యుద్ధం కారణంగా గల్ఫ్ లో ఇరుక్కుపోయినవారు ఆర్తనాదాలుపెడుతున్నారు. మీడియా సెలబ్రిటీలకు ప్రాధాన్యం ఇస్తోంది. దుబాయ్ లాంటి అంతర్జాతీయ విమానాశ్రయంలో కేవలం .. విమానం మారడానికి దిగిన వారు వేలల్లో ఉంటారు. వారిలో తెలుగువారు ఉంటారు. అలాగే ఇతర గల్ఫ్ దేశాల్లో కూడా ఉన్నారు. వారిలో సెలబ్రిటీలు ఉండవచ్చు కానీ.. ఎవర్నీ తీసుకురాలేని పరిస్థితి ఉంది. కేంద్రం అయినా.. మరొకరు అయినా గగనతలం మూసేసినందున తీసుకురాలేరు. అక్కడ సురక్షితంగా ఉండేలా ..చూడాలని అక్కడి ప్రభుత్వాలను కోరడం తప్ప ఏమీ చేయలేదు.
ఎయిర్ పోర్టులు మూసివేత
దుబాయ్, అబుదాబి వంటి అంతర్జాతీయ విమానాశ్రయాలు ఇప్పుడు దిగ్బంధంలో ఉన్నాయి. అయితే మీడియా కవరేజ్ మాత్రం పి.వి. సింధు, సోనాల్ చౌహాన్ వంటి సెలబ్రిటీలు ఎక్కడ చిక్కుకుపోయారు? వారు ఏం తింటున్నారు? అనే అంశాల చుట్టూనే తిరుగుతోంది. విదేశీ ప్రయాణాల్లో ఉన్నప్పుడు అనుకోని విధంగా విమానాలు రద్దయితే సామాన్యులు ఎదుర్కొనే ఆర్థిక సమస్యలు వర్ణనాతీతం. చాలామంది వద్ద ఉన్న విదేశీ కరెన్సీ ఖర్చయిపోయి, కనీసం ఆహారం కొనుక్కోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. సెలబ్రిటీలు హోటళ్లలో సురక్షితంగా ఉండగలిగినా, సామాన్య కూలీలు, విజిట్ వీసాపై వెళ్తున్న మధ్యతరగతి వారు ఎయిర్పోర్ట్ లాంజ్ల్లోనే కాలం వెళ్లదీస్తున్నారు. ప్రభుత్వం కేవలం హెల్ప్‌లైన్ నంబర్లు ఇచ్చి చేతులు దులుపుకోకుండా, అక్కడ చిక్కుకున్న ప్రతి భారతీయుడికి కనీస వసతులు అందేలా స్థానిక ఎంబసీల ద్వారా ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది.
అసలు సామాన్యుల గోడు పట్టించుకునేవారు ఎవరు?
ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ కానీ, మరే ఇతర దేశం కానీ ప్రత్యేక విమానాలను పంపి ఎవరినీ తీసుకురాలేని పరిస్థితి. గాల్లో యుద్ధ విమానాలు, క్షిపణులు తిరుగుతున్న వేళ సివిల్ విమానాలను పంపడం ఆత్మహత్యాసదృశ్యమే అవుతుంది. ఈ నిజాన్ని ప్రయాణికుల కుటుంబాలకు స్పష్టంగా వివరించాలి. ఎయిర్ స్పేస్ ఓపెన్ అయిన తర్వాతనే రెస్క్యూ ఆపరేషన్లు సాధ్యమవుతాయని, అప్పటి వరకు వారు ఎక్కడ ఉన్నారో అక్కడే సురక్షితంగా ఉండేలా చూడడమే ఏకైక మార్గం. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో గల్ఫ్ దేశాల ప్రభుత్వాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, మన వారి భద్రతకు హామీ తీసుకోవాలి.
ధైర్యం ఇవ్వడమే అసలైన పునరావాసం
ఈ సంక్షోభ సమయంలో సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలు, భయానక వీడియోలు బాధితుల కుటుంబాల్లో మరింత ఆందోళన నింపుతున్నాయి. ప్రభుత్వం , మీడియా చేయాల్సింది ఒక్కటే.. సెలబ్రిటీల వ్యక్తిగత వివరాల కంటే, అక్కడ చిక్కుకున్న తెలుగు వారందరికీ అందుతున్న సహాయం గురించి మాట్లాడాలి. మీరు సురక్షితంగా ఉన్నారు, ఎయిర్ స్పేస్ తెరిచిన వెంటనే మిమ్మల్ని ఇంటికి చేరుస్తాం అనే భరోసాను అధికారికంగా కల్పించాల్సి ఉంది. మీడియా కూడా ఈ దిశగానే ప్రయత్నించాల్సి ఉంది.


