Mana Shankara Vara Prasad Garu Telugu Review
Telugu360 Rating: 3/5
ఈమధ్య మన హీరోలంతా వరల్డ్ బిల్డింగులు, సరికొత్త ప్రపంచాలు… అంటూ కొత్త దారులు వెదుక్కొంటున్నారు. ప్రేక్షకులూ వాటికి మెల్లమెల్లగా అలవాటు పడుతున్నారు. కానీ మెల్లమెల్లగా అవి కూడా బోర్ కొట్టేస్తున్నాయి. వాటి మధ్య మనదైన సందడి, మనవైన కథలు… నిండు వేసవిలో పిల్లతెమ్మరలా తాకితే హాయిగా అనిపిస్తున్నాయి. ఎలాంటి హడావుడీ లేకుండా.. సింపుల్ కథని, సరదాగా చెప్పేసినా భలే బాగుంటున్నాయి. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాది అదే దారి. యాక్షన్ ధమాకాల మధ్య.. ఆ సినిమా హాయినిచ్చింది. ఫ్యామిలీ డ్రామాలు కూడా వందల కోట్లు కొల్లగొట్టగలవని నిరూపించింది. అందుకే ఈసారి.. మెగాస్టార్ కూడా అనిల్ రావిపూడి దారిలోకి వెళ్లి.. ఓ ఫ్యామిలీ కథని ఎంచుకొన్నారు. వీరిద్దరూ కలిసి సంక్రాంతి సీజన్ ని లక్ష్యంగా చేసుకొని – మన శంకర వర ప్రసాద్ గారు తీర్చిదిద్దారు. మరి.. ఆ ప్రయత్నం ఎంత వరకూ సఫలీకృతం అయ్యింది? వరుస విజయాలతో నాన్ స్టాప్ గా దూసుకుపోతున్న.. అనిల్ రావిపూడి విజయ పరంపర కొనసాగించాడా? తనని నమ్మి తన దారిలో వచ్చిన మెగాస్టార్ కు హిట్ సినిమా అందివ్వగలిగాడా? ఈ సంక్రాంతి సెంటిమెంట్.. ఎంత వరకూ వర్కవుట్ అయ్యింది?
శంకర వర ప్రసాద్ (చిరంజీవి) నేషనల్ సెక్యురిటీ ఏజెన్సీలో పని చేస్తుంటాడు. చూడ్డానికి చాలా హుషారుగా, సరదాగా ఉంటాడు కానీ.. లోపల ఏదో బాధ. తన భార్య శశిరేఖ (నయనతార), ఇద్దరు పిల్లలూ దూరమయ్యారన్న వెలితి. పదేళ్ల క్రితమే తన భార్యకు విడాకులు ఇవ్వాల్సివస్తుంది. అయితే తన పిల్లలు పదే పదే గుర్తుకు వస్తుంటారు. వాళ్లని ఒక్కసారి కలుసుకొని, కొన్ని జ్ఞాపకాలు పోగేసుకొనే క్రమంలో.. పిల్లల దగ్గరకు పీటీ టీచర్ గా వెళ్తాడు. మెల్లగా వాళ్లతో పరిచయం పెంచుకొని, దగ్గరవుతాడు. ఈ క్రమంలో మాజీ మామగారు (సచిన్ ఖేడ్కర్)కి ప్రాణహాని ఉందని తెలుస్తుంది. దాంతో అత్తగారింటికే సెక్యురిటీ ఆఫీసర్ గా వెళ్తాడు. ఇంతకీ వర ప్రసాద్ మావయ్యకి వచ్చిన ఆపద ఏమిటి? అందులోంచి తనని ఎలా తప్పించాడు? ఆ క్రమంలో మాజీ భార్యకు ఎలా దగ్గరయ్యాడు? వీరిద్దరి కథలోకి వెంకీ గౌడ (వెంకటేష్) ఎందుకొచ్చాడు? అనేది తెరపై చూసి తెలుసుకోవాలి.
