మావోయిస్టులు చర్చలకు సిద్ధమని అంటున్నారు. ఆయుధాలను కూడా వదిలేస్తున్నామని ప్రకటించారు. కానీ కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు. తన పని తాను చేసుకుపోతోంది. ఇప్పుడు మావోయిస్టులకూ మార్గం లేదు. వారు ఒక్కో అడుగు ముందుకు వేస్తూ తమ నిస్సహాయతను ప్రకటిస్తున్నారు. చివరికి వారికి మిగిలింది ఒక్కటే ఆప్షన్.. లొంగిపోవడం. ప్రజా జీవితంలోనే తాము అనుకున్న లక్ష్యాలను.. ప్రజాస్వామ్య పద్దతిలో సాధించేందుకు ప్రయత్నించడం.
మావోయిస్టులను అంతం చేయడానికి వచ్చే ఏడాది మార్చి నెలాఖరు వరకూ గడువు పెట్టుకున్నారు అమిత్ షా. ఆయన వద్ద ఎంత మంది మావోయిస్టులు ఉన్నారో లెక్క ఉంది. వారందర్నీ నిర్దాక్షిణ్యంగా హత మార్చాలని డిసైడ్ అయ్యారు. అంతర్గత శత్రువులు ఉండటం ..బలహీనమైనా సరే మంచిది కాదని ఆయన అనుకుంటున్నారు. అందుకే ఆపరేషన్ కగార్ ప్రారంభించారు. ఇప్పటికి దొరికిన వారినందర్నీ ఎన్ కౌంటర్ చేశారు. ఆ మిషన్ ఇప్పుడు అగ్రనేతలపై గురి పెట్టింది.
మారిపోయిన కాలంలో ఇప్పుడు మావోయిస్టులు అడవుల్లో తలదాచుకుని సేఫ్గా ఉన్నామని అనుకోవడానికి లేదు. అంతర్జాతీయ గ్రూపుల నుంచి మద్దతు పొంది దేశంలోనే అంతర్గత తిరుగుబాటు తెస్తామని ఆశపడటానికీ లేదు. ఎందుకంటే..ఏం జరిగినా తెలిసిపోయే వ్యవస్థలు అందుబాటులోకి వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో మావోయిస్టులకు మరో మార్గం లేదు. తాము ఆజ్ఞాత పోరాటం చేస్తామని అనుకుంటే అంత కంటే అమాయకత్వం ఉండదు. తాము చర్చలకు సిద్ధమని ప్రకటిస్తే.. వారి నిస్సహాయతను చూసి కేంద్రం కూడా నవ్వుతుంది. ప్రాణాలు పోకుండా కాపాడుకోవడానికి తంటాలు అని భావిస్తుంది.
నిజానికి వారి ఆరాటం కూడా అదే. ఎన్ కౌంటర్ అయిన వాళ్లు అవగా.. మిగిలిన కొద్ది మంది లొంగిపోతున్నారు. వారికి అప్పుడే రివార్డ్ ఇచ్చి జన జీవన స్రవంతిలోకి పంపేస్తున్నారు పోలీసులు. ఇంత కాలం చేసిన దానికి ఎలాంటి ప్రతిఫలం రాలేదని మావోయిస్టు అగ్రనాయకత్వానికీ అర్థం అయింది. కానీ లొంగిపోవాలంటే వారికి ఈగో అడ్డం వస్తుందేమో కానీ.. చర్చలు అంటున్నారు. వారు అన్నీ మానేసి..లొంగిపోయి.. ప్రభుత్వం ఇచ్చే రివార్డ్ తీసుకుని ప్రజాస్వామ్యంలో తాము చేయాలనుకున్నది చేస్తే మరిన్ని ఎన్ కౌంటర్లు అనే మాట ఈ దేశ ప్రజలు వినకుండా ఉంటారన్నది ఎక్కువ మంది అభిప్రాయం.
