రేవంత్ రెడ్డి తిట్ల ట్రాప్లో పడొద్దని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. కేసీఆర్ మీద జరుగుతున్న దాడులను తిప్పికొట్టాల్నారు. కేసీఆర్ జాతిపిత అని పిలిపించుకుంటున్నారని రేవంత్ చేస్తున్న విమర్శలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ ఎప్పుడూ బిరుదుల కోసం పాకులాడలేదని, తెలంగాణ ప్రజల శ్రేయస్సునే తన శ్వాసగా భావించారన్నారు. కేసీఆర్ వ్యక్తిత్వంపై నేడు అహంకారంతో విషం చిమ్మడం అంటే.. అది కేవలం వ్యక్తి మీద దాడి కాదు, తెలంగాణ పోరాట చరిత్రపై జరుగుతున్న దాడి అని కేటీఆర్ మండిపడ్డారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి తిట్ల ట్రాప్ అనే కొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారని మండిపడ్డారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో వార్డుల అభివృద్ధి, రోడ్లు, డ్రైనేజీలు, సంక్షేమ పథకాలపై చర్చ జరగాల్సి ఉండగా.. బూతు పురాణంతో రేవంత్ రెడ్డి ప్రజల దృష్టిని మళ్లించాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ విషపు వలలో పడకుండా, ప్రతి కార్యకర్త ప్రజా సమస్యలనే అజెండాగా మార్చుకోవాలని సూచించారు.
సింగరేణి బొగ్గు స్కామ్, విద్యుత్ కుంభకోణాల వెనుక ఉన్న అసలు దొంగలను ఇంటింటికీ వెళ్లి వివరించాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ నీటి వాటాను పక్క రాష్ట్రాలకు ధారాదత్తం చేస్తున్న రేవంత్ రెడ్డి చర్యలను కోవర్టు ద్రోహం గా అభివర్ణిస్తూ, దీనిపై నిప్పులు చెరగాలన్నారు. కేసీఆర్ హయాంలో పదేళ్ల ఉజ్వల ప్రగతిని, ప్రస్తుత రెండేళ్ల దుర్గతిని బేరీజు వేస్తూ ప్రజల ముందుకు తీసుకెళ్లడమే కేసీఆర్కు ఇచ్చే అసలైన గౌరవమని స్పష్టం చేశారు.
రేవంత్ రెడ్డి గాలి మాటలకు, గాయిగత్తర బూతులకు కాలం చెల్లిందని, మున్సిపల్ ఎన్నికల్లో సమస్యలనే పిడుగుల్లా కురిపించి ప్రభుత్వ అసమర్థతను ఎండగట్టాలని కోరారు. కేసీఆర్ స్పూర్తితో ప్రజాస్వామ్యాన్ని, తెలంగాణను కంటికి రెప్పలా కాపాడుకుందామని పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి తమపై తిట్ల దాడి చేసి.. సమస్యలను డైవర్ట్ చేస్తున్నారని కేటీఆర్ గుర్తించినట్లుగా తెలుస్తోంది.


