`పెద్ద పండుగ’లో దాగున్న పరమార్థం..

భోగి, సంక్రాంతి, కనుములను కలిపి `పెద్ద పండుగ’ అంటాము. మరి ఈ పెద్దపండుగలో పాటించే ఆచారాల్లోని అంతరార్థాలను గ్రహించే ప్రయత్నం చేద్దాం….

భోగి : గృహం భోగంగా ఉండటమే భోగి. పంట చేతికి వచ్చే కాలం కావడంతో ఇంటినిండా నవధాన్యాలు సంవృద్ధిగా ఉంటాయి. ఇళ్లు కళకళలాడుతుంటుంది. ఇదే నిజమైన భోగి.

దక్షిణాయనం : భూమి సూర్యుని చుట్టూ తిరిగే భ్రమణాన్ని బట్టి రెండు ఆయనాలుంటాయి. వాటిలో ఒకటి దక్షిణాయనం, రెండోది ఉత్తరాయనం. ఈ రెంటికీ సంధికాలం భోగి. అంటే దక్షిణాయానానికి చివరి రోజు భోగి. తెల్లవారితే ఉత్తరాయణం. కొత్త క్రాంతి వచ్చేస్తుంది.

సూర్యారాధన : సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించేరోజు కావడంతో మకర సంక్రమణం అంటాము. అందుకే సంక్రాంతి రోజున సూర్యారాధన తప్పకుండాచేయాలి.

భోగిపీడ : ఈ మాట కూడా వినబడుతుంటుంది. భోగినాడు పనికిరాని వస్తువులతో మంటలువేస్తారు. మనం చెప్పుకునే సంవత్సర కాలం దేవతలకు ఒక రోజుతో సమానం. దక్షిణయానం వారికి రాత్రి. భోగితో వారికి రాత్రికాలం పరిసమాప్తం. దేవతలు మేలుకుని మనల్ని రక్షిస్తారన్న నమ్మకంతోనే పీడ వదిలిపోయిందంటూ భోగీ మంటలు వేస్తారు. మరో రకంగా చెప్పుకోవాలంటే మనలోని దురాలోచనలను మంటల్లో ఆహుతిచేసి, మంచి దిశగా సాగిపోవడమే భోగి. తమసోమా జ్యోతిర్గమయ – ఇదే భోగి సందేశం.

గొబ్బెమ్మలు : ఆవుపేడతో చేసే గొబ్బెమ్మల్ని ఓసారి తేరపారా చూడండి. మధ్యలో పెద్ద గొబ్బెమ్మ హుందాగా నిలబడి ఉంటే, పిల్ల గొబ్బెమ్మలు చుట్టూ ఉంటాయి. దానిమ్మ ఆకారంలో ఉండే పెద్ద గొబ్బెమ్మ కృష్ణభక్తురాలైన గోదాదేవికి సంకేతమని చెబుతుంటారు. గొబ్బెమ్మలు పెట్టిన ప్రాంతాన్ని బృందావనిగా పిలుచుకుంటూ శ్రీకృష్ణుణ్ణి భక్తిశ్రద్ధలతో కొలుస్తుంటారు.

హరిదాసులు : తలమీద గుమ్మడికాయ ఆకారంలో ఉండే గిన్నె ఈ భూమి. భూమిమీద పాడి పంటలకు గుర్తుగా గిన్నెనిండా ధాన్యం, పండ్లు, కూరగాయలు. అలాంటి సస్యశ్యామలమైన భూమిని `నేను కాపాడతున్నాను’ అన్నట్లుగా ఆ హరే `హరిదాసు’ రూపంలో వచ్చాడు. `ఆది వరాహ’ రూపంలో భూమిని కాపాడింది శ్రీహరే కనుక హరిదాసు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే. మకర సంక్రాంతి రోజునే విష్ణువు వరాహరూపం దాల్చి హిరణ్యాక్షుడ్ని సంహరించి భూదేవిని కాపాడారని చెబుతారు. అలాగే, వామనావతారం ఎత్తి మకర సంక్రమణం రోజునే బలిచక్రవర్తిని పాతాళానికి పంపినట్లు చెబుతారు. అంటే విష్ణువు యొక్క రెండు అవతారాలకు ఈ సంక్రాంతికి సంబంధం ఉన్నదన్నమాట.

