవితకు ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదని కేటీఆర్ నేరుగా చెప్పిటన్లయింది. కవితపై పొలిటికల్ స్టాండ్ కూడా కేటీఆర్ మాటల్లో అర్థమైపోతుంది. కవిత గురించి ఇక మాట్లాడకపోవడమే బీఆర్ఎస్ విధానమని అర్థం చేసుకోవచ్చంటున్నారు. కవితపై ఇప్పటికే బీఆర్ఎస్ సోషల్ మీడియా ఎటాక్ చేస్తోంది. సోషల్ మీడియా వార్ వరకూ చాలునని.. కవితకు ఇంకా ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వవద్దని పార్టీ పరంగా నిర్ణయం తీసుకున్నట్లుగా కేటీఆర్ మాటల్ని బట్టి అర్థం చేసుకోవచ్చంటున్నారు.
అయితే హరీష్ రావుపై కవిత చేసిన ఆరోపణలపై స్పందించాల్సిన అవసరం ఉందని ఎక్కువ మంది భావిస్తున్నారు. కుటుంబసభ్యురాలు.. పార్టీలో అత్యంత కీలక వ్యక్తి అయిన కవిత చేసిన ఆరోపణల్ని పార్టీ పరంగా ఖండించాల్సి ఉంది. కానీ కొంత మంది మహిళా నేతలు.. ఇతరులు ప్రెస్మీట్లు పెట్టి కవితపై ఆరోపణలు చేశారు కానీ.. హరీష్ రావుకు పూర్తి స్థాయిలో మద్దతు పలకలేకపోయారు. పై స్థాయి నుంచి అంటే..కేసీఆర్,కేటీఆర్ల నుంచి హరీష్ పై కవిత చేసిన ఆరోపణలు అవాస్తవమన్న ప్రకటన రావాల్సి ఉంది. అది ఇంత వరకూ రాలేదు.