బెంగాల్ రాజకీయాల్లో మరోసారి దీదీ వర్సెస్ ఈడీ పోరు ముదిరింది. 2026 అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ, బొగ్గు స్కామ్ కేసులో రాజకీయ వ్యూహకర్త సంస్థ ఐ-ప్యాక్ డైరెక్టర్ ప్రతీక్ జైన్ నివాసం, కార్యాలయాలపై ఈడీ దాడులు చేయడం కలకలం రేపింది. ఈ పరిణామంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తనదైన శైలిలో వీధుల్లోకి వచ్చి పోరాటం ప్రారంభించారు.
దీదీ స్ట్రీట్ ఫైటర్ – మళ్లీ అదే రాజకీయం
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మమతా బెనర్జీ ఎప్పుడూ స్ట్రీట్ ఫైటర్ గానే గుర్తింపు పొందారు. ఇప్పుడు ఐ-ప్యాక్ కార్యాలయాలపై ఈడీ సోదాలను ఆమె ఒక రాజకీయ అవకాశంగా మార్చుకున్నారు. ఇది కేవలం దర్యాప్తు కాదు, మా ఎన్నికల వ్యూహాలను దొంగిలించే ప్రయత్నం అని ఆమె నేరుగా ఆరోపిస్తున్నారు. సోదాలు జరుగుతున్న సమయంలోనే ఆమె ప్రతీక్ జైన్ నివాసానికి వెళ్లి, అక్కడి నుంచి కొన్ని ఫైళ్లను, హార్డ్ డిస్కులను స్వాధీనం చేసుకున్నారని ఈడీ ఆరోపించడం ఈ వివాదాన్ని మరింత రాజేసింది. తన పార్టీ డేటాను కాపాడుకోవడమే తన ప్రాధాన్యమని ఆమె స్పష్టం చేస్తూ, కోల్కతా వీధుల్లో భారీ నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నారు.
రాజకీయ అస్త్రంగా కేంద్ర సంస్థల దాడులు
మమతా బెనర్జీ తన ప్రభుత్వ వ్యతిరేకతను, పాలనా వైఫల్యాలను ప్రజలు మర్చిపోయేలా చేయడానికి బెంగాలీ అస్తిత్వం, కేంద్రం కక్షసాధింపు అనే అంశాలను బలంగా వాడుకుంటున్నారు. పాలనా వైఫల్యాలు, అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఈడీ దాడులను ఒక బాధితురాలి కోణంలో ప్రదర్శించడం ద్వారా సానుభూతి పొందాలని ఆమె చూస్తున్నారు. ముఖ్యంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా లక్ష్యంగా ఆమె విమర్శలు గుప్పిస్తూ, తన వద్ద కూడా కొన్ని పెన్ డ్రైవ్లు ఉన్నాయని, బీజేపీ నాయకుల అసలు రంగు బయటపెడతానని హెచ్చరించడం బెంగాల్ రాజకీయాల్లో వేడిని పెంచింది.
బీజేపీ వ్యూహం – ప్రతిఘటన
దీదీ పోరాటానికి బీజేపీ తనదైన శైలిలో కౌంటర్ ఇస్తోంది. ఒక ముఖ్యమంత్రి దర్యాప్తు జరుగుతున్న చోటుకు వెళ్లి ఆధారాలను తీసుకెళ్లడం అంటే ఏదో పెద్ద కుట్ర దాగి ఉందని అర్థం అని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే మమత డ్రామాలు ఆడుతున్నారని, ప్రజలకు అన్నీ తెలుసని వారు ప్రచారం చేస్తున్నారు. 2026 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బొగ్గు స్కామ్, ఉపాధి హామీ నిధుల మళ్లింపు వంటి అంశాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి, తృణమూల్ కాంగ్రెస్ అవినీతి పునాదులను కదిలించాలని బీజేపీ పక్కా ప్రణాళికతో ఉంది.
గత ఎన్నికల్లో కూడా ఇలాంటి దర్యాప్తు సంస్థల దాడులు జరిగినప్పుడు మమత విజయవంతంగా వాటిని రాజకీయంగా ఎదుర్కొన్నారు. అయితే, ఈసారి ఐ-ప్యాక్ వంటి సంస్థను నేరుగా టార్గెట్ చేయడం వల్ల టీఎంసీ ఎన్నికల వ్యూహాలకు ఆటంకం కలిగే అవకాశం ఉంది. దీదీ తన సహజ సిద్ధమైన పోరాట స్ఫూర్తితో మరోసారి ప్రజలను తనవైపు తిప్పుకుంటారా? లేకపోతే దీదీ అంతే అని ప్రజలు లైట్ తీసుకుంటారా?