గంగిరెద్దు : గొబ్బెల రూపంలో గోపికలు వచ్చారు. శ్రీకృష్ణతత్వం ఆలపించారు. అది విన్న హరిదాసు (శ్రీకృష్ణుడు) పరమానందంగా వేంచేశారు. హరి ఉన్న చోట హరుడు (శివుడు) ఉండాలి. అందుకే నందివాహనమెక్కి శివుడు వచ్చేశాడు. లింగాకృతిలో ఉండే గంగిరెద్దు మోపురమే శివుడు. గంగిరెద్దు మోపురానికి నమస్కరించుకుంటే పరమశివునికి ప్రణమిల్లినట్లే. మన ఇంట్లో ఉండే పాతబట్టలు గంగిరెద్దుమీద వేస్తుంటాము. అంటే ఈ పాత వస్త్రం శరీరానికి సంకేతంగా చెప్పుకుంటారు. ఐహిక సుఖాలను విస్మరించి, ఈ దేహాన్ని లింగైక్యం చేయాలన్న సంకేతంగానే వస్త్రాలను విసర్జించడంలోని అంతరార్థం. `ఈ జీవికి చివరకు మిగిలేది కేవలం భస్మమే సుమా…’ అన్న వేదాంత ధోరణికిసంకేతంగా జంగమ దేవర తన దగ్గరకు వచ్చినవారి విభూతి ఇస్తుంటాడు. సంక్రాంతి పర్వదినాల్లో హరిదాసు, గంగిరెద్దుల రాకతో శివకేశవుల నడుమ బేధం లేదన్న అద్వేత ధోరణి ద్యోతకమవుతుంటోంది.

ముగ్గులు : ఖగోళశాస్త్రాన్ని పామరులకు తెలియజెప్పడమే ముగ్గుల్లోని అంతరార్థం. ఆరు చుక్కలతో క్షురకత్తి ఆకారంలో ముగ్గుపెడితే కృత్తికా నక్షత్రపు ముగ్గనీ, అదే విల్లు ఆకారంలో ముగ్గు పెడితే దాన్ని పునర్వసు ముగ్గుఅని చెబుతుంటారు. ఐదు నక్షత్రాలతో పాముఆకారంలో ముగ్గుపెడితే దాన్ని అశ్లేష ముగ్గు అంటారు. అలాగే, నూరు చుక్కలతో ముగ్గుపెడితే దాన్ని శతభిషం ముగ్గు అంటారు. ఇంటిముందు ఆవుపేడతోఅలికిన ప్రాంతమే సువిశాల ఆకాశానికి ప్రతీక. ముగ్గుమధ్యలోని గడిలో ఎరుపురంగు వేస్తుంటారు. అదే సూర్యునికి సంకేతం. నీలిరంగు గడి శనికి ప్రతీక. ఇలా గ్రహాల ఉనికిని కూడా ముగ్గుల్లో చూపెట్టడం ఓ విశేషం.

గాలిపటాలు : సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు కనుక పుణ్యకాలం ఆరంభమైనట్టే. అంటే ఆత్మానంద ఘడియలను సూర్యభగవానుడు తీసుకువచ్చినందుకు మనసు పులకించి ప్రత్యక్ష నారాయణుడికి స్వాగతం చెబ్తూ మనం గాలిపటాలు ఎగురవేస్తుంటాం. రంగురంగుల గాలిపటాలు ఆకాశంలో ఎగురుతూ సూర్యునికి స్వాగతం చెబుతుంటాయి. గాలిలో ఎగిరే పతంగం పక్షికి సంకేతం. అంటే స్వేచ్ఛకు ప్రతీక. మనిషి స్వయంగా ఎగరలేకపోయినా మనసు మాత్రం ఆకాశయానం చేసిరాగలదు. అంటే ఈ పతంగులు మన ఎగిరే మనసులకు సంకేతాలుగా చెబుతుంటారు.

