little hearts telugu movie review
తెలుగు రేటింగ్: 2.75/5
ఇంటర్, డిగ్రీ ‘ప్రేమ కథల’కు ఓ సౌలభ్యం ఉంది. అందులో కథేం ఉండాల్సిన పనిలేదు. కాన్ ఫ్లిక్ట్స్ పెద్దగా అవసరం లేదు. కాస్త ఫన్ వర్కవుట్ అయితే చాలు. కుర్రాళ్లు సరదాగా ఎంజాయ్ చేసేలా సీన్లు అల్లుకొంటే సరిపోతుంది. అయితే అది కూడా అంత సులభమైన పని కాదు. దర్శకుడికి ఈ జనరేషన్‌కు ఏం కావాలో అర్థం అవ్వాలి. కామెడీ పండించే సత్తా ఉండాలి. నటీనటులకు టైమింగ్ తెలిసుండాలి. ప్రేమకథలో చూపించే జంట కెమిస్ట్రీ బాగుండాలి. ఇవన్నీ కుదిరితేనే ప్రేక్షకుల్ని థియేటర్లో కూర్చోబెట్టగలం. హీరో హీరోయిన్లు కొత్తవాళ్లతే ఈ శ్రమ మరింత పెరుగుతుంది. ‘లిటిల్ హార్ట్స్’ సినిమా తెరపై కనిపించే వాళ్లంతా దాదాపు కొత్తవాళ్లే. ఇదీ ఇంటర్ – డిగ్రీ ప్రేమకథే. మరి… ఇందులో ఫన్ వర్కవుట్ అయ్యిందా? దర్శకుడు రాసుకొన్న కాన్ఫ్లిక్ట్ ఆకట్టుకొందా? ఈ జనరేషన్‌కు ఏం కావాలో అది ఇవ్వగలిగారా?
అఖిల్ (మౌళి) అత్తెసరు మార్కులతో ఇంటర్ పాస్ అవుతాడు. ఎంసెట్ లో కనీసం క్వాలిఫై కూడా అవ్వడు. అందుకే లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొంటాడు. ఈ ఫెయిల్యూర్ స్టోరీ భరించలేక ప్రేమించిన అమ్మాయి బై.. బై చెప్పేస్తుంది. లాంగ్ టర్మ్ కోచింగ్ క్లాసుల్లో కాత్యాయిని (శివానీ నాగారం)ని తొలి చూపులోనే ఇష్టపడతాడు. కాత్యాయిని కూడా అఖిల్ టైపే. చదువు పెద్దగా ఒంటపట్టదు. కానీ ఇంట్లో వాళ్ల పోరు భరించలేక ఇష్టం లేకపోయినా కోచింగ్ తీసుకొంటుంది. అఖిల్ అల్లరి చేష్టలు, అమాయకత్వానికి ఎట్రాక్ట్ అవుతుంది. తను కూడా ప్రేమిస్తుంది. కానీ.. ఒక్క విషయంలో మాత్రం తటపటాయిస్తుంది. అఖిల్ ప్రేమని కాదనడానికి కాత్యాయిని దగ్గరున్న కారణం ఏమిటి? ఈ ప్రేమకథ ముందుకు సాగిందా? మధ్యలోనే ఆగిందా? అనేది తెరపై చూడాలి.
