సినిమాలంటే పిచ్చి. బోలెడన్ని సినిమాలు చూసేస్తాం. సినిమా గురించి తెలిసిపోయింది అని అనుకుంటాం. మనలో ఓ రచయిత, డైరెక్టర్, నటుడు ఉన్నాడని ఫిక్స్ అయిపోయి హైదరాబాద్ బస్సు ఎక్కేస్తాం. మొదట్లో డైరెక్టర్ అవ్వాలనో, హీరో అవ్వాలనో ఏదో ఒకటి కచ్చితంగా డిసైడ్ అవుతాం. కానీ ఎంత ట్రై చేసినా ఎవ్వడూ అవకాశం ఇవ్వడు. దెబ్బకు తత్వం బోధపడుతుంది. వెనక్కు వెళ్ళాలంటే ప్రిస్టేజీ అడ్డమొస్తుంది. అందుకే ఎవడో ఒకడు ఆఫీస్ బాయ్గానైనా అవకాశం ఇవ్వకపోతాడా అని ఆశగా ఎదురు చూస్తాం. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటాం. ఆర్టిస్టులు అందరికీ కూడా ఎలా నటించాలో? డైలాగులు ఎలా చెప్పాలో చేసి చూపించే క్రమంలో మన నటనా సామర్ధ్యం పెరుగుతూ ఉంటుంది. ఆ టాలెంట్‌ని గుర్తించిన ఎవరో ఒక డైరెక్టర్ మనకు నటుడిగా అవకాశం ఇస్తాడు. ఆ క్యారెక్టర్ క్లిక్ అయితే ఇక వరుసగా అవకాశాలు వస్తాయి. అంతే స్టార్ అయిపోతాం.
ఇప్పుడు మళ్ళీ మొదటికి వస్తాం. మొదట్లో హైదరాబాద్ బస్సు ఎక్కి వచ్చినప్పుడు ఏమేమి కోరికలు ఉన్నాయో అవన్నీ తీర్చుకోవాలని ఫిక్స్ అవుతాం. డైరెక్టర్స్ అయితే హీరో అవ్వాలని అనుకుంటారు. నటులు అయితే డైరెక్టర్స్ అవ్వాలని కోరుకుంటారు. విజయంతో వచ్చే గర్వం, కాన్ఫిడెన్స్ మనల్ని అస్సలు కుదురుగా ఉండనీయదు. మన ప్రతిభపైన ప్రగాఢ నమ్మకంతో కొందరు, మన టాలెంట్‌ని అందరికీ చూపించుకోవడం కోసం మరి కొందరు, ఇగోతో రెచ్చిపోయిన ఇంకొందరు కూడా ఎన్నో ఎన్నో చేసేద్దామని ఫిక్స్ అవుతారు. 24క్రాఫ్ట్స్‌లో వేలెట్టాలని డిసైడ్ అయిపోతారు. టెక్నికల్ విషయాల్లో నాలెడ్జ్, సబ్జెక్ట్ తెలిసి ఉండడం మస్ట్ కాబట్టి వాటిని వదిలేస్తారు. కానీ రచయిత, డైరెక్టర్, నటన లాంటివి ఇప్పుడు చేస్తున్న వాళ్ళకంటే నాకు బాగా వచ్చు అన్న నమ్మకం హైదరాబాద్ బస్సు ఎక్కక ముందే ఏర్పడి ఉంటుంది కాబట్టి అవన్నీ చేసేయాలని ఫిక్స్ అవుతాం. అలా రకరకాలుగా ట్రై చేసి లారెన్స్‌లా సక్సెస్ అయిన వాళ్ళు కూడా మన కళ్ళముందు కనిపిస్తూ ఉంటారు. అలాగే కెరీర్స్‌ని నాశనం చేసుకుని మన కంటికి కనిపించకుండా పోయిన వాళ్ళు కూడా చాలా మంది మనకు కనిపిస్తారు. కొంత మంది మాత్రం అటు అనుకున్న సక్సెస్ సాధించలేరు. అలాగని వెనక్కు వెళ్ళిపోదామనుకున్నా వెళ్ళలేరు. ఎందుకంటే ఏ సక్సెస్సూ లేనప్పుడు, ఎర్రబస్సు ఎక్కేసి వచ్చినప్పుడే ఎనక్కు ఎళ్ళడానికి ప్రిస్టేజీ అడ్డమొస్తుంటే……ఇప్పుడు బోలెడంత సక్సెస్ సాధించాక, స్టార్ ఢం వచ్చాక ఇంకెంత ప్రిస్టేజీ ఉంటుంది. అందుకే దెబ్బలు తగులుతూ ఉన్నా దండయాత్రలు చేస్తూనే ఉంటారు. నిజంగా ప్రతిభ ఉండి, నిజాయితీగా ప్రయత్నాలు చేసిన విశ్వనాథ్, దాసరి నారాయణరావు….అలాగే ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్న ప్రకాష్ రాజ్, పోసానిలాంటి వాళ్ళను తప్పు పట్టలేం కానీ పర్సనల్ ఇగోతోనో, ఇచ్తోనో, ఓవర్ కాన్ఫిడెన్స్‌తోనో ప్రేక్షకులను విసిగిస్తున్న వాళ్ళను మాత్రం అస్సలు క్షమించలేం. అయినా…ప్రేక్షకులు ఎన్ని అనుకున్నా.. అది సినేమా మాయ….పాత వాళ్ళ ఇస్టోరీలను ఎవ్వడూ పట్టించుకోడు. ఎవడికి వాడు కొత్తగా దండయాత్రలు చేస్తూనే ఉంటాడు.