ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హౌదా పంచాయితీలోకి ఈశాన్య మాణిక్యంగా పేరొందిన త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ను తీసుకురావడం హాస్యాస్పదం. ఆయనేదో హౌదా దండగ అని సమర్థించినట్టు కొన్ని పత్రికలూ వెబ్సైట్లు కథనాలు ప్రచురించాయి. అయితే ఆ కథనాలలో మాణిక్ సర్కార్కు ఆపాదించిన భావాల సారాంశం మాత్రం ఆయనది కాదు. కేంద్రం నిరంకుశంగా వ్యవహరిస్తున్నదని, నిధులు నిరాకరిస్తున్నదని విమర్శించారే తప్ప ఆవి వ్యర్థమనీ, ఆశలు వదులుకోవాలని ఆయన ఎప్పుడూ చెప్పలేదు.
వాస్తవానికి 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు రావడానికి ముందే ఈశాన్య రాష్ట్రాలు తమ ప్రత్యేక హౌదా కొనసాగింపుకోసం కృషి ప్రారంభించాయి. దీనిపైనె మాణిక్ సర్కార్ ప్రధానికి ఒక లేఖ రాశారు. ఎన్డిసి సమావేశంలోనూ లేవనెత్తారు. 2015 జూన్లో ఏడు ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమై ఈ మేరకు ఒక తీర్మానం చేశారు. దానిపై ప్రధానితో మాట్లాదేందుకు సమయం కోరారు. ఎట్టకేలకు 2015 జూన్ 10న ప్రధాని కార్యాలయం పిలుపు మేరకు మాణిక్ సర్కార్ ఢిల్లీ వెళ్లి చర్చలు జరిపివచ్చారు. తమ రాష్ట్రానికి 23,000 కోట్ల నిధులు వచ్చేవని, కేంద్రం 90:10శాతం చొప్పున ఇవ్వడం వల్లనే ఆర్థికంగా నిలదొక్కుకోగలిగామని తెలిపారు. 14 వ ఆర్థిక సంఘం ఆ ప్రత్యేకత చూపకపోవడం ఒక విధంగా ఈశాన్య రాష్ట్రాల ప్రత్యేకహౌదాకు ఆటంకంగా వుంది గనక స్పష్టంగా దాన్ని కొనసాగించాలని గట్టిగా కోరారు. ఆ సమయంలో ప్రధాని నీటి ఆయోగ్ చూసుకుంటుందని జవాబు చెప్పారు. దీనిపై మాణిక్ సర్కార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం నిరంకుశవైఖరికి వ్యతిరేకంగా రాష్ట్రాలు పోరాడాలని పిలుపునిచ్చారు.కనుక నిధులు రావడం లేదని చెప్పడమంటే తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్నట్టు చేతులెత్తేసి అదే గొప్ప అని ఆయన మద్దతు పలకలేదు. కేంద్ర మంత్రులకు సన్మానాలు చేయడం లేదు. 14 వ ఆర్థిక సంఘం 42శాతానికి నిధులు పెంచడం గొప్పేమీ కాదంటూ కేంద్ర పథకాల రద్దు గురించి ఆయన విమర్శించారు. తాము నిజానికి యాభై శాతం నిధులు రాష్ట్రాలకు పంపిణీ చేయాలని అడుగుతుంటే అంతకన్నా తక్కువగానే ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిందని కూడా మాణిక్ సర్కార్ వ్యాఖ్యానించారు.ఒకవైపున సహకార సమాఖ్య అంటూ ఇలా చేయడమేమిటని కేంద్రంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.కనుక ఆయన హౌదా అనవసరమన్నారని, అది ఆంధ్ర ప్రదేశ్లో పోరాడుతున్న వారికి కనువిప్పు కావాలని చెప్పడం సత్యాన్ని తలకిందులు చేయడమే. నిజంగా హౌదా రద్దు చేసిన రోజున ఈశాన్య రాష్ట్రాలు నిరసన పెంచవచ్చు కూడా.
నిజానికి అస్సాం ఎన్నికల ప్రచారసమయంలో అప్పటి ముఖ్యమంత్రి తరుణ్ గోగోరు దీనిపై తీవ్ర నిరసన తెలిపారు. 2015 మార్చిలో ఆ రాష్ట్ర శాసనసభ దీనిపై ఏకగ్రీవ తీర్మానం ఆమోదించింది. ప్రత్యేక హాదా నిరాకరిస్తే కోర్టుకు వెళతానని కూడా హెచ్చరించారు. ఆసమయంలో బిజెపి అటూ ఇటూ కాకుండా మాట్టాడింది. ఎన్నికల్లో గెలిచిిన బిజెపి ముఖ్యమంత్రి సర్వానంద సోనావాల్ ప్రభుత్వం కూడా శాసనసభలో దీనిపై కాంగ్రెస్ నేతల ప్రశ్నలకు ఉక్కిరి బిక్కిరి కావలసి వచ్చింది. అయితే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం లాగే అస్సాం సర్కార్ కూడా హౌదాకు సమానమైన నిధులు అంటూ సన్నాయి నొక్కులు నొక్కింది. అక్కడ సమస్య ఇంకా సమిసిపోలేదు కూడా. చిన్నవైన ఈశాన్య రాష్ట్రాలు వున్నది పోకుండా ఇంతపోరాడుతుంటే కొత్తగా వాగ్దానం పొందిన ఇంత కీలక రాష్ట్రం, కేంద్రంలో భాగస్వామి తెలుగుదేశం నిస్సహాయంగా ఆమోదించడం ఆశ్చర్యమే.