ఓ సినిమాని ప్రేక్షకులు ఎందుకు చూస్తున్నారు? ఈ ప్రశ్నకు తలలు పండిన ఫిల్మ్ మేకర్స్ కూడా సమాధానం చెప్పలేరు. ఫలానా జోనర్, ఫలానా సెటప్, ఫార్ములాతో సినిమా తీస్తే ఆడియన్స్ చూస్తారని ఓ అంచనాకి అనుకోవడమే తప్పితే ప్రేక్షకులు మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో, ఎలాంటి సినిమాలు నచ్చుతాయో.. చెప్పడానికి ఒక సూత్రం అంటూ లేదు. దీనికి తాజా ఉదాహరణ హోంబాలే ఫిల్మ్స్ ప్రెజెంట్ చేసిన ‘మహావతార్ నరసింహ’.
ఇదొక యానిమేషన్ సినిమా. అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించాడు. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ తెలుగులో రిలీజ్ చేసింది. నిజానికి ఇలాంటి సినిమా ఒకటి వస్తుందని చాలా మందికి తెలియదు. పైగా యానిమేషన్ సినిమాలు తెలుగులో అద్భుతంగా ఆడిన దాఖలాలు లేవు. కానీ ‘మహావతార్ నరసింహ’ అలాంటి అద్భుతం చేసి చూపింది. ఈ సినిమాకి బుకింగ్స్ అనూహ్యంగా ఉన్నాయి. పాజిటివ్ మౌత్ టాక్‌తో ప్రారంభమైన ఈ సినిమా క్రమంగా పంజుకుంది. శని, ఆదివారాలు హైదరాబాద్‌లోని దాదాపు అన్ని థియేటర్స్‌లో హౌస్‌ఫుల్‌తో రన్ అయ్యింది. వర్కింగ్ డే అయిన సోమవారం కూడా మంచి ఫుట్‌ఫాల్స్ ఉన్నాయి. బుక్ మై షోలో సినిమాకి 9.8 రేటింగ్ ఉంది.
ఒక జోనర్‌కి ఫిక్స్ అయిన తర్వాత అందులో టాప్ క్వాలిటీ ఇస్తే జనం ఖచ్చితంగా ఆదరిస్తారన్నదానికి ఈ సినిమా నిదర్శనం. పూర్తి యానిమేషన్ గ్రాఫిక్స్‌తో వచ్చిన ఈ సినిమా ఆ విషయంలో ఎక్కడా తగ్గలేదు. కళ్లుచెదిరిపోయే గ్రాఫిక్స్ క్వాలిటీ కనిపించింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బావుందని చెప్పారు. ఇలాంటి సినిమాలు పిల్లలకు ఇష్టం. దీంతో వీకెండ్లో ఫ్యామిలీస్‌ని ఈ సినిమా ఆకర్షించగలిగింది. సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూసి ఆటోమేటిక్‌గా స్క్రీన్స్ పెరిగాయి.
శ్రీ మహా విష్ణువు దశావతారాల పురాణ గాథకు జీవం పోయాలని మహావతార్ సినిమాటిక్ యూనివర్స్‌కి శ్రీకారం చుట్టారు. ఈ యూనివర్స్ నుంచి మహావతార్ పరశురామ్, మహావతార్ రఘునందన్, మహావతార్ ధావకధేష్, మహావతార్ గోకులానంద, మహావతార్ కల్కి పార్ట్ 1, మహావతార్ కల్కి పార్ట్ 2 చిత్రాలు రాబోతున్నాయి. యానిమేషన్ సినిమాలని జనం థియేటర్స్‌లో చూస్తారా? అనే అనుమానాన్ని మహావతార్ నరసింహ పటాపంచలు చేసింది. ఈ విజయం ఈ ఫ్రాంచైజ్ నుంచి రానున్న సినిమాలకి గొప్ప జోష్ ఇచ్చింది.
అంతే కాదు.. యానిమేషన్ తో ఇంకొన్ని కథలు వెండి తెరను పలకరించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ జోనర్ ప్రత్యేకత ఏమిటంటే హీరోల్ని వెదుక్కోవాల్సిన పనిలేదు. ఎవ్వరి కాల్షీట్లూ అవసరం లేదు. విజువల్స్ పై గ్రిప్ ఉంటే చాలు. ఇలాంటి సినిమాలకు ప్రీ విజువలలైజేషనే పెట్టుబడి. గ్రాఫిక్స్ కంపెనీలతో టై అప్ అయి ఇలాంటి ప్రాజెక్టులు సెట్ చేసుకొంటే లాభాల్ని గడించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. యానిమేషన్ సినిమాలూ ప్రేక్షకులు చూస్తారన్న భరోసా కలిగింది కాబట్టి, భవిష్యత్తులో మరిన్ని కథలు యానిమేషన్ రూపంలో థియేటర్లలో సందడి చేయడం ఖాయంగా కనిపిస్తోంది.