గురువారం విడుదలైన కూలీ, వార్ 2 చిత్రాలకు మిశ్రమ స్పందన వచ్చింది. రివ్యూలు ఏమాత్రం గొప్పగా లేవు. ఫ్యాన్స్ కూడా పెదవి విరుస్తున్నారు. విడుదలకు ముందు ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అవి పెద్ద మైనస్ గా మారాయి. ఏవేవో ఊహించుకొని ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లారు. వాళ్లంతా నిరుత్సాహ పడ్డారు. అయితే… ఈ రెండు సినిమాలకు ఓ ప్లస్ పాయింట్ వుంది. అదేంటంటే… ఇది లాంగ్ వీకెండ్. గురువారం ఓపెనింగ్ డే కాబట్టి వసూళ్లు అదిరిపోయాయి. అడ్వాన్స్ బుకింగుల మహత్తుతో ఈ వీకెండ్ అంతా థియేటర్లు కళకళలాడే అవకాశం ఉంది. రజనీకాంత్, ఎన్టీఆర్ సినిమాలు కాబట్టి.. ఎలాగున్నా ఓసారి చూసేయడానికి అభిమానులు సిద్ధంగా ఉన్నారు. సినిమాలు బాగుంటే… రెండోవారం ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు వచ్చేవారు. అప్పుడు మరింత అడ్వాంటేజ్ దక్కేది. కానీ నెగిటీవ్ రివ్యూలూ, మౌత్ టాక్ వల్ల రెండో వారం ఈ సినిమాలు నిలబడడం కష్టమని విశ్లేషకులు తేల్చేస్తున్నారు. ఇప్పటికైతే ఫస్ట్ వీకెండ్ మంచి వసూళ్లే రాబట్టే అవకాశం వుంది. సెలవలు కలసి రాకపోతే.. ఈ రెండు సినిమాలకూ మరింత డామేజీ జరిగేది.
‘వార్ 2’ని తెలుగులో రూ.90 కోట్లకు కొనుగోలు చేసినట్టు వార్తలు అందుతున్నాయి. నిర్మాత నాగవంశీ ఎన్టీఆర్కి వీరాభిమాని. ఆయనతో ఓ సినిమా కూడా తీస్తున్నారిప్పుడు. ఆ అనుబంధంతోనే.. వార్ 2 హక్కుల్ని పోటీ పడి మరీ కైవసం చేసుకొన్నారు. ఆ 90 కోట్లు తిరిగి వస్తాయా, రావా? అనేది అనుమానంగా మారింది. టాక్ నెగిటీవ్ గా రావడం, మరోవైపు కూలీతో పాటుగా వసూళ్లని పంచుకోవాల్సి ఉండడంతో.. నాగవంశీ పెట్టిన పెట్టుబడి రాబట్టుకోవడం కష్టమే.
ఇటీవల ఆయనకు ‘కింగ్ డమ్’ తోనూ పెద్ద దెబ్బ తగిలింది. ‘వార్ 2’కూడా ఇబ్బంది పెడితే – నాగవంశీ భారీ నష్టాల్ని మోయాల్సి ఉంటుంది. ‘కింగ్ డమ్’తో కనీసం పాతిక కోట్లయినా నష్టం వచ్చి ఉంటుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ‘వార్ 2’తో కూడా ఇంచుమించుగా అంతే పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి వీటి నుంచి నాగవంశీ ఎలా బయటపడతారో చూడాలి.