అనిల్ రావిపూడి సినిమాల్లో భూమి బద్దలైపోయే కథలేం ఉండవు. తన బలం వినోదమే. పాత్రలు, వాటి మధ్య సరదాలు, ఫ్యామిలీ ఎమోషన్స్, లాజిక్ లేని ఎంటర్టైన్మెంట్.. ఇవే తన బలం. ఈసారీ వాటినే నమ్ముకొన్నాడు. కథగా చూస్తే.. ‘ఇందులో ఏం లేదు’ అనిపిస్తుంది. కానీ తెరపై చూసినప్పుడు మాత్రం ఆ సంగతి గుర్తు రాకుండా సన్నివేశాలు, పాత్రలు, అవి పంచే వినోదంతో మమేకమైపోతాం. అదే రావిపూడి మ్యాజిక్. మాస్ ఇమేజ్, స్టార్ డమ్ ఉన్న చిరంజీవి లాంటి హీరోలకు సన్నివేశాలు రాయడం ఎంత కష్టమో.. అంత సులభం కూడా. చిరుని ఓ స్టార్ గా చూస్తే కొత్తగా సన్నివేశాలు సృష్టించలేం. కానీ.. చిరులోని ఎంటర్టైనర్ని మాత్రమే చూస్తే చాలా సరదాగా అనిపిస్తుంది. అనిల్ రావిపూడి అదే చేశాడు. చిరులోని ఎంటర్టైనర్ని మాత్రమే చూశాడు. అందుకే కొత్తగా చిరుని ఆవిష్కరించగలిగాడు.
మెగాస్టార్ ని ఇంత సింపుల్ గా ఫ్యామిలీ మాన్ లా చూపించొచ్చా? అనిపించేలా ఎంట్రీ సీన్స్ డిజైన్ చేశాడు. అప్పుడే ఈ సినిమా సరైన దారిలోనే వెళ్లబోతోందన్న విమెగాస్టార్. ఫస్ట్ ఫైట్, ఆ తరవాత పాట రెగ్యులర్ గానే ఉంటాయి. కానీ.. ఫైట్‌కి ముందు చిరుతో కామెడీ పండించిన విధానం, పాటలో చిరు వేసిన హుక్ స్టెప్స్ అభిమానులకు నచ్చేస్తాయి. ఆ తరవాత నయనతారతో ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లాడు. ఈ కథని చాలా సింపుల్ గా తేల్చేసి మంచి పని చేశాడు అనిల్. ఇంకాస్త లెంగ్త్ ఎక్కువైనా బోర్ కొట్టేది. పిల్లల ఎపిసోడ్ కూడా ఆసక్తికరంగానే అనిపించింది. బుల్లిరాజు సీన్ ఒక్కటే అయినా బాగానే నవ్వించింది. ‘శశిరేఖ’ పాట పిక్చరైజేషన్ బాగుంది. అడవి సీన్లో ‘ఇందువదన కుందరొదన’ బిట్ హైలెట్. చిరు తనపై తాను వేసుకొన్న సెటైర్ ఇది. అలా ఫస్టాఫ్ లో ఎక్కడా కంప్లైంట్స్ లేకుండా చక చక నడిపించేశాడు. అన్ని చోట్లా అనిల్ రావిపూడి రైటింగ్ కంటే, చిరు కామెడీ టైమింగే ఎక్కువ ప్లస్ అయ్యింది. ఇంట్రవెల్ లో.. ‘గ్యాంగ్ లీడర్’ రిఫరెన్స్ కనిపిస్తుంది. ఓ ఫోక్ సాంగ్ ని వాడుకొని.. కాస్త హుషారు తెప్పించారు.
