హైదరాబాద్: శ్రీమంతుడుతో అద్భుతమైన విజయాన్ని చేజిక్కించుకున్న మహేష్, ఆ చిత్రం ప్రమోషనల్ కార్యక్రమాలన్నీ పూర్తవటంతో హాలీడేకు బయలుదేరారు. ఇటు చిత్ర విజయం, అటు కొడుకు గౌతమ్ బర్త్‌డే రెండూ సెలబ్రేట్ చేసుకోవటానికి థాయ్‌ల్యాండ్ వెళ్ళారు. గౌతమ్ పుట్టినరోజు ఆగస్ట్ 31. మహేష్‌కు, గౌతమ్‌కు ఇద్దరికీ బీచ్లన్నా, వాటర్ స్పోర్ట్స్అన్నా బాగా ఇష్టమని అందుకే థాయ్‌ల్యాండ్‌లోని ‘కో సామూ’ బీచ్‌కు వెళుతున్నామని నమ్రత ఒక జాతీయ ఆంగ్ల దినపత్రికకిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. సెప్టెంబర్ రెండోవారంలో మహేష్ తదుపరి చిత్రం బ్రహ్మోత్సవం షూటింగ్ ప్రారంభం కానుండటంతో మళ్ళీ విరామం ఉండదనే ఉద్దేశ్యంతో ఈ ట్రిప్ ప్లాన్ చేసినట్లు తెలిపారు. శ్రీమంతుడు చిత్రాన్ని తాను ఏడుసార్లు చూశానని, తాను ఏ చిత్రాన్నీ ఇన్నిసార్లు చూడలేదని, గౌతమ్కుకూడా ఇది బాగా నచ్చిందని, తను మూడుసార్లు చూశాడని చెప్పారు. మరోవైపు మహేష్ మాట్లాడుతూ, మంచి కంటెంట్‌ను చక్కగా ప్యాకేజ్ చేస్తే ప్రేక్షకులను కదిలిస్తుందని తనకు శ్రీమంతుడు చిత్రంద్వారా అర్థమయిందని చెప్పారు. బ్రహ్మోత్సవం చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల హృదయానికి హత్తుకునే మంచి స్క్రిప్ట్‌ను తయారుచేశారని అన్నారు. ఆ చిత్రంకూడా అందరికీ నచ్చుతుందని తాను భావిస్తున్నానని మహేష్ చెప్పారు.