ఈమధ్య ప్రీమియర్ షోలు వేయడానికి నిర్మాతలు వెనుకా ముందూ ఆలోచిస్తున్నారు. టాక్ బయటకు వచ్చేశాక.. సినిమా చూడాలన్న ఇంట్రెస్ట్ ప్రేక్షకులకు తగ్గిపోతోందన్న సంగతి మేకర్స్‌కి అర్థమవుతోంది. నెగిటీవ్ టాక్ వస్తే.. మొత్తానికి అడ్రస్స్ గల్లంతవుతోంది. అందుకే పెద్ద సినిమాలు సైతం ప్రీమియర్లకు ‘నో’ చెబుతున్నాయి. ఇలాంటి పరిస్థితిల్లో ‘లిటిల్ హార్ట్స్’ అనే చిన్న సినిమా మూడు రోజుల ముందు నుంచే ప్రీమియర్లతో హడావుడి చేస్తోంది. ఈటీవీ విన్ నుంచి వస్తున్న సినిమా ఇది. ’90స్’ వెబ్ సిరీస్ ఫేమ్ మౌళి హీరోగా నటిస్తున్నాడు. ఇదో టీనేజ్ లవ్ స్టోరీ. మిడిల్ క్లాస్ డ్రామా లాంటి సినిమా. టీజర్, ట్రైలర్ యూత్ కి కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. వాళ్లని థియేటర్లకు రప్పించడమే పనిగా పెట్టుకొంది చిత్రబృందం.
మంగళవారం హైదరాబాద్ లో ప్రీమియర్ వేశారు. టాక్ బాగానే ఉంది. దాంతో.. బుధ, గురు వారాలూ ప్రీమియర్లు వేయాలని డిసైడ్ అయ్యారు. బుధవారం హైదరాబాద్, విజయవాడ, కాకినాడ, వైజాగ్ లలో కాలేజీ స్టూడెంట్స్ కోసం ప్రీమియర్లు వేస్తున్నారు. కాలేజీ ఐడీ తీసుకొస్తే చాలు.. టికెట్ అవసరం లేకుండా సినిమా చూసేయొచ్చు. గురువారం పెయిడ్ ప్రీమియర్లు ఉండబోతున్నాయి. సాయి మార్తాండ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. 90స్ ఫేమ్ ఆదిత్యహాసన్ నిర్మాతగా వ్యవహరించడం విశేషం. 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ రోజు ఘాటీ, మదరాసీ సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఆ రెండు పెద్ద సినిమాల్ని ఢీ కొట్టాలంటే ఈ మాత్రం సాహసం చేయక తప్పదు.