ప్రజలు ఇచ్చే అధికారాన్ని సొంత ప్రయోజనాలకు వాడుకుని, ప్రజలందర్నీ నిరుపేదల్ని చేసి వారి మొహాన ఇంత రేషన్ కొట్టి బానిసలుగా చేసుకుని అధికారం ఎల్లకాలం అనుభవించాలని అనుకునేవారికి వెనిజులా అధ్యక్షుడు మదురో జీవితం ఓ గుణపాఠం. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన చమురు నిల్వలు ఉన్న వెనిజులాలో తానే అధికారంలో ఉండాలన్న కాంక్షలతోప్రజల్ని బిచ్చగాళ్లను చేశాడు. దేశాన్ని నాశనం చేశాడు. ఇప్పుడు అమెరికా గుప్పిట్లోకి చేరుకున్నాడు.
ఒకప్పుడు లాటిన్లో ధనిక దేశం వెనిజులా
వెనిజులా అధ్యక్షుడిగా నికోలస్ మదురో సాగించిన దశాబ్ద కాలపు పాలన ఆ దేశ చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోనుంది. ఒకప్పుడు లాటిన్ అమెరికాలోనే అత్యంత ధనిక దేశంగా వెలిగిన వెనిజులాను, మదురో తన స్వార్థపూరిత రాజకీయాల కోసం కటిక దారిద్ర్యంలోకి నెట్టారు. ప్రజల ఆదాయ మార్గాలన్నింటినీ దెబ్బతీసి, ఉపాధిని దూరం చేసి, చివరకు దేశ ప్రజలు విదేశీ సాయం కోసం లేదా ప్రభుత్వం ఇచ్చే రేషన్ పొట్లాం కోసం అల్లాడేలా చేశారు. ఈ ఆకలి రాజకీయాల ద్వారా ప్రజలు తనపై తిరుగుబాటు చేయకుండా, కేవలం మనుగడ కోసం తనపై ఆధారపడేలా చేయడం మదురో అనుసరించిన అత్యంత క్రూరమైన వ్యూహం.
ప్రజల ఆదాయం అంతంతమాత్రం – ఆహారానికీ సరిపోదు!
మదురో హయాంలో ద్రవ్యోల్బణం ఎంతలా పెరిగిందంటే, ప్రజలు ఎంత కష్టపడినా వారికి వచ్చే జీతం కనీసం ఒక పూట భోజనానికి కూడా సరిపోని పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల సుమారు 70 లక్షల మంది ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దేశం వదిలి పారిపోయారు. దేశంలో ఉన్న వారు సైన్యం అణచివేతకు భయపడి ఇన్నాళ్లూ మౌనంగా ఉండిపోయారు. అందుకే అమెరికా దళాలు మదురోను అదుపులోకి తీసుకోవడం పట్ల వెనిజులా వీధుల్లో నిరసనలు కాకుండా, మిన్నంటుతున్న సంబరాలు కనిపిస్తుండటం గమనార్హం. తమను బానిసలుగా మార్చిన నియంత నుంచి విముక్తి లభించిందని ప్రజలు బాహాటంగానే ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పాలకులు.. ప్రజల మెప్పు పొందాలి !
ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ, వ్యవస్థలను తమ గుప్పిట్లోకి తెచ్చుకుని పాలించాలనుకునే ఏ నాయకుడికైనా ఒక గుణపాఠం. ప్రజలను ఆర్థికంగా బలహీనపరిచి, భయం నీడలో బానిసలుగా ఉంచవచ్చని భావించే ఏ నియంతకైనా అంతిమంగా ప్రజల నుంచి లేదా అంతర్జాతీయ సమాజం నుంచి ఇలాంటి పరాభవమే ఎదురవుతుంది. అణచివేత ఎప్పటికీ గెలవదని, ప్రజాభిమానం లేని ఏ నాయకుడూ శాశ్వతం కాదని వెనిజులా ఉదంతం మరోసారి నిరూపించింది.