కనుము : కనుము అంటే `పశువు’ అన్న అర్థం ఉంది. ఈ సృష్టిలో మానవజాతి ఒక్కటే వృద్ధి చెందలేదు. ఎన్నో జీవరాశులతో ఈ పృధ్వి విరాజిల్లుతోంది. సర్వజీవరాశి సుఖంగా ఉండాలని కోరుకుంటూ చేసుకునే పండుగే కనుము. పశువులను అలంకరించి గోప్రదక్షిణం చేస్తారు. ఏడాదిపాటు తమకోసం కష్టపడిన పశువుల రుణం అలా తీర్చుకుంటారు. `థాంక్స్ గివింగ్’ పండుగ ఇదే.

పితృదేవతలు : ఈ కనుము పండుగ రోజున ఇంటి ముంగిట ద్వారబంధానికి పైభాగాన కంకుల్ని వేలాడదీయడం ఆచారంగా వస్తున్నది. స్వర్గస్తులైన పెద్దలకు ఆహారాన్ని నైవేద్యమిచ్చి కొంత అన్నాన్ని కాకులకు వేస్తారు. ఇలా చేస్తే పిత్రుదేవతలు తృప్తి చెందుతారని అంటారు. ఈ రకంగా చూస్తే శుభ అశుభాలు ఈ పెద్దపండుగలో మిళితమై ఉంటాయని గ్రహించాలి. ఆచారల్లోని అంతరార్థాలను గ్రహిస్తూ పండుగలు చేసుకుంటే కలిగే సంతృప్తి ఎలా ఉంటుందో మరి వాటిని పాటిస్తూ మీరే తెలుసుకోండి.

telugu360.com పాఠకులకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు, సర్వులకూ మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పీవీ, ఎన్టీఆర్‌లకు కాషాయం పూసేసిన బండి సంజయ్..!

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పొలిటికల్‌గా ఫుల్‌ఫామ్‌లో ఉన్నారు. గ్రేటర్ ఎన్నికల మొత్తం షెడ్యూల్ కేవలం రెండు వారాలు. అయినా సరే.. కానీ టీ ట్వంటీ మ్యాచ్ ఆడుతున్నట్లుగా...

జగన్ షాక్ ట్రీట్‌మెంట్ ఇస్తేనే “ఆ” వైసీపీ నేతలు ఆగుతారా..!?

వైసీపీ నేతల మధ్య పంచాయతీలు దాడులకు దారి తీస్తున్నాయి. ముఖ్య నేతల మధ్య తిట్ల పంచాయతీలను తీర్చేందుకు జగన్ ప్రయత్నిస్తున్నా.. కింది స్థాయి నేతలు ఏమాత్రం ఆగడం లేదు. తూర్పుగోదావరి జిల్లా డీఆర్సీ...

మరో బిల్లు వెనక్కి పంపిన కేంద్రం..! తప్పు ఎవరిది..!?

ఏపీ సర్కార్ చట్టాలను.. రాజ్యాంగాన్ని.. నిబంధనలలను పట్టించుకోకుండా పాస్ చేస్తున్న బిల్లులు కోర్టుల్లోనే కాదు.. కేంద్రం వద్ద కూడా ఆగిపోతున్నాయి. కొన్ని అంశాలపై రాజకీయ పార్టీలు.. వాటితో ప్రభావితమయ్యే వారు కోర్టులను ఆశ్రయిస్తున్నారు....

మతకల్లోలాలపై కేసీఆర్‌ది భయమా..? మైండ్ గేమా..?

తెలంగాణ సీఎం కేసీఆర్ శాంతిభద్రతల పరిస్థితిపై టెన్షన్‌కు గురవుతున్నారు. హైదరాబాద్‌లో మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి కుట్ర జరుగుతోందని.. ప్రభుత్వానికి ఖచ్చితమైన సమాచారం ఉందని ప్రకటించారు. జిల్లాల్లో గొడవలు రాజేసి హైదరాబాద్‌కు విస్తరించాలని చూస్తున్నారు..ప్రార్థన...

HOT NEWS

[X] Close
[X] Close