మిరాయ్ సినిమాలో మంచు మనోజ్ ఒక బలమైన పాత్ర చేశారు. ఆ పాత్రకు వన్నె తెచ్చేలా ఆయన నటన మెప్పించింది. నిజానికి ఈ సినిమానే తన కంబ్యాక్ మూవీయిగా ఎంచుకున్నారు మనోజ్. అయితే ఆ గ్యాప్‌లో భైరవం వచ్చి వెళ్ళిపోయింది. ఆయన ఆశలు మాత్రం మిరాయి పైనే ఉన్నాయి. ఆయన ఆశించినట్లే ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది, మనోజ్ పాత్రకీ మంచి పేరు వచ్చింది.
అయితే ఈ సినిమా విషయంలో మనోజ్ కి ఓ లోటు కనిపించింది. పాన్ ఇండియా సినిమా కావడంతో ఐదు భాషల్లో రిలీజ్ చేశారు. అన్ని భాషల్లోనూ ప్రమోషన్ జరిగినా, మనోజ్ మాత్రం తెలుగు రాష్ట్రాల్లో తప్ప ఎక్కడా ప్రమోషన్స్‌కి వెళ్ళే అవకాశం రాలేదు. ఈ విషయాన్ని ఆయన పలుమార్లు వేదికపై ప్రస్తావించారు.
సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా ‘తమ్ముడు తేజ సినిమా కోసం కష్టపడ్డాడు, బాగా ప్రమోట్ చేశాడు, నన్ను మాత్రం పిలవలేదు. అయితే ఈ గ్యాప్ లో నేను డబ్బింగ్ పూర్తి చేసుకున్నాను” అని పరోక్షంగా తన ఫీలింగ్ ని వ్యక్తం చేశారు. తాజాగా జరిగిన థ్యాంక్యూ మీట్లో కూడా అదే విషయం మళ్లీ ప్రస్తావించారు.“మా టీం రాత్రిపగలు తిరిగారు, కానీ నన్ను మాత్రం వదిలేశారు” అని చెప్పడం ద్వారా తన మనసులోని మాట బయటపెట్టారు.
మల్టీ స్టారర్ సినిమాలు చేస్తున్నప్పుడు, హీరోతో పాటు మరో పవర్ఫుల్ పాత్ర చేసిన నటుడినీ ప్రమోషన్స్‌లో భాగం చేస్తే తప్పకుండా ఆ నటుడికి పాజిటివ్ బజ్ వస్తుంది. మనోజ్ కూడా అదే ఆశించారు. కానీ నేటి పాన్ ఇండియా ప్రమోషన్స్‌లో ట్రెండ్ మారిపోయింది. హీరోనే మెయిన్ ఫేస్‌గా ప్రెజెంట్ చేస్తున్నారు.
పుష్ప సినిమాలో కూడా పెద్ద స్టార్ కాస్ట్ ఉన్నప్పటికీ, అన్ని ఈవెంట్స్‌లో అల్లు అర్జున్ ఒక్కరే కనిపించారు. ఇది ఒక విధంగా కొత్త ప్రమోషన్ స్ట్రాటజీగా మారింది. అదే తరహాలో తేజ కూడా మిరాయ్ కి మెయిన్ ఫేస్ అయ్యారు. అయితే తనని ప్రమోషన్స్‌లో ఇన్వాల్వ్ చేయలేదనే బాధ మాత్రం మనోజ్ మాటల్లో కనిపించింది.