ఆంధ్రప్రదేశ్లో స్థిరాస్తి రంగం ఈ ఆర్థిక సంవత్సరంలో దూసుకెళ్తోంది. తొలి త్రైమాసికం అంటే ఏప్రిల్, మే, జూన్ నెలల్లో 50 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ మూడు నెలల్లో రిజిస్ట్రేషన్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రూ. 2,663 కోట్లు ఆదాయాన్ని పొందింది. 2024లో ఇది రూ. 1,821 కోట్లుగా ఉంది. రిజిస్ట్రేషన్ల సంఖ్య కూడా యాభై శాతం పెరిగినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో ఎనిమది శాతమే ఈ పెరుగుదల ఉంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రియల్ ఎస్టేట్ సెంటిమెంట్ మారిపోయింది. అమరావతి పట్టాలెక్కడం, విశాఖ ఐటీ క్యాపిటల్ గా మారేలా పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉండటంతో పాటు ఇతర నగరాల్లోనూ అభివృద్ధి ఊపందుకుంది. దీంతో అన్ని చోట్లా రియల్ ఎస్టేట్ కు డిమాండ్ పెరిగింది. స్థిరాస్తి రంగంలో పారదర్శకత , సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులు నిర్వహించి సమస్యలు పరిష్కరిస్తోంది. రిజిస్ట్రేషన్ రేట్ల సవరణ, మార్కెట్ డిమాండ్ పెరుగుదల, ప్రభుత్వ చర్యలు ఈ వృద్ధికి దోహదపడుడుతున్నాయి.
ఈ ఏడాది ఏపీ రియల్ ఎస్టేట్ రంగానికి అత్యంత కీలకం. అమరాతి పనులు ఇప్పుడే ఊపందుకుంటున్నాయి. వచ్చే రెండేళ్లలో దాదాపుగా పూర్తి చేస్తే…ప్రైవేటు పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తాయి. విశాఖకు ప్రకటించిన పెట్టుబడుల గ్రౌండింగ్ ప్రారంభమైతే ఇక తిరుగు ఉండదు. ఇతర జిల్లాల్లోనూ పరిశ్రమల పెట్టుబడులు, ఇతర ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ఉన్నాయి. అందుకే ఏపీ రియల్ ఎస్టేట్ కు తిరుగులేని భవిష్యత్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.