కొంతమంది పుట్టుకతోనే వృద్దులు. ఇంకొంతమంది మాత్రం.. ఎంత వయసొచ్చినా కుర్రాళ్లే. సింగీతం శ్రీనివాసరావు కూడా ఇదే జాబితాలో ఉంటారు. ‘నాకు అసలు రిటైర్మెంటే లేదు’ అంటుంటారాయన. అందుకే ఈ వయసులోనూ చలాకీగా ఉన్నారు. సింగీతం సెంచరీకి చేరువులో ఉన్నారు. ఆయన వయసు 94. అయితే మాత్రం..? పనికి అడ్డేముంది? అందుకే ఈ వయసులోనూ ఆయన ఓ సినిమాకు దర్శకత్వం వహించారు. అన్నీ తానై చూసుకొన్నారు. నాగ అశ్విన్ నిర్మాతగా, సింగీతం దర్శకత్వంలో ఓ సినిమా రూపుదిద్దుకొంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. షూటింగ్ కూడా పూర్తయిపోయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. టైటిల్ తో పాటు గ్లింప్స్ త్వరలో విడుదల చేస్తారు.
94 ఏళ్ల వయసులో ఓ సినిమాకు దర్శకత్వం వహించడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఓరకంగా ఇది రికార్డ్. ఇలా.. సుదీర్ఘ కాలంగా దర్శకుడిగా పని చేస్తూ, లేట్ వయసులోనూ సినిమాకు దర్శకత్వం వహించిన దర్శకుడు మరొకరు లేరు. మృణాల్ సేన్, శ్యాం బెనగల్, వి.శాంతారామ్ లాంటి దర్శకులు 70 ఏళ్ల వయసులోనూ పని చేశారు. కానీ 94 ఏళ్ల దర్శకుడు సింగీతం మాత్రమే. సెట్లో ఆయన ఎంత హుషారుగా ఉన్నారో, ఈ రోజు విడుదల చేసిన గ్లింప్స్ చూస్తే అర్థం అవుతోంది. సెట్లో అందరికంటే ఆయనే అల్లరి చేశారన్న విషయం కూడా తెలుస్తోంది. ఆయన అన్నట్టు… సింగీతం లాంటి దర్శకులకు రిటైర్మెంట్ ఉండదు.. ఉండకూడదు. వందేళ్ల వయసులోనూ ఆయన్ని దర్శకుడిగా చూడాలి. ఆయన ఓ సినిమా చేయాలి. ఇదే సినీ అభిమానుల కోరిక.
