తెలంగాణాలో మల్లన్నసాగర్ ప్రాజెక్టు భూసేకరణకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేస్తున్న పోరాటాలు అందరూ చూస్తూనే ఉన్నారు. భూసేకరణ చట్టం-2013 ప్రకారమే రైతుల నుంచి భూమిని సేకరించాలని, దాని కోసం తెలంగాణా ప్రభుత్వం జారీ చేసిన జీవో:123ని ఉపసంహరించుకోవాలని వారి ప్రధాన డిమాండ్స్. అందుకు తెలంగాణా ప్రభుత్వం ఒప్పుకోకుండా ముందుకు వెళ్లడంతో ప్రస్తుతం హైకోర్టులో తిప్పలు పడుతోంది. అదివేరే సంగతి.
జీవో:123ని వ్యతిరేకిస్తున్న వారిలో తెలంగాణా తెదేపా కూడా ఉంది. వారు దాని కోసం తమ పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ నేతృత్వంలో గవర్నర్ నరసింహన్ని కలిసి ఒక వినతి పత్రం ఇచ్చివచ్చారు కూడా. మల్లన్నసాగర్ ప్రాజెక్టు కోసం భూసేకరణ చట్టం-2013 ప్రకారమే భూమిని సేకరించాలని తెలంగాణా ప్రభుత్వాన్ని ఆదేశించాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెదేపా ప్రభుత్వం కూడా రాజధాని నిర్మాణం, మచిలీపట్నం పోర్ట్, విమానాశ్రయాలు తదితర అవసరాల కోసం భూసేకరణ చట్టం-2013 ప్రకారమే భూమిని సేకరించి ఉంటే, తెలంగాణా తెదేపా నేతలని వేలెత్తి చూపేందుకు అవకాశం ఉండేది కాదు. కానీ ఏపిలో వారి తెదేపా ప్రభుత్వం అన్ని చోట్లా ల్యాండ్ పూలింగ్ విధానంలోనే భూములు సేకరిస్తోంది. దాని కోసం నోటిఫికేషన్లు కూడా జారీ చేసింది. అంటే తెలంగాణా ప్రభుత్వం భూసేకరణ కోసం జీవో:123ని జారీ చేస్తే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ అమలుచేస్తామని ఉత్తర్వులు జారీ చేస్తోందని అర్ధం అవుతోంది.
ఈ ల్యాండ్ పూలింగ్ పద్దతి గొప్పదనం గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన మంత్రులు చాలా గొప్పగా చెప్పుకోవడం అందరూ చూస్తూనే ఉన్నారు. మరి అది గొప్ప విషయమే అయినప్పుడు తెలంగాణా ప్రభుత్వం జారీ చేసిన జీవో:123 ఏవిధంగా తప్పు అవుతుంది? తెలంగాణాలో భూసేకరణ చట్టం-2013 ప్రకారమే భూమిని సేకరించాలని పట్టుబడుతున్న తెలంగాణా తెదేపా నేతలు, ఆంధ్రాలో తమ ప్రభుత్వం దానిని అమలుచేయకపోతే ఎందుకు ప్రశ్నించడం లేదు?
తెలంగాణా ప్రభుత్వం జారీ చేసిన జీవో:123లో ఏవైనా లోటుపాట్లు ఉన్నట్లయితే వాటిని న్యాయస్థానం సరిచేస్తుంది లేదా తిరస్కరిస్తుంది. అప్పుడు తెలంగాణా ప్రభుత్వమే ప్రజలకి జవాబు చెప్పుకొంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ లో అమలుచేయని భూసేకరణ చట్టాన్ని తెలంగాణాలో అమలుచేయాలని తెదేపా నేతలు పట్టుబట్టడం వలన ఇటువంటి విమర్శలు, ప్రశ్నలు ఎదుర్కోవలసి ఉంటుంది. మంత్రి హరీష్ రావు ఇప్పటికే ఒకసారి వారిని ఈ ప్రశ్న అడిగారు కూడా. దానికి రెండు రాష్ట్రాలలో తెదేపా నేతలు ఇంతవరకు జవాబు చెప్పనే లేదు.