సెకండాఫ్‌లో కథ డ్రాప్ అవుతూ, మధ్యమధ్యలో లేస్తూ ఉంటుంది. మహిళామణుల ఎపిసోడ్ తో మళ్లీ ఆడిటోరియం అలెర్ట్ అవుతుంది. ఆడవాళ్లు తమని తాము ఐటెంటిఫై చేసుకొంటూనే, మగాళ్ల ఈగోని శాటిస్పై చేసిన సీన్ అది. అక్కడ కూడా చిరు.. చాలా కూల్ గా, కామ్ గా తన పని తాను చేసుకొని వెళ్లిపోయాడు. ఇక అన్నింటికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఎపిసోడ్ వెంకీ గౌడది. చిరు – వెంకీలాంటి స్టార్లని ఒకేసారి, ఒకే సినిమాలో చూడడం ట్రీట్. ఈ ఎపిసోడ్ కోసమే అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూశారు. అంచనాలు పెరిగిపోవడం వల్లో ఏమో.. అనుకొన్నంత సంతృప్తి ఇవ్వలేకపోయింది. కానీ చిరు పాటలకు వెంకీ స్టెప్పులు వేయడం, వెంకీ పాటలకు చిరు అల్లరి చేయడం తో ఆ సీన్లూ టైమ్ పాస్ అయిపోతాయి. ఇద్దరూ కలిసి ఓ పాటలో ఆడిపాడారు. ఓ ఫైట్ లో పాలు పంచుకొన్నారు. ఎలాగోలా ఆ పాత్రకూ ఓ ముగింపు ఇచ్చాడు అనిల్ రావిపూడి. విలన్ ట్రాక్ ఈ సినిమాలో చాలా వీక్ గా అనిపిస్తుంది. ఒక విలన్ ఉండాలి కాబట్టి, ఆ ట్రాక్ రాసుకొన్నాడు. వెంకీ సీన్లూ, విలన్ ట్రాక్.. వీటిపై అనిల్ రావిపూడి దృష్టి పెట్టి ఉంటే.. కచ్చితంగా అనిల్ రావిపూడి కెరీర్లో ఇది బెస్ట్ ప్రొడక్ట్ అయ్యేది. ఇప్పటికీ మించిపోయిందేం లేదు. సంక్రాంతికి కావాల్సిన సినిమానే ఇవ్వగలిగాడు. చిరుకామెడీ టైమింగ్, అనిల్ రావిపూడి ఎంటర్టైనింగ్ స్కిల్స్ ఈ సినిమాకు బాగా పనికొచ్చాయి. సినిమాని కలర్ ఫుల్ గా తీర్చిదిద్దడం, పాటలు ప్లస్ అవ్వడం, చిరు వెంకీలాంటి ఇద్దరు స్టార్లని ఒకే స్క్రీన్ పై చూడగలగడం ఇవన్నీకిక్ ఇస్తాయి.
చిరు లుక్స్ సూపర్ గా అనిపించాయి.తన కాస్ట్యూమ్స్ బాగున్నాయి. రీ ఎంట్రీలో ఇదే బెస్ట్ అప్పీరియన్స్ అనుకోవచ్చు. తనని తాను తగ్గించుకొని చాలా సీన్లు చేశాడు. అదే.. వర ప్రసాదు పాత్రని నిలబెట్టింది. కామెడీ పక్కన పెడితే.. సున్నితమైన ఎమోషన్స్ లోనూ చిరు రాణించగలిగాడు. వెంకీది గెస్ట్ రోల్ మాత్రమే. చిరు, అనిల్ కోసం ఈ సినిమా ఒప్పుకొని ఉంటాడు. తన ఎప్పీరియన్స్ అభిమానులకు నచ్చుతుంది. నయన లుక్స్ బాగున్నాయి. తన పాత్ర హుందాగా వుంది.
చిరంజీవి లాంటి మెగాస్టార్‌కి సంగీతం అందించే అవకాశాన్ని భీమ్స్ అందిపుచ్చుకొన్నాడు. మీసాల పిల్ల చాట్ బస్టర్ గా నిలిచింది. పాటలు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో మాత్రం వీక్ అనిపిస్తోంది. కెమెరా పనితనం బాగుంది. లిమిటెడ్ లొకేషన్లయినా బోరింగ్ అనిపించలేదు. క్లాసీ, గ్లాసీ లుక్స్ తో సినిమాని బాగా డిజైన్ చేశారు. అనిల్ రావిపూడి ఈసారి కథని, కథనాన్ని కాకుండా ఎంటర్టైన్మెంట్ నమ్ముకొన్నాడు. చిరుని ఇలాంటి నీట్, క్లాస్ రోల్ లో చూసి ఎంత కాలమయ్యిందో. కాబట్టి చిరు ఫ్యాన్స్ కి నచ్చేస్తుంది. కొన్ని సీన్లు, ఎమోషన్లు బాగా డీల్ చేశాడు. ముఖ్యంగా అత్తా కోడళ్ల ఎపిసోడ్ దగ్గర తన రైటింగ్ స్కిల్స్ బాగా కనిపిస్తాయి. ప్రేక్షకులకు ఏం కావాలో అనిల్ రావిపూడికి బాగా తెలుసు. కాబట్టే అన్ని విజయాలు దక్కించుకొన్నాడు. ఈసారి కూడా అభిమానుల్ని, ప్రేక్షకుల్ని, పండగ వైబ్స్‌ని దృష్టిలో ఉంచుకొని ఓ సినిమా తీశాడు. థియేటర్ల దగ్గర కూడా పండగ తెచ్చాడు.
Mana Shankara Vara Prasad Garu Telugu Review
Telugu360 Rating: 3/5
