సంచలనం సృష్టించిన లారెన్స్: కోటి రూపాయల విరాళం

హైదరాబాద్: చెన్నై వరద బాధితులకు అల్లు అర్జున్, సూర్య లాంటి వారు తప్పితే మిగిలిన సినీ ప్రముఖులు 5-10 లక్షలను మాత్రమే ఇస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్, సూర్య మాత్రం రు.25 లక్షలు ప్రకటించారు. అయితే వీరందరినీ తలదన్నేలా కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు లారెన్స్ కోటి రూపాయల విరాళం ప్రకటించి సంచలనం సృష్టించారు. అట్టడుగు స్థాయినుంచి వచ్చిన లారెన్స్ కొరియోగ్రాఫర్‍‌గా కెరీర్‌ను ప్రారంభించి నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా మారారు. దర్శకుడిగా స్టైల్, మాస్, డాన్, కాంచన,రెబల్ వంటి చిత్రాలను రూపొందించారు. గతంలోకూడా ఎన్నో సంస్థలకు విరాళాలు అందించారు.

మరోవైపు సినీ నటులు ఇస్తున్న విరాళాలపై దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విట్టర్‌లో సెటైర్లు విసిరారు. వందల వందల కోట్లున్న సూపర్ స్టార్‌లు వేల వేల కోట్లు నష్టపోయిన చెన్నై నగరవాసులకు ఐదు-పది లక్షలు బిచ్చమేస్తున్నారని ఎద్దేవా చేశారు. “అయ్యబాబోయ్, సూపర్ స్టార్‌లు 10 లక్షలు, 5 లక్షలు ఇస్తే అంత డబ్బు ఏమి చేసుకోవాలో తెలియక చెన్నై ప్రజలు మూర్ఛ పోతారు. ఇవ్వకపోవటమే బెటర్” అని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే, తెలుగు నటులలో అల్లు అర్జున్ రు.25 లక్షలు, ప్రభాస్ రు.15 లక్షలు, మహేష్, ఎన్‌టీఆర్ రు.10 లక్షలు ఇస్తుంటే తమిళ నటులలో ఒక్క రజనీకాంత్ తప్పితే మరెవరూ రు.5 లక్షలకి మించి ఇవ్వకపోవటానికి ఒక విచిత్రమైన వాదన బయటకొచ్చింది. అక్కడ తమిళ ఇండస్ట్రీలో రజనీకాంత్ అంటే మిగిలిన నటీనటులందరికీ ‘సిగ్గుతో కూడిన భయం వలన వచ్చిన గౌరవం’ లాంటిది ఒకటుంటుంది. దానితో రజనీకాంత్ కంటే ఎక్కువ ఇస్తే ఆయనను అవమానించినట్లవుతుందనే ఉద్దేశ్యంతో రు.5 లక్షలకు మించి ఎవరూ ఇవ్వటంలేదు. ఆ విధంగా చెన్నై వరద బాధితులకు రజనీ ఎఫెక్ట్ తగిలింది. ఇంతా చేసి రజనీకాంత్ ఇచ్చింది రు. 10 లక్షలు!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com