ఓ అమ్మాయి, అబ్బాయి.. వాళ్ల మధ్య ప్రేమ. అందులోనే చిన్న అవాంతరం. ఇంట్లో పెద్ద వాళ్ల అభ్యంతరాలు, ఎడబాటు.. మళ్లీ కలుసుకోవడం.. ఇదే ‘లిటిల్ హార్ట్స్’. ఈ మాత్రం కథని నమ్మి సినిమా ఎలా తీశారు? అనే అనుమానం వేయడం సహజాతి సహజం. నిజానికి కథ ఇలా చెబితే ఏ నిర్మాతా సినిమా తీయడానికి ధైర్యం చేయడు. కథ కంటే.. దర్శకుడు రాసుకొన్న సరదా సన్నివేశాలు, ఆ సన్నివేశాల్లో నటీనటుల పరకాయ ప్రవేశం చేసిన తీరు, క్యూట్ క్యూట్ మూమెంట్స్.. ఇవే ఈ సినిమాని ముందుండి నడిపించాయి. కథలో గమ్మత్తు లేదు. ఆ కథని నడిపిన తీరులోనే మజా ఉంది. అదే ‘లిటిల్ హార్ట్స్’ని కాలక్షేపానికి ఢోకా లేకుండా చేసింది.
‘జియో సిమ్ రాక ముందు కథ’ అని ఈ సినిమాని మొదలెట్టాడు దర్శకుడు. కాబట్టి.. టైమ్ మిషన్ ఎక్కి కొన్నేళ్లు వెనక్కి వెళ్లాల్సిందే. అప్పట్లో ఫేస్ బుక్‌లో రిక్వెస్టులు పంపుకోవడాలూ, మెసెంజర్లలో ముచ్చట్లూ, ఎంపీసీ – బైపీసీ మధ్య నడిచే చిన్న క్లాష్లూ, నచ్చని లెక్చరర్ పేరుని పేరడీ చేసి గోడ మీద రాయడాలూ, స్నేహితులతో ప్రేమ రాయబారాలు పంపుకోవడాలూ.. ఇవే కదా యూత్ చేసే హంగామా. ఇవన్నీ.. ఈ సినిమాలో చూడొచ్చు. ఈ వయసుని దాటి వచ్చిన వాళ్లు మళ్లీ ఆ నాటి అనుభవాలు నెమరు వేసుకొనేంత సరదాగా ఆ సన్నివేశాల్ని పేర్చాడు దర్శకుడు. ఇలాంటి లవ్ స్టోరీల్లో పెద్ద కాన్ఫ్లిక్ట్స్ ఏముంటాయి? అమ్మాయి పడుతుందా – లేదా? ఫోన్ చేస్తుందా, చేయదా? ఇంట్లో తెలియకుండా ప్రేమించుకోవడం ఎలా.. ఇవే కదా పెద్ద పెద్ద సంఘర్షణలు. అవే తెరపైనా కనిపిస్తాయి. ఎప్పుడైతే టీనేజీ లవ్ స్టోరీతో కనెక్ట్ అవ్వడం మొదలెడతామో.. అప్పటి నుంచీ మౌళితో పాటుగా ప్రయాణం చేసేస్తాం. ఆ పాత్ర నవ్వితే నవ్వుతాం.. బాధ పడినా నవ్వుతాం. ఆఖరికి దెబ్బలు తిన్నా నవ్వుతూనే ఉంటాం. అంతలా మౌళి పాత్రని తీర్చిదిద్దాడు దర్శకుడు. ఎప్పుడైతే మౌళి పాత్రకు కనెక్ట్ అయిపోయామో.. అప్పటి నుంచి తెరపై ఏ సన్నివేశం బలహీనంగా కనిపించదు. ఓ సరదా ప్రయాణంలా సాగిపోతూ ఉంటుంది.
