మెడికల్ కాలేజ్ లో ప్రవేశాలకై జాతీయస్థాయిలో నిర్వహించిన నీట్ పరీక్షా ఫలితాలు మరింత ఆలస్యం కానున్నాయి. పరీక్ష ప్రక్రియ,సమగ్రతలపై అనుమానం వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు.. రిజల్ట్స్ పై స్టే విధించింది. తదుపరి విచారణను జూన్ 2వ తేదీకి వాయిదా వేసింది.
2025-26 విద్యాసంవత్సరానికి దేశవ్యాప్తంగానూ మెడికల్ కాలేజ్ లో ప్రవేశం కోసం మే4వ తేదీన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే, ఓ చోట విద్యుత్ సరఫరా ఆగిపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ విద్యార్థులు కోర్టును ఆశ్రయించారు. విద్యుత్ సరఫరా లేకపోవడంతో చీకట్లో పరీక్ష రాయాల్సి వచ్చిందని, విద్యుత్ పునరుద్దరణ ఏర్పాట్లు కూడా చేయలేదని పిటిషన్ లో పేర్కొన్నారు.
దీనిపై విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు ఫలితాల విడుదలకు బ్రేకులు వేసింది. ఇప్పటికే మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్ కూడా నీట్ ఫలితాలను తాత్కాలికంగా నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో పరీక్ష ఫలితాలు ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా అని ఎదురుచూస్తున్న విద్యార్ధుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.
ఆలస్యంగానైనా ఫలితాలు విడుదల అవుతాయా? లేదంటే పరీక్షలను రద్దు చేసి మరోసారి నిర్వహిస్తారా? అని హైరానా పడుతున్నారు.