రాజధానిపై వైఎస్ జగన్ ఎన్నెన్ని టర్నులు తీసుకున్నారో లెక్కలేదు. అమరావతిని రాజధానిగా నిర్ణయించేందుకు శనివారం అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం అవుతోంది. ఈ సందర్భంగా నారా లోకేష్ అసెంబ్లీకి వచ్చి జగన్ తన విధానాన్ని చెప్పాలని పిలుపునిచ్చారు. ఆయన విధానం ఏదో.. పదకొండు సార్లు చెప్పిన విషయాలను ఓ వీడియోగా చేసి తన సోషల్ మీడియాలో పోస్టు చేసి.. ఆయనకు ఉన్న 11 మంది ఎమ్మెల్యేల బలంతో సింక్ చేశారు.
అసెంబ్లీకి వచ్చి జగన్ తన నిలకడలేని రాజకీయ వైఖరిని స్పష్టం చేయాలని లోకేష్ డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పు డు ఒక మాట, అధికారంలోకి వచ్చాక మరో మాట చెప్పడం ద్వారా జగన్ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించారని లోకేష్ వీడియో సహా నిరూపించారు. జగన్ రాజకీయ విశ్వసనీయతను ప్రశ్నిస్తూ, గతంలో ఆయన రాజధాని గురించి పదేపదే మార్చుకున్న మాటలను క్రోడీకరిస్తూ నారా లోకేష్ ఒక ప్రత్యేక వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. దాదాపు 11 సార్లు జగన్ తన మాట మార్చిన తీరును ఈ వీడియోలో కళ్లకు కట్టినట్లు చూపించారు. అమరావతికి నా పూర్తి మద్దతు అని అసెంబ్లీ సాక్షిగా గతంలో చెప్పిన జగన్, ఆ తర్వాత మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం ఆయన అవకాశవాద రాజకీయాలకు నిదర్శనమని లోకేష్ ఎండగట్టారు.
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది, ఇది జగన్ నాయకత్వంలోని విశ్వసనీయత లోపాన్ని ఎత్తిచూపుతోంది. ఒక ముఖ్యమైన అంశంపై ఇన్నిసార్లు ‘యూ-టర్న్’ తీసుకోవడం ద్వారా రాష్ట్ర భవిష్యత్తును జగన్ పణంగా పెట్టారని లోకేష్ విమర్శించారు. అసెంబ్లీ వేదికగానైనా జగన్ తన అసలు ఉద్దేశాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పాలని, లేనిపక్షంలో చరిత్రలో ఆయన ఒక నమ్మకం లేని నాయకుడిగా మిగిలిపోతారని హెచ్చరించారు. మరి జగన్ వస్తారా?