ప్రధమార్థం ఎప్పుడు మొదలైందో, ఎప్పుడు ముగిసిందో తెలీదు. ద్వితీయార్థంలో నడపడానికి పెద్ద కథేం మిగల్లేదు. కాబట్టి `లిటిల్ హార్ట్స్` అక్కడక్కడే తచ్చాడుతున్నట్టు, కాస్త తడబడుతున్నట్టు తెలుస్తుంటుంది. మధ్యలో ‘కాత్యాయిని..’ అనే ఓ పాటతో మళ్లీ నవ్వుల మాయలో పడేశాడు దర్శకుడు. ఓ పాట.. అందులో లిరిక్స్, వాటికి నటీనటులు ఇచ్చే ఎక్స్ ప్రెషన్స్.. ఇందులోంచి కూడా ఫన్ పండిచొచ్చని ఈ పాట నిరూపించింది. ఆ పాట తాలుకూ రిలిక్స్ ఎక్కడ వచ్చినా నవ్వుతూనే ఉంటాం. ఈ సినిమాని చివర్లో ఎమోషనల్ గా టర్న్ చేయడానికి చూడలేదు దర్శకుడు. అది మంచిదయ్యింది. చివర్లో ఏదో డ్రామా పండించి, మళ్లీ హీరో – హీరోయిన్లు కలుసుకొని, అక్కడ శుభం కార్డు వేసి.. ఇలా రొటీన్ గా ఆలోచించకుండా.. ఏడుపుల గోలకు వెళ్లకుండా అంతే సరదాగా ముగించాడు. క్లైమాక్స్ కి ముందు కాస్త సాగదీసినట్టు అనిపిస్తుంది. వీలైనంత త్వరగా శుభం కార్డు వేస్తే ఆ సాగదీత ఫీలింగ్ కూడా ఉండేది కాదు.
మౌళిని తప్ప అఖిల్ పాత్రలో మరొకర్ని ఊహించలేం. తన నటన చాలా సహజంగా అనిపించింది. ఓ దశలో తాను ఏం చేసినా నవ్వు వస్తుంది. అంతగా లీనమైపోయాడు. ఓరకంగా ఇతనో లిటిల్ సిద్దు జొన్నలగడ్డ.. ఓ లిటిల్ నవీన్ పొలిశెట్టి టైపు. ఈ కామెడీనే నమ్ముకొంటే తనకు మంచి భవిష్యత్తు ఉంటుంది. శివానీ బాగానే చేసింది. హీరో కంటే తను పెద్దదిగా కనిపిస్తుంది. అది కూడా ఈ కథకు కలిసొచ్చింది. రాజీవ్ కనకాలకు ఫుల్ లెంగ్త్ పాత్ర దక్కింది. ఓ మధ్యతరగతి తండ్రిగా బాగా చేశారు. అదృష్టం కొద్దీ ఈ పాత్రని దర్శకుడు చంపలేదు. కాంచి నటన (కాత్యాయిని పాటలో) ఆకట్టుకొంటుంది. మధు పాత్రలో కనిపించిన నటుడి టైమింగ్ బాగా కుదిరింది. ఓ దశలో మౌళిని కూడా తాను డామినేట్ చేశాడు.
దర్శకుడికి మంచి భవిష్యత్ ఉంది. తన రైటింగ్ కి మంచి మార్కులు పడతాయి. పాటలు సాహిత్య పరంగా ఆకట్టుకొంటాయి. రాజా వారు పాట తమాషాగా సాగింది. కాత్యాయినీ పాట అయితే ‘ఇది కూడా ఓ పాటేనా’ అనిపించేలా కావాలని రాశారు. అది ఫన్నీగా వర్కవుట్ అయ్యింది. సెకండాఫ్‌లో ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్‌గా ఉండాల్సింది. ఈటీవీ విన్ నుంచి వచ్చిన సినిమా ఇది. క్వాలిటీ కథకు సరిపడా ఉంది. ఓ చిన్న కథ, తమాషా సన్నివేశాలు, కాలక్షేపానికి డోకా లేని వినోదం.. ఇవన్నీ టికెట్ రేటుని గిట్టుబాటు చేశాయి. పెద్దలు కూడా ఎంజాయ్ చేసేలా కొన్ని సీన్లు ఉన్నప్పటికీ.. ఇది పూర్తిగా యూత్ సినిమా. ఇంటర్ – డిగ్రీ ఈ వయసు పిల్లలు బాగా కనెక్ట్ అయ్యే సినిమా.
– అన్వర్
little hearts telugu movie review
తెలుగు రేటింగ్: 2.75/5