లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీ స్థానాల సంఖ్యను భారీగా పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను పూర్తి చేసి, మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలన్నది ప్రభుత్వ ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది. సోమవారం ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎన్డీఏ మిత్రపక్షాల నేతలతో నిర్వహించిన సమావేశంలో ఈ అంశంపై స్పష్టత ఇచ్చారు.
50 శాతం మేర సీట్ల పెంపు
లోక్సభ స్థానాల సంఖ్య ప్రస్తుతం ఉన్న 543 నుండి సుమారు 816కు పెరిగే అవకాశం ఉంది. అంటే దాదాపు 50 శాతం మేర సీట్లు పెరుగుతాయి. ఇదే నిష్పత్తిలో రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను కూడా పెంచాలని కేంద్రం భావిస్తోంది. 2021 జనాభా గణన ప్రక్రియ కోవిడ్ కారణంగా ఆలస్యమవడంతో, 2011 జనాభా లెక్కలనే ప్రాతిపదికగా తీసుకుని ఈ విభజన చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనివల్ల 2029 ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుకు మార్గం సుగమం అవుతుంది.
మహిళా రిజర్వేషన్ల అమలుకు ముడి
2023లో ఆమోదించిన మహిళా రిజర్వేషన్ చట్టం ప్రకారం.. పునర్విభజన తర్వాతే 33 శాతం కోటా అమల్లోకి రావాలి. తాజా ప్రతిపాదన ప్రకారం 816 సీట్లలో సుమారు 273 స్థానాలు మహిళలకు కేటాయిస్తారు. అంటే ప్రస్తుతం ఉన్న మొత్తం లోక్సభ స్థానాల్లో సగం సీట్లు మహిళా రిజర్వేషన్ల రూపంలో అదనంగా వచ్చి చేరుతాయన్నమాట. ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ స్థానాల్లో కూడా వన్-థర్డ్ కోటాను మహిళలకు కేటాయించనున్నారు.
దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలు – కేంద్రం భరోసా
జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపు చేపడితే, జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయన్న ఆందోళన ఎప్పటి నుంచో ఉంది. అయితే, ఈ సమావేశంలో అమిత్ షా మిత్రపక్షాలకు కీలక భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న రాష్ట్రాల వారీ సీట్ల వాటా తగ్గకుండా, దామాషా పద్ధతిలో అన్ని రాష్ట్రాల్లోనూ సీట్లు పెరిగేలా జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన వివరించారు. దీనివల్ల ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ లబ్ధి చేకూరుతుందన్న వాదనకు తెరదించవచ్చని కేంద్రం భావిస్తోంది.
మిత్రపక్షాల మద్దతు
ఈ సమావేశంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నేతలు కేంద్ర ప్రతిపాదనపై సంతృప్తి వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాల సీట్లు తగ్గకుండా సమానంగా పెంచితే తమకు అభ్యంతరం లేదని టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నట్లుగాతెలుస్తోంది. ఈ మార్పుల కోసం రాజ్యాంగ సవరణ బిల్లును ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో లేదా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ప్రవేశపెట్టే అవకాశం ఉంది. రాజ్యాంగంలోని అధికరణ 82 ప్రకారం పునర్విభజన జరగాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయితే భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఇది అతిపెద్ద సంస్కరణగా నిలవనుంది. లోక్సభలో సభ్యుల సంఖ్య పెరగడం ద్వారా నియోజకవర్గాల పరిధి తగ్గి, ప్రజలకు ప్రతినిధులు మరింత చేరువయ్యే అవకాశం ఉంటుంది.


