దేశవ్యాప్తంగా అత్యంత ఉత్కంఠ రేకెత్తిస్తున్న లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన బిల్లు ఈ నెలలోనే పార్లమెంటు ముందుకు రాబోతోంది. దీని కోసం కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల ప్రత్యేక పార్లమెంటు సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించింది. 2026 తర్వాతే నియోజకవర్గాల పెంపు ఉంటుందని గతంలో రాజ్యాంగ సవరణ చేశారు. ఇప్పుడు ఆ గడువు సమీపించడంతో కేంద్రం ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించుకుంది. ఈ బిల్లు ఆమోదం పొందితే, ప్రస్తుతం ఉన్న 543 లోక్సభ స్థానాల సంఖ్య ఏకంగా 750 నుండి 848 వరకు పెరిగే అవకాశం ఉంది.
దక్షిణాది ప్రయోజనాలను కాపాడేలా ఫార్ములా
నియోజకవర్గాల పెంపునకు ప్రాతిపదికగా యాభై శాతం పెంపును తీసుకుంటారని భావిస్తున్నారు. ఉత్తర మ, దక్షిణ భారత్ మధ్య రాజకీయ సమతుల్యతను కాపాడాల్సిన అమరం కనిపిస్తోంది. జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి దక్షిణ రాష్ట్రాలు తమ సీట్ల సంఖ్య తగ్గుతుందేమోనని ఆందోళన చెందుతున్నాయి. మరోవైపు, జనాభా భారీగా పెరిగిన ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య గణనీయంగా పెరగనుంది. ఈ వ్యత్యాసాన్ని ఎలా సవరించాలనే అంశంపై కేంద్రం ఒక ప్రత్యేక ఫార్ములాను ఈ బిల్లులో ప్రతిపాదించనుందని సమాచారం.
నియోజకవర్గాలు పెంచితేనే మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు
కొత్త పార్లమెంటు భవనంలో ఇప్పటికే పెరగబోయే సభ్యుల సంఖ్యకు అనుగుణంగా సీటింగ్ అమరికను సిద్ధం చేయడం, ఈ బిల్లు రాబోతోందన్న వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు కావాలన్నా నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరి కాబట్టి, కేంద్రం ఈ విషయంలో పట్టుదలతో ఉంది. ఈ ప్రత్యేక సమావేశాల్లో కేవలం నియోజకవర్గాల పెంపు మాత్రమే కాకుండా, దానికి సంబంధించిన రాజ్యాంగ సవరణలను కూడా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
అత్యంత కీలకంగా ప్రత్యేక సమావేశాలు
రాజకీయంగా ఇది ఒక పెను మార్పునకు దారితీయబోతోంది. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఉనికి, కేంద్రంలో అధికారాన్ని చేపట్టే సమీకరణాలు ఈ సీట్ల పెంపుతో పూర్తిగా మారిపోనున్నాయి. ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే ఈ అంశంపై గళమెత్తుతున్నాయి, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నెలలో జరగబోయే ఆ రెండు రోజుల ప్రత్యేక సమావేశాలు భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత కీలకమైనవిగా నిలవనున్నాయి.
